సంక్షేమ హాస్టళ్లలో నెట్ జీరో హెల్తీ క్యాంపస్‌లు
x

సంక్షేమ హాస్టళ్లలో నెట్ జీరో హెల్తీ క్యాంపస్‌లు

విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్యం కూడా సురక్షితం!


ఆంధ్రప్రదేశ్‌లోని అనేక సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఆస్పత్రి పాలైన సంఘటనలు ఇటీవలి కాలంలో సామాన్యులను కలచివేశాయి. ముఖ్యంగా బీసీ, ఎస్టీ, ఎస్సీ హాస్టళ్లు, గురుకుల విద్యా సంస్థల్లో ఈ సమస్యలు తీవ్రంగా నెలకొన్నాయి. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేకపోవడంతో విద్యార్థుల ఆరోగ్యం మాత్రమే కాకుండా, వారి చదువు కూడా దెబ్బతిన్నట్లు పలువురు విమర్శించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మక ‘నెట్ జీరో హెల్తీ క్యాంపస్’ (NZHC) విధానాన్ని అమలు చేయడం ద్వారా సంక్షేమ హాస్టళ్లను పూర్తి కొత్త రూపంలో మార్చేందుకు సిద్ధమయ్యారు. ఉద్యోగులు పద్దతులు సరిగా పాటిస్తే విద్యా విధానంతో పాటు విద్యార్థుల ఆరోగ్యం కూడా బాగుంటుందనేది ప్రజల వాదనగా మారింది.

నెట్ జీరో అంటే ఏమిటి? హాస్టళ్లకు ఎలా వర్తిస్తుంది?

నెట్ జీరో విధానం వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న ముఖ్యమైన వ్యూహం. ఒక క్యాంపస్ తన కార్యకలాపాల వల్ల వాతావరణంలోకి విడుదల చేసే గ్రీన్‌హౌస్ గ్యాసులు (ముఖ్యంగా కార్బన్ డయాక్సైడ్)ను సమానంగా తొలగించడం లేదా ఆఫ్‌సెట్ చేయడం ద్వారా నికర ఉద్గారాలు ‘సున్నా’ స్థాయికి తీసుకురావడమే లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మోడల్‌ను హాస్టళ్లకు అన్వయించి ‘నెట్ జీరో హెల్తీ క్యాంపస్’ (NZHC)గా అమలు చేస్తోంది.

నెట్ జీరో ఎనర్జీ: సోలార్ ప్యానెల్స్ ద్వారా సొంత విద్యుత్ ఉత్పత్తి చేసి విద్యుత్ బిల్లులు సున్నా చేయడం.

నెట్ జీరో కార్బన్: అత్యంత సాంద్రతతో అడవులు (అల్ట్రా-హై డెన్సిటీ ప్లాంటేషన్) నాటి కార్బన్‌ను గ్రహించడం.

నెట్ జీరో వేస్ట్: వ్యర్థాలను పూర్తిగా రీసైకిల్ చేయడం.

గ్రీన్ వాటర్: వర్షపు నీటిని సేకరించి నీటి కొరత తగ్గించడం.

హెల్తీ క్యాంపస్: RO నీరు, పరిశుభ్రమైన కిచెన్లు, ఆరోగ్యవంతమైన వాతావరణం.

ఈ మోడల్‌ను G.O.Ms.No.7 (సాంఘిక సంక్షేమ శాఖ, 06.04.2026) ద్వారా అమలు చేస్తున్నారు. 2026-27, 2027-28 సంవత్సరాల్లో రెండు దశల్లో అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ఈ మోడల్‌లోకి మార్చనున్నారు.

కిచెన్ వ్యర్థాలు సర్క్యులర్ ఎకానమీగా మార్చడం

హాస్టల్ కిచెన్ వ్యర్థాలు (కూరగాయల తొక్కలు, అవశేషాలు)ను ఆర్గానిక్ కంపోస్టింగ్ ద్వారా ఎరువుగా మార్చి, అదే క్యాంపస్‌లోని కిచెన్ గార్డెన్, ఫ్రూట్ గార్డెన్‌లకు ఉపయోగించనున్నారు. ఇది సర్క్యులర్ ఎకానమీకి చక్కటి ఉదాహరణ. వ్యర్థాలను బయటకు వేయకుండా లోపలే రీయూజ్ చేయడం, ఎరువు కొనుగోలు ఖర్చు తగ్గడం, మట్టి ఫెర్టిలిటీ పెంచడం, కార్బన్ ఉద్గారాలు తగ్గడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చెప్పినట్లు కిచెన్ వ్యర్థాలను సర్క్యులర్ ఎకానమీతో అనుసంధానం చేయడం ద్వారా హాస్టళ్లు ‘వృధా లేని’ స్వయం సమృద్ధి క్యాంపస్‌లుగా మారతాయి.

ముఖ్యమంత్రి దూరదృష్టి, సంక్షేమ హాస్టళ్లకు కొత్త రూపం

జిల్లా కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సంక్షేమ హాస్టళ్లు కేవలం ‘వసతి’ మాత్రమే కాకుండా ఆధునిక, పర్యావరణ స్నేహపూర్వక, స్వయం సమృద్ధి కలిగిన హెల్తీ క్యాంపస్‌లుగా మారనున్నాయి. కిచెన్, ఫ్రూట్ గార్డెన్లు, అకడమిక్ ఎక్సలెన్స్ కోసం IIT, NIIT ర్యాంకులు సాధించేలా ప్రత్యేక శిక్షణ, 0.25 శాతం వడ్డీతో విద్యా రుణాలు, ఎస్సీ-ఎస్టీ యువతకు జర్మన్ భాష నేర్పించి విదేశీ ఉద్యోగ అవకాశాలు వంటి మార్పులు రెండేళ్లలో దశలవారీగా అమలవుతాయి.

ప్రజలు, విద్యార్థి సంఘాలు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నారు. “ఉద్యోగులు పద్దతులు సరిగా పాటిస్తే హాస్టళ్లలో విద్యా విధానంతో పాటు విద్యార్థుల ఆరోగ్యం కూడా బాగుంటుంది”. ఈ నెట్ జీరో మోడల్ అమలులో హాస్టల్ సిబ్బంది, అధికారులు నిబద్ధతతో ముందుకు వస్తే, గతంలో జరిగిన కలుషిత ఆహార సమస్యలు చరిత్రగా మారి, సంక్షేమ హాస్టళ్లు నిజమైన ‘ఆరోగ్యవంతమైన, స్వయం సమృద్ధి క్యాంపస్‌లు’గా నిలవడం ఖాయం. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు మాత్రమే కాకుండా, పర్యావరణ రక్షణకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ముఖ్యమైన అడుగు.

Read More
Next Story