ఫేస్‌బుక్ లింకే కొంపముంచింది
x

ఫేస్‌బుక్ లింకే కొంపముంచింది

ప్రభుత్వ ఉపాధ్యాయుడికి రూ. 24.50 లక్షల నామం.


సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణీయమైన లింక్‌లు ఎంత ప్రమాదకరమో చెప్పడానికి కోనసీమ జిల్లాలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో సైబర్ నేరగాళ్లు విసిరిన గాలానికి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిక్కుకుని, ఏకంగా రూ. 24.50 లక్షలు పోగొట్టుకున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మగటపల్లిలో ఈ ఘటన వెలుగుచూసింది.

ప్రభుత్వ పథకం పేరుతో వల

కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మగటపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కొనుకు శ్రీనివాస్‌కు ఇటీవల ఫేస్‌బుక్‌లో ఒక లింక్ కనిపించింది. దానిని క్లిక్ చేయగా, కేంద్ర ప్రభుత్వ పథకం కింద భారీ లాభాలు పొందవచ్చని నేరగాళ్లు నమ్మించారు. ఆన్‌లైన్‌లో కొంత నగదు బదిలీ చేస్తే రూ. 10 లక్షల విలువైన ఎరువులు పంపిస్తామని, వాటిని విక్రయించడం ద్వారా లక్షల్లో లాభాలు గడించవచ్చని ఆశ చూపారు. చదువుకున్న వ్యక్తి అయినా, నేరగాళ్ల మాయమాటలను నమ్మిన శ్రీనివాస్ మోసానికి గురయ్యారు.

విడతల వారీగా నగదు దోపిడీ

ముందుగా ఫోన్ పే ద్వారా కొంత నగదు పంపిన శ్రీనివాస్‌ను నేరగాళ్లు వదల్లేదు. రకరకాల కారణాలు చెబుతూ మరింత డబ్బు పంపాలని ఒత్తిడి చేశారు. దీంతో ఆయన విడతల వారీగా మొత్తం రూ. 24.50 లక్షలను సైబర్ కేటుగాళ్ల ఖాతాలకు బదిలీ చేశారు. ఎంత కాలం వేచి చూసినా ఎరువులు రాకపోవడంతో పాటు, నేరగాళ్ల నుంచి స్పందన కరువవ్వడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు నగరం పోలీసులను ఆశ్రయించారు.

అప్రమత్తతతో రూ. 9 లక్షలు ఫ్రీజ్

మోసపోయానని తెలిసిన వెంటనే శ్రీనివాస్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన పోలీసులు, బ్యాంక్ అధికారులు నిందితుల ఖాతాలను పరిశీలించి, అందులో ఉన్న రూ. 9 లక్షలను ఫ్రీజ్ చేయగలిగారు. దీనివల్ల బాధితుడికి కొంత ఊరట లభించినప్పటికీ, మిగిలిన సొమ్ము పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రజలు ఇలాంటి అపరిచిత లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని నగరం ఎస్‌ఐ చైతన్యకుమార్ హెచ్చరించారు.

Read More
Next Story