దావోస్ లో రేవంత్ రెడ్డితో నారా లోకేష్ భేటీ
x

దావోస్ లో రేవంత్ రెడ్డితో నారా లోకేష్ భేటీ

పరస్పర సహకారంతో ముందుకు సాగడం ద్వారా తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతాయని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.


ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సదస్సు జరుగుతున్న స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరం రెండు తెలుగు రాష్ట్రాల అపూర్వ కలయికకు వేదికైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దావోస్ పర్యటనలో ఉన్న వీరిద్దరూ ఒకచోట చేరి తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అభివృద్ధిపై నిర్మాణాత్మక చర్చలు

ఈ భేటీకి సంబంధించిన వివరాలను నారా లోకేశ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు. ప్రధానంగా రెండు రాష్ట్రాల్లో అమలవుతున్న విద్యా సంస్కరణలు, ఐటీ రంగం విస్తరణ, యువతలో నైపుణ్యాభివృద్ధి (Skill Development) వంటి అంశాలపై ఇద్దరు నేతలు లోతుగా చర్చించారు.

పోటీ ఉన్నా.. లక్ష్యం దేశాభివృద్ధే

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. మేము వేర్వేరు రాష్ట్రాలుగా పెట్టుబడుల కోసం ప్రపంచ వేదికలపై పోటీ పడినా, అంతిమంగా రెండు తెలుగు రాష్ట్రాలను దేశంలోనే నంబర్‌వన్‌గా నిలపాలన్నదే మా ఉమ్మడి లక్ష్యం అని స్పష్టం చేశారు. పరస్పర సహకారంతో ముందుకు సాగడం ద్వారా తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

పెట్టుబడుల వేటలో ఇద్దరూ బిజీ

దావోస్ సదస్సులో భాగంగా అటు సీఎం రేవంత్ రెడ్డి, ఇటు మంత్రి లోకేశ్ తమ తమ రాష్ట్రాలకు అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులను ఆకర్షించడంలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే సమయం కేటాయించుకుని మరీ వీరిద్దరూ భేటీ కావడం, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిపై చర్చించడం పట్ల నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు.

Read More
Next Story