అమరావతి రాజధానికి ఆధునిక ఆకాశం
x
టవర్ -1 కు మొదటి స్టీల్ డయాగ్రిడ్ ను అమర్చే పనులను ప్రారంభించిన మంత్రి నారాయణ

అమరావతి రాజధానికి ఆధునిక ఆకాశం

డయాగ్రిడ్ టెక్నాలజీతో రూపుదిద్దుకుంటున్న 5 ఐకానిక్ టవర్లు


రాజధాని నిర్మాణం వేగంగా సాగుతున్న నేపథ్యంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ కీలక అప్‌డేట్ ఇచ్చారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (జీఏడీ), హెడ్స్ ఆఫ్ డిపార్ట్‌మెంట్స్ (హెచ్‌ఓడీ) కార్యాలయాల కోసం మొత్తం 5 ఐకానిక్ టవర్లు అత్యాధునిక డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. హెచ్‌ఓడీ టవర్-1కు మొదటి స్టీల్ డయాగ్రిడ్ అమర్చే పనులను మంత్రి స్వయంగా ప్రారంభించడంతో రాజధాని అభివృద్ధి మరో అడుగు ముందుకు పడింది.

జీఏడీ టవర్ 47 అంతస్తులతో భారీ స్ట్రక్చర్‌గా రూపొందుతోంది. మిగిలిన నాలుగు హెచ్‌ఓడీ టవర్లు ప్రతి ఒక్కటి 40 అంతస్తులతో నిర్మాణం జరుగుతోంది. మొత్తం 53 లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో ఈ ఐదు టవర్లు ఒకే కాంప్లెక్స్‌లో ఏర్పాటవుతున్నాయి. “అధికార యంత్రాంగం మొత్తం ఒకేచోట ఉండేలా ప్లాన్ చేశాం. ప్రజలకు ఏ అవసరం ఉన్నా అన్ని కార్యాలయాలు ఒకే చోట అందుబాటులో ఉండేలా డిజైన్ చేశాం” అని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

డయాగ్రిడ్ టెక్నాలజీ అంటే ఏమిటి?

ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రముఖమైన అత్యాధునిక స్టీల్ స్ట్రక్చర్ విధానం. డయాగనల్ (కర్ణ), గ్రిడ్ ఆకారంలో స్టీల్ ఫ్రేమ్‌లను అమర్చి భవనాలకు అద్భుతమైన బలం, స్థిరత్వం, సౌందర్యం ఇస్తుంది. భూకంపాలు, గాలి ఒత్తిడి వంటి సహజ విపత్తులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. సాధారణ కాన్క్రీట్ నిర్మాణాల కంటే తక్కువ మెటీరియల్‌తో ఎక్కువ బలం ఇచ్చి, నిర్మాణ వేగాన్ని పెంచుతుంది. భారతదేశంలోనే మొదటి డయాగ్రిడ్ టవర్లుగా అమరావతి టవర్లు గుర్తింపు పొందనున్నాయి.

మంత్రి నారాయణ మరింత వివరిస్తూ 2028 అక్టోబర్ నాటికి ఈ ఐదు టవర్ల నిర్మాణం పూర్తి చేసి అధికారికంగా ప్రారంభించాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్ల నిర్మాణం దాదాపు పూర్తి స్థాయికి చేరుకుందని, ట్రంక్ రోడ్లు, లేఅవుట్ రోడ్లతో పాటు ప్రైవేట్ సంస్థల నిర్మాణాలు కూడా జోరుగా సాగుతున్నాయని చెప్పారు.

రైతులకు ఇచ్చిన మాట ప్రకారమే అమరావతి నిర్మాణం జరుగుతోందని మంత్రి నారాయణ గుర్తు చేశారు. ఈ ఐకానిక్ టవర్లు కేవలం భవనాలు కాకుండా, రాజధాని అమరావతికి ఆధునిక గుర్తింపు మరియు ప్రజాకేంద్రిత పాలనకు చిహ్నంగా నిలవనున్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి ఇప్పుడు కేవలం కల కాదు... వాస్తవం కావడానికి సిద్ధమవుతోందని సీఆర్డీఏ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

Read More
Next Story