ఏసీ బోగీ ఆశ చూపి వివాహితపై అత్యాచారం
x

ఏసీ బోగీ ఆశ చూపి వివాహితపై అత్యాచారం

మాయమాటలు నమ్మి వెళ్తే మృగంలా ప్రవర్తించిన దుండగుడు


రైలు ప్రయాణంలో తోటి ప్రయాణికులకు సాయం చేస్తాడనుకున్న వ్యక్తి కామాంధుడిలా మారిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన దంపతులు విశాఖపట్నంలో నివసిస్తూ, ఒక కార్యక్రమం నిమిత్తం జెట్టిపాలెం వెళ్లేందుకు విశాఖ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కారు. జనరల్ బోగీలో రద్దీగా ఉండటాన్ని గమనించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి, వారి వద్దకు వచ్చి.. ఇక్కడ ఎందుకు ఇబ్బంది పడతారు? ఏసీ బోగీలో సీటు ఖాళీగా ఉంది రండి అని నమ్మబలికాడు. పాపం, ఆ వ్యక్తి మంచివాడేనని నమ్మి ఆ దంపతులు అతడి వెంట వెళ్లారు.

కూపేలో బంధించి ఘాతుకం.. భర్త బయట ఉండగానే అఘాయిత్యం
ఏసీ బోగీకి వెళ్లిన తర్వాత, అక్కడ ఒకే సీటు ఖాళీగా ఉందని ఆ దుండగుడు నమ్మించాడు. దీంతో భార్యను సీటు వద్ద ఉంచి, భర్త బయట టాయిలెట్ సమీపంలో వేచి ఉన్నాడు. ఇదే అదనుగా భావించిన ఆ కామాంధుడు, మహిళను H1A బోగీలోని ఒక కూపేలోకి తీసుకెళ్లి, లోపల తలుపులు మూసి ఆమెపై అమానుషంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. రైలు వేగంగా వెళ్తుండటం, ఏసీ బోగీలో బయటి శబ్దాలు వినిపించకపోవడంతో ఆ మహిళ ఆర్తనాదాలు ఎవరికీ వినిపించలేదు.
పోలీసుల దర్యాప్తు..జీరో ఎఫ్ఐఆర్ నమోదు
గమ్యస్థానానికి చేరుకున్న బాధితురాలు ధైర్యం చేసి మంగళవారం రెంటచింతల పోలీసులను ఆశ్రయించింది. ఘటన తీవ్రతను గమనించిన పోలీసులు వెంటనే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసును విజయవాడ రైల్వే పోలీసులకు బదిలీ చేశారు. బాధితురాలికి మాచర్ల ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితుడు ఎవరు? అతడు రైల్వే సిబ్బందా లేక ప్రయాణికుడా? అనే కోణంలో పోలీసులు సిసిటివి ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. రైలు ప్రయాణంలో అపరిచితుల మాటలు నమ్మి వెళ్లడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి నిరూపించింది.
Read More
Next Story