సోమవారం గ్రీవెన్స్‌కు దిక్కులేదు.. శుక్రవారం ఏమవుతుంది?
x
కలెక్టర్ల మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు

సోమవారం గ్రీవెన్స్‌కు దిక్కులేదు.. శుక్రవారం ఏమవుతుంది?

అర్జీలు తీసుకుని పరిష్కరించే క్రమంలో తహశీల్దార్ లు విఫలమవుతున్నారు. ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి.


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ల సమావేశంలో “అర్జీలు కారులో పడేసి అలక్ష్యం చూపొద్దు.. ప్రజల సమస్యలు తీర్చాలి” అంటూ కఠిన సూచనలు చేశారు. ప్రతి శుక్రవారం ‘ఫీల్డ్ గ్రీవెన్స్ డే’ నిర్వహించాలని, నియోజకవర్గాలను నెలకు నాలుగు సార్లు సందర్శించాలని ఆదేశించారు. కానీ గ్రామ-మండల స్థాయిలో గ్రీవెన్స్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిన పరిస్థితి ఏర్పడింది.

యర్రగొండపాలెం తహశీల్దార్ కార్యాలయంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే… సోమవారం సాధారణ గ్రీవెన్స్ రోజు కూడా తహశీల్దార్‌లు కలెక్టరేట్‌కు వెళ్తున్నారు. అర్జీలు ఇవ్వాలనుకునే ప్రజలు నేరుగా కలెక్టర్‌ను కలవాల్సిన దుస్థితి ఏర్పడింది. తహశీల్దార్ కార్యాలయంలో అర్జీలు స్వీకరించినా ‘రసీదు ఇవ్వడం లేదు’. “ఎందుకు రసీదు ఇవ్వరు?” అని అడిగితే “కలెక్టరేట్‌కు వెళ్లండి, అక్కడే తహశీల్దార్ ఉంటారు” అని సెలవిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇక మిల్లంపల్లి ఏరియాలో ఎన్‌జీఓలకు కేటాయించిన ఇండ్ల స్థలాలను తెలుగుదేశం పార్టీకి చెందిన చోటా నాయకులు ఆక్రమించుకుంటున్నారని ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. కానీ తహశీల్దార్, ఎస్‌ఐలు కబ్జాదారులకు అనుకూలంగానే నిర్ణయాలు చేస్తున్నారని ప్రజల ఆరోపణ. “ఎన్ని ఫిర్యాదులు చేసినా ఫలితం లేదు. అధికారులు ఆక్రమణదారులకు మద్దతుగా మారారు” అని స్థానికులు వాపోతున్నారు.

ముఖ్యమంత్రి స్వయంగా “కొందరు కలెక్టర్లు అర్జీలు తీసుకుని కారులోనే పడేస్తున్నారు” అని అంగీకరించిన విషయం ఇప్పుడు గ్రామ స్థాయిలోనూ ప్రతిధ్వనిస్తోంది. ప్రతి శుక్రవారం ఫీల్డ్ గ్రీవెన్స్ నిర్వహించాలని, నియోజకవర్గాన్ని నాలుగు సార్లు సందర్శించాలని చెప్పడం ఎంతవరకు అమలవుతుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గ్రామస్థాయిలో పాలన చేరువైందని ప్రజలు భావించినా, అవినీతి, అక్రమాలు చేసేవారికి మద్దతుగా మారుతోందని చాలా మంది ఆరోపిస్తున్నారు.


సీఎం సూచనలు, నేలపై ఎంతవరకు?

ఇ-ఫైళ్ల క్లియరెన్స్, వాట్సాప్ గవర్నెన్స్, ఆన్‌లైన్ సేవలు అని ఎన్నో ఆధునిక వ్యవస్థల గురించి మాట్లాడుతున్నా… గ్రామ-మండల స్థాయిలో మూలస్తంభాలైన తహశీల్దార్ కార్యాలయాల్లోనే రసీదు లేని అర్జీలు, కబ్జా మద్దతు వంటి సమస్యలు కొనసాగుతుంటే ప్రజల్లో విశ్వాసం ఎలా పెరుగుతుంది?

“పీజీఆర్ఎస్ కోసం ప్రజాదర్బార్ వేదిక ఏర్పాటు చేస్తాం” అని సీఎం చెప్పిన మాటలు యర్రగొండపాలెంలోని ప్రజలకు ఇంకా కలలాగానే మిగిలిపోయాయి. కలెక్టర్లు, తహశీల్దార్లు, ఎస్‌ఐలు తమ వైఖరి మార్చుకోకపోతే… సీఎం చంద్రబాబు ప్రకటించిన ‘స్పీడ్, సర్వీస్’ లక్ష్యం కేవలం కాగితాల మీదనే మిగిలిపోయే ప్రమాదం ఉంది.

ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. మాటలు కాదు, మార్పు కావాలి!

Read More
Next Story