
మెటా(Meta)లో వేలసంఖ్యలో లేఆఫ్స్..
AIపై భారీ పెట్టుబడులతో 8వేల మంది తొలగింపు; భవిష్యత్తులో మరికొంతమందికి ఉద్వాసన..
కృత్రిమ మేధస్సు (AI) వైపు మల్లుతున్న నేపథ్యంలో, మెటా ప్లాట్‌ఫామ్స్ (Meta Platforms) సంస్థ భారీ స్థాయిలో ఉద్యోగ కోతలకు శ్రీకారం చుట్టింది. మే 20 నుంచి సుమారు 8వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. అలాగే 6వేల ఖాళీలను కూడా రద్దు చేయనుంది. 2025 చివరి నాటికి మెటాలో సుమారు 79వేల మంది ఉద్యోగులు ఉన్నట్లు అంచనా.
భారీ ప్యాకేజీతో ఇళ్లకు..
ఉద్యోగాలు కోల్పోయిన వారికి కంపెనీ భారీ పరిహార ప్యాకేజీలు అందించనుంది. అమెరికాలో ఉద్యోగులను తొలగిస్తే, వారికి 16 వారాల మూల వేతనం, ప్రతి సర్వీస్ సంవత్సరానికి అదనంగా రెండు వారాల వేతనం ఇస్తారు. అలాగే, ఉద్యోగి, వారి కుటుంబానికి 18 నెలల ఆరోగ్య బీమా కవరేజీ అందిస్తారు. ఇతర దేశాల్లో కూడా స్థానిక నిబంధనల ప్రకారం ఇలాంటి ప్యాకేజీలు ఉంటాయి.
ఇక ఉద్యోగులకు కొత్త ఉద్యోగాలు పొందేందుకు సాయం చేయనున్నామని, అవసరమైతే ఇమ్మిగ్రేషన్ అసిస్టెన్స్ కూడా అందించనున్నట్లు మెమోలో పేర్కొన్నారు.
మే 20న ఉద్యోగులకు వారి అధికారిక, వ్యక్తిగత ఇమెయిల్స్‌కు లేఆఫ్ సమాచారాన్ని పంపనున్నారు. ఈ మార్పులు సంస్థను “మరింత సమర్థవంతంగా” నడపడానికి తీసుకున్న నిర్ణయాలుగా గేల్ తెలిపారు. అయితే, ఇది సులభమైన నిర్ణయం కాదని, సంస్థకు సేవలందించిన ఉద్యోగులను వదులుకోవడం బాధాకరమని పేర్కొన్నారు.
ఇది మొదటి దశ మాత్రమే కావచ్చని సంకేతాలు కనిపిస్తున్నాయి. 2026లో మొత్తం ఉద్యోగుల సంఖ్యను సుమారు 16వేల వరకు తగ్గించే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. అంటే భవిష్యత్తులో మరిన్ని కోతలు ఉండే అవకాశం ఉంది.
ఈ ఉద్యోగ కోతలకు ప్రధాన కారణం AIపై భారీ పెట్టుబడులే. మెటా గతంలో $72 బిలియన్ ఖర్చు చేసిన AI రంగంలో పెట్టుబడులను 2026 నాటికి $135 బిలియన్‌కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో కంపెనీ Advanced Micro Devices (AMD)తో సుమారు $60 బిలియన్ విలువైన AI చిప్‌ల ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే AI ఏజెంట్ ప్లాట్‌ఫామ్ కొనుగోలు చేసినట్లు సమాచారం.
మెటా సీఈఓ మార్క్ జుకెర్ బర్గ్ (Mark Zuckerberg) ప్రకారం, 2026 నుంచి AI సంస్థల పనితీరు పూర్తి మారనుంది. “గతంలో పెద్ద బృందాలు అవసరమైన పనులను ఇప్పుడు ఒకే వ్యక్తి పూర్తి చేసే స్థాయికి మార్పు వస్తోంది,” అని ఆయన తెలిపారు.
ఇక ఇది ఒక్క మెటా సంస్థకే పరిమితం కాదు. Microsoft కూడా తన ఉద్యోగులకు స్వచ్ఛంద బైఅవుట్‌లు ఆఫర్ చేస్తోంది. Amazon ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికలను ప్రకటించింది.
AI మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు పెట్టడం వల్ల వ్యయభారం పెరుగుతోంది. దీనిని సమతుల్యం చేయడానికి పెద్ద టెక్ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
మొత్తంగా, AI విస్తరణతో టెక్ రంగంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉద్యోగాలపై దీని ప్రభావం మరింతగా కనిపించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

