
అప్టోజెనెటిక్స్ పరిశోధకులకు నోబెల్ సైన్స్ బహుమతి
మెదడులోని కణాలపై విస్తృత పరిశోధన చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలు
మెదడులోని నరాల కణాలను వెలుతురుతో నియంత్రించే కీలక సాంకేతికతను అభివృద్ధి చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు 2026 వైద్య నోబెల్ పురస్కారం లభించింది. జర్మనీకి చెందిన పీటర్ హెగెమన్, జార్జ్ నాగెల్, అమెరికాకు చెందిన కార్ల్ డీసెరోత్‌లను ఫిజియాలజీ లేదా మెడిసిన్ నోబెల్‌కు ఎంపిక చేసినట్లు సోమవారం ప్రకటించారు.
వీరి పరిశోధనల ఫలితంగా అభివృద్ధి చెందిన ఆప్టోజెనెటిక్స్ సాంకేతికత ద్వారా మెదడులోని నిర్దిష్ట నరాల కణాలను వెలుతురుతో నియంత్రించడం సాధ్యమైంది. దీని ద్వారా నరాల కణాలు జ్ఞాపకాలు, భావోద్వేగాలు, ప్రవర్తనపై ఎలా ప్రభావం చూపుతాయో మరింత స్పష్టంగా అధ్యయనం చేయగలుగుతున్నారు.
ఈ పరిశోధనకు పీటర్ హెగెమన్, జార్జ్ నాగెల్ చేసిన అధ్యయనాలు పునాది వేశాయి. వెలుతురుకు స్పందించే ఆల్గీ జీవులపై పరిశోధనలు చేస్తున్న సమయంలో వారు చానల్‌రోడాప్సిన్ అనే ప్రత్యేక ప్రొటీన్‌ను గుర్తించారు. నీలి వెలుతురు పడినప్పుడు ఈ ప్రొటీన్‌లోని ఛానల్ తెరుచుకుని అయాన్లు కణంలోకి ప్రవేశించేలా చేస్తుందని వారు గుర్తించారు. దీంతో ఆ కణంలో విద్యుత్ సంకేతం ఏర్పడుతుంది.
ఈ ఆవిష్కరణను తర్వాత కార్ల్ డీసెరోత్ నర కణాలపై ప్రయోగించారు. చానల్‌రోడాప్సిన్‌కు సంబంధించిన జన్యువును ఎలుకల నర కణాల్లో ప్రవేశపెట్టి, వెలుతురు ద్వారా వాటిని క్రియాశీలం చేయగలిగారు. అనంతరం జీవించి ఉన్న ఎలుకల మెదడులోనూ ఇదే విధానాన్ని ఉపయోగించి నిర్దిష్ట నర కణాలను నియంత్రించడం సాధ్యమైంది.
ఈ విధానమే ఆప్టోజెనెటిక్స్‌గా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం నర వ్యవస్థపై పరిశోధనల్లో ఇది ముఖ్యమైన సాధనంగా మారింది. మెదడులోని నర మార్గాలు జ్ఞాపకాలు, భావోద్వేగాలు, ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడంతో పాటు, దృష్టి లోపాన్ని సరిచేసే అవకాశాలపై పరిశోధనల్లోనూ దీనిని ఉపయోగిస్తున్నారు.
న్యూరోసైన్స్‌లో కొత్త పరిశోధనలకు మార్గం చూపిన ఈ కృషికి గుర్తింపుగా హెగెమన్, నాగెల్, డీసెరోత్‌లకు 2026 వైద్య నోబెల్ పురస్కారం ప్రకటించారు. ఈ ప్రకటనతో 2026 నోబెల్ పురస్కారాల ప్రక్రియ ప్రారంభమైంది. మిగతా విభాగాల విజేతలను కూడా నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ప్రకటించనున్నారు.

