
అగ్నిమాపక నూతన వాహనాలు, పరికరాలు ప్రారంభం
రూ.33.25 కోట్ల విలువైన వాహనాలు, వివిధ పరికరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలోని పరేడ్ గ్రౌండ్ లో ప్రారంభించారు.
ప్రజల ప్రాణాలు, ఆస్తులను అగ్ని ప్రమాదాల నుంచి కాపాడడానికి అగ్నిమాపక శాఖను ఆధునికీకరించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కీలక అడుగు వేశారు. అమరావతి పరేడ్ గ్రౌండ్‌లో నూతనంగా కొనుగోలు చేసిన అగ్నిమాపక వాహనాలు, అధునాతన పరికరాలను జెండా ఊపి ప్రారంభించారు.
రూ.252.93 కోట్ల వ్యయంతో అగ్నిమాపక శాఖను ఆధునీకరించే కార్యక్రమంలో భాగంగా రూ.33.25 కోట్ల విలువైన వాహనాలు, వివిధ పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు సీఎంకు వివరించారు. తొలి దశలో రూ.18 కోట్లతో 25 అధునాతన అగ్నిమాపక శకటాలు (అడ్వాన్స్‌డ్ వాటర్ టెండర్లు), రూ.10 కోట్లతో హై ప్రెషర్ పంప్‌లతో కూడిన 40 క్విక్ రెస్పాన్స్ వాహనాలు, రూ.2.49 కోట్లతో 50 ఇన్‌ఫ్లేటబుల్ రబ్బర్ బోట్లు, రూ.2.08 కోట్లతో 30 బీఏ సెట్ కంప్రెసర్లను కొనుగోలు చేశారు.
కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారులు కొత్త వాహనాలు, పరికరాల సామర్థ్యాలు, వాటి వినియోగం గురించి ముఖ్యమంత్రికి వివరించారు. కేంద్ర నిధులను సమర్థవంతంగా వినియోగించిన అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు.
ప్రజల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ “ప్రజల ప్రాణాలు కాపాడడం మన ప్రథమ బాధ్యత. రాజధాని అమరావతితో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో హై-రైజ్ బిల్డింగ్‌లు వేగంగా నిర్మాణం అవుతున్నాయి. వాటికి అనుగుణంగా అగ్నిమాపక శాఖ అన్ని విధాలా ఆధునిక పరికరాలు, వాహనాలు సమకూర్చుకోవాలి” అని ఆదేశించారు.
గతంలో అగ్నిమాపక విభాగం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని, ఇప్పుడు మళ్లీ ఆ స్థాయికి ఎదగాలని సీఎం పేర్కొన్నారు. విపత్తుల సమయంలో పొరుగు రాష్ట్రాలకు సహాయం అందించిన చరిత్ర ఉందని గుర్తు చేశారు. అన్ని సవాళ్లను అధిగమించి, కేంద్ర పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుని శాఖను మరింత బలోపేతం చేయాలని అధికారులను సూచించారు.
ఈ కార్యక్రమంలో హోం మంత్రి అనిత, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, అగ్నిమాపక శాఖ డీజీ పీ.వి. రమణ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ నూతన వాహనాలు, పరికరాలు రాష్ట్రంలో అగ్ని ప్రమాదాలకు తక్షణం స్పందించే సామర్థ్యాన్ని మరింత పెంచి, ప్రజల భద్రతను బలోపేతం చేస్తాయని అధికారులు తెలిపారు.

