
నీట్-పీజీ 2026లో భారీ మార్పులు..
అభ్యర్థులకు ఊరట కలిగించే నిర్ణయాలు
నీట్-పీజీ 2026 పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. అభ్యర్థులకు పరీక్షా కేంద్రాలు వీలైనంత వరకు వారి నివాస ప్రాంతానికి సమీపంలో ఉండేలా కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. అలాగే కేంద్రం దూరంగా కేటాయించినా ముందుగానే సమాచారం ఇచ్చి ప్రయాణం, వసతి ఏర్పాట్లకు తగిన సమయం కల్పించనుంది. మరోవైపు ప్రతి ప్రశ్నకు ఎక్కువ సమయం దొరికేలా పరీక్షా విధానంలో కూడా మార్పులు చేసింది. ఆగస్టు 30న దేశవ్యాప్తంగా ఈ పరీక్ష ఒకే షిఫ్ట్‌లో జరగనుంది.
పరీక్ష భద్రతకు అత్యాధునిక వ్యవస్థ
ప్రశ్నాపత్రాల తయారీ నుంచి పరీక్ష ప్రారంభం వరకు భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. బహుళ ఎన్‌క్రిప్షన్ విధానం, ఆఫ్‌లైన్‌లో ప్రశ్నపత్రాల సిద్ధం, పరీక్ష ప్రారంభానికి కొద్దిసేపటి ముందు మాత్రమే తుది ప్రశ్నపత్రం ఖరారు చేయడం, నిర్ణీత సమయంలో డిజిటల్ డీక్రిప్షన్ ద్వారా మాత్రమే ప్రశ్నపత్రం అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టింది.
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) అభ్యర్థుల్లో అవగాహన పెంచేందుకు సూచనలు జారీ చేసింది. నకిలీ గుర్తింపులు, దళారులు లేదా ఇతర అక్రమాలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక ఇమెయిల్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేసింది.
ఆధార్ ధృవీకరణ తప్పనిసరి
పరీక్షా ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు దరఖాస్తు నుంచి పరీక్ష వరకు ఆధార్ ఆధారిత ధృవీకరణను ప్రవేశపెట్టారు. వేలిముద్ర ధృవీకరణ సాధ్యం కాకపోతే ఐరిస్ బయోమెట్రిక్ ద్వారా గుర్తింపు నిర్ధారిస్తామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇంటికి దగ్గర్లోనే పరీక్షా కేంద్రం
కొత్త విధానం ప్రకారం అభ్యర్థులు పరీక్షా కేంద్రం కోసం మూడు రాష్ట్రాలను ఎంపిక చేసుకోవాలి. వాటిలో తమ సొంత రాష్ట్రాన్ని తప్పనిసరిగా ఒక ఎంపికగా ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో వీలైనంత వరకు సమీప కేంద్రాన్నే కేటాయించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
ఇప్పటివరకు 'మొదట వచ్చిన వారికి మొదట ప్రాధాన్యత' పద్ధతిలో కేంద్రాలు కేటాయించడంతో ఆలస్యంగా దరఖాస్తు చేసిన వారు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడేది. కొత్త విధానంతో ఆ సమస్యకు చెక్ పడనుంది.
ప్రయాణానికి ముందస్తు సమాచారం
పరీక్షా నగరం వివరాలను ఈసారి పరీక్షకు దాదాపు మూడు వారాల ముందే ప్రకటించనున్నారు. దీంతో ప్రయాణం, వసతి ఏర్పాట్లను అభ్యర్థులు ముందుగానే చేసుకునే అవకాశం ఉంటుంది.
ప్రతి ప్రశ్నకు ఎక్కువ సమయం
పరీక్ష మొత్తం వ్యవధి 210 నిమిషాలుగానే కొనసాగుతుంది. అయితే ప్రశ్నల సంఖ్యను 200 నుంచి 180కు తగ్గించారు. దీంతో ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఎక్కువ సమయం లభిస్తుంది. గతంలో గరిష్ఠ మార్కులు 800 ఉండేవి.
ఒకే షిఫ్ట్‌లో పరీక్ష
గతంలో అత్యవసర పరిస్థితులు లేదా వాయిదాల కారణంగా రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించాల్సి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి అన్ని అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించేలా నీట్-పీజీ 2026ను ఒకే షిఫ్ట్‌లో నిర్వహించాలని నిర్ణయించారు.
సన్నద్ధతను సమీక్షించిన నడ్డా
కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఆగస్టు 1న పరీక్షా ఏర్పాట్లను సమీక్షించారు. పరీక్షను సురక్షితంగా, పారదర్శకంగా, సాంకేతికత ఆధారంగా నిర్వహించాలని సంబంధిత సంస్థలకు ఆదేశించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష నిర్వహించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
రికార్డు స్థాయిలో నమోదు
నీట్-పీజీ 2026కు మొత్తం 2,73,183 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 12.5 శాతానికి పైగా పెరుగుదల. దేశవ్యాప్తంగా సుమారు 340 నగరాల్లో, 1,300కు పైగా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
పరీక్షా కేంద్రాలను ముందుగానే సీల్ చేసి ధృవీకరించడం, సీసీటీవీ నిఘా, బయోమెట్రిక్ ధృవీకరణ, అభ్యర్థుల క్షుణ్న తనిఖీలు, సిగ్నల్ జామర్లు, కేంద్ర మరియు ప్రాంతీయ కమాండ్ సెంటర్ల ద్వారా ప్రత్యక్ష పర్యవేక్షణ, స్వతంత్ర పరిశీలకుల నియామకం వంటి పలు భద్రతా చర్యలు చేపట్టారు. పరీక్ష నిర్వహణ కోసం 60 వేల మందికి పైగా సిబ్బందిని విధుల్లోకి దించనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

