పారిపోవడం కాదు.. హత్యే మార్గం! కేతన్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి..
x

పారిపోవడం కాదు.. హత్యే మార్గం! కేతన్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి..

పూణే రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. సియా గోయల్ ఇచ్చిన సంకేతంతో ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కేతన్‌ను లోయలోకి తోసేశాడు.


Click the Play button to hear this message in audio format

పూణే రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న సియా గోయల్ లోహగడ్ కోట వద్ద జరిగిన ఘటనలను బయటపెట్టింది. జూన్ 18న కోటపై నుంచి కేతన్‌ను లోయలోకి తోసివేయడానికి ముందు, తన ప్రియుడు చేతన్ చౌదరి అక్కడే ఉన్నాడని చెప్పింది.

ముందుగా అనుకున్న పథకం ప్రకారం.. లోహగడ్ కోట వద్ద సియా ఒకచోట కూర్చోవడాన్ని సంకేతంగా భావించిన చేతన్ చౌదరి, కేతన్‌ సమీపానికి వచ్చి అతన్ని లోయలోకి తోసేశాడు. పారిపోయి పెళ్లి చేసుకుంటే రెండు కుటుంబాల పరువు పోతుందనే భయంతో సియా, చేతన్ ఇద్దరూ కేతన్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు దర్యాప్తులో తేలింది. విచారణ ప్రారంభంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు నిందించుకున్నా.. తర్వాత హత్య కుట్ర తానే పన్నానని సియా అంగీకరించింది. ఈ హత్యకు చేతన్ కూడా చేతులు కలిపాడని తెలిపింది.

దర్యాప్తులో మరో విషయం కూడా బయటపడింది. ఈ హత్యకు ముందు రెండుసార్లు కేతన్‌ను లోహగడ్ కోటకు తీసుకెళ్లి చంపేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని పోలీసులు చెప్పారు.

నవంబర్‌లో ఉదయ్‌పూర్‌లోని ఓ ప్యాలెస్‌లో కేతన్, సియాల వివాహం జరగాల్సి ఉండగా, సియా ఆ పెళ్లికి ఇష్టపడలేదని దర్యాప్తులో తేలింది.

ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై స్పందించిన సియా తండ్రి, నిందితులకు అత్యంత కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఈ నేరానికి బాధ్యులు ఎవరైనా సరే, తన సొంత కుమార్తె అయినా చట్టం ప్రకారం కఠినంగా శిక్షించాలని కోరారు. కేతన్ తమ కుటుంబానికి కొడుకులాంటివాడని, ఈ ఘటన రెండు కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, తన కుమార్తెకు మరో వ్యక్తితో ప్రేమ సంబంధం ఉందన్న విషయం తమకు ముందుగా తెలియదని స్పష్టం చేశారు.

Read More
Next Story