మీ అప్పుల కోసం పాపాయమ్మను చంపేశారు కదరా!
x

మీ అప్పుల కోసం పాపాయమ్మను చంపేశారు కదరా!

చెవి కమ్మల కోసం దారుణ హత్య.. రూ.31వేలకు తాకట్టు


తిరుపతి సమీపంలోని అవిలాల పంచాయతీ అంబేడ్కర్‌ కాలనీలో ఆ రాత్రి నిశ్శబ్దంగానే మొదలైంది. 78 ఏళ్ల పాపాయమ్మకు ఆ వయసులో కాస్త ఉక్కపోతగా అనిపించి, గాలి కోసం తలుపులు తెరిచి నిద్రపోయింది. కానీ, అదే తలుపులు తన పాలిట మృత్యువుకు దారి చూపిస్తాయని ఆ వృద్ధురాలు ఊహించలేదు.

వివరాలు చెబుతున్న ఎస్పీ సుబ్బరాయుడు

ఈ కథలో విలన్లు మరెవరో కాదు.. ఆమె ఇంటికి సమీపంలోనే నివసించే శ్రీనివాసులు, శోభ దంపతులు. శ్రీనివాసులు మద్యానికి బానిసై, ఇష్టానుసారంగా చేసిన అప్పుల భారం కొండలా పేరుకుపోయింది. అప్పులవాళ్ల వేధింపులో లేక విలాసాల మీద మోజో తెలీదు కానీ, కళ్లముందే తిరుగుతున్న ఓ నిస్సహాయ వృద్ధురాలిపై వారి కన్ను పడింది.
ఆ రాత్రి ఏం జరిగింది?
శనివారం రాత్రి అందరూ నిద్రపోతున్న వేళ, తలుపులు తెరిచి ఉన్న పాపాయమ్మ ఇంట్లోకి ఆ దంపతులు ప్రవేశించారు. కనికరం లేకుండా ఒక టవల్‌తో ఆ బామ్మ గొంతు నులిమేశారు. ప్రాణం పోతున్నా అరిచే ఓపిక లేని ఆ వృద్ధురాలు అక్కడికక్కడే విగతజీవిగా మారింది. ఆమె చెవులకున్న బంగారు కమ్మలను బలవంతంగా లాగేసుకున్నారు. కనీసం ముక్కుపుడకను కూడా వదలకూడదనుకున్నారు కానీ, అది రాకపోవడంతో వదిలేసి పరారయ్యారు.
పోలీసులు ఛేదించిన తీరు ఇలా..
హత్య చేసిన అనంతరం ఆ కమ్మలను తాకట్టు పెడితే వారికి వచ్చింది కేవలం రూ. 31,000. ఒక నిండు ప్రాణం విలువ వారి దృష్టిలో అంత తక్కువా? అనే ప్రశ్న సామాన్యుడిని కలచివేస్తుంది.
ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పోలీసులు, టెక్నాలజీ సాయంతో అసలు నిందితులను పట్టుకున్నారు. అప్పుల నుంచి బయటపడటానికి ఒక ప్రాణాన్ని బలితీసుకున్న ఆ దంపతులు ఇప్పుడు కటకటాల వెనక్కి చేరారు. వారికి సహకరించిన నగల వ్యాపారి కూడా అరెస్టయ్యాడు.
ఈ ఘటన కేవలం ఒక నేరం మాత్రమే కాదు, సమాజానికి ఒక హెచ్చరిక. "ఉక్కపోతగా ఉందని లేదా తెలిసిన వాళ్లే కదా అని అజాగ్రత్తగా ఉండకూడదు. ముఖ్యంగా ఒంటరిగా నివసించే మహిళలు, వృద్ధులు రాత్రి వేళల్లో తలుపులు మూసి ఉంచుకోవడం, భద్రతా ప్రమాణాలు పాటించడం అత్యవసరం" అని పోలీసుల సూచించారు. డబ్బు కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తారని ఈ ఘటన నిరూపించింది.
Read More
Next Story