ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు బొద్దింకల డెడ్ లైన్!
x
కేంద్రమంత్రులతో చర్చలు జరుపుతున్న సీజేపీ ప్రతినిధులు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు 'బొద్దింకల' డెడ్ లైన్!

సీజేపీ కేంద్ర ప్రభుత్వం ముందు ఐదు కీలక డిమాండ్లు ఉంచింది. అందులో ప్రధానమైంది విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణ రాజీనామా.


నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పట్టుబట్టింది. తమ ప్రధాన డిమాండ్ అదేనని తేల్చి చెప్పింది. దీంతో ఇప్పుడీ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.
ఒకవైపు పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తుండగా... మరోవైపు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)తో కేంద్ర ప్రభుత్వ చర్చలు ప్రతిష్ఠంభనకు దారితీశాయి. దీంతో రాజకీయంగానూ, పరిపాలనాపరంగానూ ఉత్కంఠ నెలకొంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరీక్షల లీకేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించిన మరుసటి రోజే కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నపత్రాల లీకేజీలకు పాల్పడే వారిపై గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించేలా కొత్త ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. అంతేకాదు, ఈ కేసుల దర్యాప్తు రెండు నెలల్లో, విచారణ మూడు నెలల్లో పూర్తి చేసి మొత్తం ఐదు నెలల్లోనే తీర్పు వచ్చేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు చట్టబద్ధత కల్పించే ప్రతిపాదనకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ప్రస్తుతం అమల్లో ఉన్న Public Examinations (Prevention of Unfair Means) Act-2024లో ఉన్న నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ ఈ సవరణలు తీసుకొస్తున్నారు. పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడే ముఠాలపై మరింత కఠిన చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఇదే సమయంలో జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ)లో సంస్కరణల ప్రక్రియను వేగవంతం చేస్తూ 47 మంది సిబ్బందిని విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. అలాగే ఢిల్లీలో భద్రతను మరింత బలోపేతం చేసేందుకు అదనంగా 10 కంపెనీల సీఆర్‌పీఎఫ్ బలగాలను తరలిస్తున్నారు.
సీజేపీతో చర్చలు అసంపూర్తి
ఇదిలా ఉండగా, నీట్ లీక్ వ్యవహారంపై సీజేపీ చేపట్టిన ఉద్యమం మరింత ఉధృతమవుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని సీజేపీ స్పష్టం చేసింది. ఈ డిమాండ్‌తో పాటు తమ ఐదు ప్రధాన డిమాండ్లను పార్టీ ప్రతినిధులు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లకు అందజేశారు.
ఢిల్లీలో దాదాపు రెండు గంటలపాటు జరిగిన సమావేశంలో రెండు పక్షాలు విస్తృతంగా చర్చించినప్పటికీ ఎలాంటి తుది నిర్ణయానికి రాలేకపోయాయి. సీజేపీ డిమాండ్లపై ప్రభుత్వం అంతర్గతంగా చర్చించేందుకు 24 గంటల సమయం కోరింది. శనివారం మరోసారి సమావేశమై తమ అధికారిక స్పందన తెలియజేస్తామని కేంద్ర మంత్రులు వెల్లడించారు.

సీజేపీ ప్రధాన డిమాండ్లు

సీజేపీ కేంద్ర ప్రభుత్వం ముందు ఐదు కీలక డిమాండ్లు ఉంచింది.
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణ రాజీనామా.
'చలో పార్లమెంట్' ఆందోళనలో గాయపడిన విద్యార్థులకు ప్రభుత్వం, ఆర్‌ఏఎఫ్‌, ఢిల్లీ పోలీసుల నుంచి బహిరంగ క్షమాపణ.
ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి పరిహారం.
నిరసనకారులపై నమోదైన కేసుల ఉపసంహరణ.
పరీక్షల సంస్కరణలపై సమర్పించిన ఐదు అంశాల డిమాండ్ చార్టర్‌కు ఆమోదం.
ప్రభుత్వ స్పందన ఏంటి?
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం, నిరసనకారులపై నమోదైన కేసుల ఉపసంహరణ అంశాలపై సానుకూలంగా స్పందించే అవకాశముంది. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, అధికారిక క్షమాపణ వంటి అంశాలపై ఎలాంటి హామీ ఇవ్వలేదు.
ప్రభుత్వ వర్గాలు మంత్రి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నాయి. రాజీనామా చేయడం కంటే పరీక్షల వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడం, ప్రశ్నపత్రాల లీక్ ముఠాలను పూర్తిగా నిర్మూలించడం ముఖ్యమని పేర్కొంటున్నాయి.
దేశవ్యాప్తంగా నిరసనలు
నీట్ లీక్ వ్యవహారంపై రాజకీయ పార్టీల నిరసనలు కూడా ఉధృతమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ శనివారం దేశంలోని అన్ని జిల్లాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించాలని రాష్ట్ర శాఖలకు ఆదేశించింది. మరోవైపు సీజేపీ పిలుపుతో పలు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ఇటీవల ఢిల్లీలో జరిగిన నిరసనల్లో పెల్లెట్ గన్స్ వినియోగించారనే ఆరోపణలపై ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ విచారణ ప్రారంభించింది. ఆందోళనకారులపై అధిక బలప్రయోగం జరిగిందా అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఉత్కంఠగా మారిన తదుపరి భేటీ
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చట్టాలను కఠినతరం చేస్తూ వ్యవస్థలో సంస్కరణల దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. అయితే సీజేపీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో శనివారం జరగనున్న తదుపరి సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
Read More
Next Story