స్విమ్స్ కొత్త బాస్: సీనియర్ డాక్టర్లకు షాక్ ఇచ్చిన టీటీడీ
x

స్విమ్స్ కొత్త బాస్: సీనియర్ డాక్టర్లకు షాక్ ఇచ్చిన టీటీడీ

ఆర్వీ కుమార్ సేవలకు సెలవు. తెరపైకి ఊహించని పేరు. బర్డ్స్ డైరెక్టర్‌ జగదీష్ కు అదనపు బాధ్యతలు.


సమర్ధత, సేవా గుణం పనిచేయవు అనేది టీటీడీలొ మరోసారి రుజువైంది. వైసీపీ ప్రభుత్వంలో నియమితులైన స్విమ్స్ డైరెక్టర్ ఆర్వీ. కుమార్ పదవీకాలం ముగిసింది. ఆయన సేవలకు టీటీడీ సెలవు చెప్పింది. ఏడాది కాలానికి బర్డ్స్ ఆస్పత్రి డైరెక్టర్ గా టీడీపీ కూటమి ప్రభుత్వం నియమించిన బర్డ్స్ డైరెక్టర్ డాక్టర్ గుడారు జగదీష్ ను వేంకటేశ్వర వైద్య విజ్ణాన సంస్థ (SVIMS) స్విమ్స్ పూర్తి స్థాయి అదనపు డైరెక్టర్ గా బాధ్యతలు అప్పగించారు. టీటీడీ పాలక మండలి చైర్మన్ బీఆర్. నాయుడు నిర్ణయం మేరకు ఈఓ ముద్దాడి రవిచంద్ర మంగళవారం ప్రొసీడింగ్స్ జారీ చేశారు.


డైరెక్టర్ సేవలకు సెలవు..

టీటీడీ నిర్వహిస్తున్న స్విమ్స్ ఆస్పత్రి డైరెక్టర్, శ్రీపద్మావతీ మెడికల్ కాలేజీ వైస్ చాన్సలర్ డాక్టర్ ఆర్వీ. కుమార్ మూడేళ్ల పదవీ కాలం మంగళవారంతో ముగిసింది.
ఆయన సేవలు మరో ఏడాది కొనసాగిస్తారనే వార్తలు వినిపించాయి. ఈ పోస్టు కోసం చాలా మంది క్యూలో ఉన్నారు. నిబంధనల ప్రకారం 70 ఏళ్లు పైబడిన వారిని నియమించే అవకాశం లేదనీ, స్విమ్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్న సీనియర్ స్పెషలిస్టులకు ఆ హోదా దక్కుతుందని ఆశించారు. స్విమ్స్ ఆస్పత్రికి అనుబంధంగా నిర్వహించే శ్రీపద్మావతీ మెడికల్ ఆస్పత్రికి కూడా వైస్ ఛాన్సలర్ గా ఉంటారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన స్విమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ పదవి అనూహ్యంగా బర్డ్స్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ జగదీష్ కు దక్కింది.

ఆయన సేవలు ఇవీ...

శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ డైరెక్టర్‌గా డాక్టర్ ఆర్.వి. కుమార్ 2023 ఆగస్టు ఆఖరులో నియమితులయ్యారు. ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆస్పత్రిలో మౌలిక వసతుల విస్తరణతో పాటు పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పేద రోగులకు మేలు జరిగే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. శ్రీవెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టు నిధులతో పేదరోగులకు ఉచిత వైద్యం, శస్త్ర చికిత్సలు చేయించడానికి నిధులు మంజూరులో కీలక నిర్ఱయాలు తీసుకున్నారు. వివాదరహితుడిగా పేరు ఉన్న ఆయన సేవలను టీటీడీ వినియోగించుకుంటుందని భావించారు. ఆర్వీ. కుమార్ చేసిన సేవల్లో మచ్చుకు కొన్ని..
ఆరోగ్యశ్రీ సేవల విస్తరణ: పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందించడానికి ఆరోగ్యశ్రీ పథకం కింద మరిన్ని సంక్లిష్టమైన ఆపరేషన్లు, సూపర్ స్పెషాలిటీ చికిత్సలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఆధునిక వైద్య పరికరాల ఏర్పాటు: క్యాన్సర్, గుండె సంబంధిత రోగుల కోసం అత్యాధునిక రేడియోథెరపీ, క్యాథ్ ల్యాబ్ పరికరాలను సమకూర్చడం ద్వారా వైద్య నాణ్యతను పెంచారు.
ఓపీ (OP) సేవలు, మందుల పంపిణీ సరళీకరణ: ఆస్పత్రికి వచ్చే పేద రోగులు గంటల తరబడి వేచి ఉండకుండా ఓపీ కౌంటర్ల సంఖ్యను పెంచారు. అలాగే ఉచిత మందుల పంపిణీ కొరత లేకుండా చర్యలు చేపట్టారు.
క్యాన్సర్ రోగుల కోసం(Oncology): శ్రీపద్మావతి స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి, పేద క్యాన్సర్ బాధితులకు అవసరమైన కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సలను వేగవంతం చేశారు.
అత్యవసర విభాగం (Emergency & ICU) బలోపేతం: అత్యవసర పరిస్థితిలో వచ్చే రోగులకు త్వరితగతిన వైద్యం అందించేలా ఐసీయూ బెడ్ల సంఖ్యను పెంచడం, వైద్య సిబ్బంది అందుబాటును నిరంతరం పర్యవేక్షించడం చేశారు.
టీటీడీ (TTD) సహకారంతో సంక్షేమం: టీటీడీ నిధులతో పేద రోగులకు ఉచిత భోజన వసతి (అన్నప్రసాదం), రాయితీ లేదా ఉచిత వైద్య సేవలు సజావుగా అందేలా కృషి చేశారు.

ఎముకల శస్త్రచికిత్సలో మేటి బర్డ్స్

టీటీడీ ఆధీనంలో నిర్వహించే ( Sri Balaji Institute of Surgery, Research and Rehabilitation for the Disabled- BIRRD) బర్డ్స్ ఆస్పత్రి ప్రధానమైనది. ఎముకల శస్త్రచికిత్సలు, వైకల్య నివారణ, పునరావాస సేవలు అందించడంలో బర్డ్స్ ఆస్పత్రి ఆసియాలోనే ప్రసిద్ధం చెందింది. ఇక్కడ పేద రోగులకు తెలుపు రేషన్ కార్డు ఉన్న వారికి ఉచిత వైద్య సేవలతో పాటు, శస్త్రచికిత్సలు కూడా చేస్తుంటారు. అంతేకాకుండా, కృత్రిమ అవయాలు తయారీ చేసి, వికలాంగులకు అత్యాధునిక కృత్రిమ అవయాల తయారీతో పాటు ఉచితంగా అమర్చడం ఇక్కడ ప్రత్యేకత.
ఈ ఆస్పత్రిలో సుదీర్ఘకాలం పనిచేసిన తరువాత డాక్టర్ జగదీష్ 2019 మే నెలలో ఉద్యోగ విరమణ చేశారు. ఆస్పత్రిని కీర్తిశిఖరాల్లో నిలపడంలో విశిష్ట సేవలు అందించిన వైద్యుడిగా జగదీష్ కు పేరు ఉంది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో బర్డ్స్ డైరెక్టర్ డాక్టర్ జీ. జగదీష్

టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత డాక్టర్ జగదీష్ ను నెలకు రెండు లక్షల రూపాయల వేతనంతో ఏడాది కాలం సేవల కోసం 2025 ఏప్రిల్ ఒకటో తేదీ అప్పటి ఈఓ జే. శ్యామలరావు ఆదేశాలు జారీ చేశారు. ఏడాది పూర్తియిన తరువాత మళ్లీ ఆయన పదవీకాలం ఎప్పటి వరకు పొడిగించారనేది టీటీడీ అధికారవర్గాలు ధృవీకరించలేదు. ప్రస్తుతం ఆయన అదనపు డైరెక్టర్ గా స్వీమ్స్ ఆస్పత్రిని కూడా పర్యవేక్షించడం తోపాటు శ్రీ పద్మావతీ మెడికల్ కాలేజీకి వీసీగా బాధ్యతలు నిర్వహించనున్నారని సమాచారం.

Read More
Next Story