
అనంతపురం జిల్లా కదిరికి ఏడు కిలోమీటర్ల దూరంలోని కుమ్మరవాండ్లపల్లెలో పేలుడు సృష్టించిన బీభత్సం
Anantapuram | కదిరి వద్ద భారీ పేలుడు: నలుగురి మృతి. 21 మందికి గాయాలు
ఎనిమిది మంది పరిస్థితిని విషమం కావడానికి డిటోనేటర్లే కారణమని సందేహిస్తున్న పోలీసులు.
ఎండలు మండుతున్నాయి. రాళ్లు కూడా పగులుతాయా అనిపిస్తున్నాయి. ఈ వాతావరణంలో అనంతపురం జిల్లాలో భారీ పేలుడు వల్ల నాలుగు ఇళ్ళు ధ్వంసమయ్యాయి. నలుగురు మరణించారు. 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉందనీ, ఎనిమిది మంది తీవ్ర గాయాలతో కదిరి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వారిలో కొందరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మృతులు, బాధితులు ఒకే కుంటుండానికి చెందిన వారిగా భావిస్తున్నారు. వారంతో తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా నుంచి కొన్ని సంవత్సరాల కిందట కదిరికి సమీపంలోని కుమ్మరవాళ్లపల్లెకు వచ్చారు. ఇక్కడి క్వారీల్లో పనిచేస్తూ, జీవనం సాగిస్తున్నట్లు ప్రాథమికంగా అందిన సమాచారం ఆధారంగా తెలుస్తోంది.
కదిరి పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలోని కుమ్మరవాండ్లపల్లెలో జరిగిన పేలుడుకు మొదట గ్యాస్ సిలిండర్లు కారణమని చెప్పారు. ధ్వంసమైన ఇళ్లలో క్వారీల్లో ఉపయోగించే భారీ యంత్రాలు బయటపడ్డాయి. దీంతో డిటోనేటర్లు లేదా జెలిటిన్ స్టిక్స్ పేలుడుకు కారణమని పోలీసులు సందేహిస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరి నియోవజవర్గం కుమ్మరవాండ్లపల్లెలో బుధవారం ఈ సంఘటన జరిగింది.
భారీ పేలుడు..
కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లెలోని ఓ ఇంటిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ధాటికి చుట్టుపక్కల ఉన్న సిమెంట్ తో నిర్మించిన రెండు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో గ్రామం ఉలిక్కిపడింది. ఉరుకులు, పరుగులపై ఘటనా స్థలం నుంచి కొందరు పారిపోయారు. కొద్ది సేపటి తరువాత వచ్చిన గ్రామస్తులకు ఇళ్లు ధ్వంసమైన తీరు చూసి బెంబేలెత్తారు. అప్పటికే కూలిన ఇంటి శిథిలాల కింద మరణించిన నలుగురిని గుర్తించారు.
మహబూబున్ని (40)
మధు (36)
సంపత్ (30)
వెంకన్న (45) గా గుర్తించారని తెలిసింది.
పెద్ద సంఖ్యలో బాధితులు
ఇళ్లలో ఉంచుకున్న పేలుడు పదార్థాల వల్ల జరిగిన విస్ఫోటంతో పదుల సంఖ్యలో మూడు ఇళ్లు, సమీప ప్రాంతాల్లో ఉన్న వారు గాయపడినట్లు సమాచారం. శిథిలాల వద్ద తీవ్రగాయాలతో పడిపోయిన వారిని వెంటనే కదిరి పట్టణ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో దాదాపు 21 మంది గాయపడ్డారని తెలిసింది. వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రభుత్వాస్పత్రులకు తరలించడానికి చర్యలు తీసుకున్నారు. కదిరి ప్రభుత్వాస్పత్రిలో తీవ్ర గాయాలతో ఎనిమిది మంది చికిత్స తీసుకొంటున్నారని తెలిసింది.
రంగంలోకి దిగిన పోలీసులు
కదిరి పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలోని కుమ్మరవాండ్లపల్లెలో పేలుడు జరిగిన సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. కదిరి రూరల్ సీఐ మోహన్ తోపాటు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని కదిరి ప్రభుత్వాస్పత్రికి అంబెలెన్సుల్లో తరలించారు. మరణించిన నలుగురిని కూడా కదిరి ఆస్పత్రి మార్చురీకి తరలించారని పోలీసు అధికారులు చెప్పారు.
పేలుడుకు కారణం ఏమిటి?
కదిరికి సమీపంలోని గ్రామాల్లోగ్రానైట్ క్వారీలు, మెటల్ సరఫరా చేసే స్టోన్ క్రషర్లు కూడా ఉన్నట్లు సమాచారం. క్వారీల్లో పేలుళ్ల కోసం తీసుకుని వచ్చిన జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు అజాగ్రత్తగా ఇళ్లలో ఉంచుకున్నట్లు పోలీసులు సందేహిస్తున్నారు. ఎందవేడికి అవి పేలడం వల్ల భారీ విస్ఫోటనం జరిగి, ఇళ్ల గోడలు, పైకప్పు కూడా ధ్వంసమయ్యాయి. ఇళ్లు ఆనవాళ్లు లేకుండా దెబ్బతిన్నాయి. ఘటనా స్థలంలో క్వారీల్లో రంధ్రాలు ఏర్పాటు చేయడానికి వాడే యంత్రం కూడా లభించడం వల్ల పేలుడు పదార్థాల వల్లే ఈ ప్రమాదం జరగడానికి దారి తీసిందని పోలీసులు సందేహిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు కూడా తెలిపారు.
Next Story

