జార్ఖండ్ ఎన్ కౌంటర్ లో టాప్ మావోస్టు మృతి
x

జార్ఖండ్ ఎన్ కౌంటర్ లో టాప్ మావోస్టు మృతి

ఇంకా కొనసాగుతున్న ఎన్ కౌంటర్లో దాదాపు 15 మంది మావోయిస్టులు చనిపోయి ఉంటారని అనుమానం


ఝార్ఖండ్ రాష్ట్రం పశ్చిమ సింగ్బూం అటవీ ప్రాంతం శుక్రవారం ఉదయం యుద్ధభూమిని తలపించింది. భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన హోరాహోరీ కాల్పుల్లో ఇప్పటివరకు 15 మంది మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీకి చెందిన అత్యంత కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు అనల్ దా అలియాస్ పతిరామ్ మాంఝీ కూడా హతమైనట్లు భద్రతా దళాలు ప్రాథమికంగా గుర్తించాయి. మాంఝీ తలపై ప్రభుత్వం ఏకంగా రూ. 1 కోటి రివార్డు ప్రకటించిందంటే, ఆయన ఎంతటి కీలక నేతో అర్థం చేసుకోవచ్చు. సరండా అటవీ ప్రాంతాలలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నడాని పోలీసులు చెబుతున్నారు.

చోటా నగ్ర సమీపంలోని కుంభ్దీ గ్రామ పరిసరాల్లో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ప్రాంతలోని అడవుల్లో సెక్యూరిటీ దళాలు గస్తీతిరుగుతున్నపుడు మావోయిస్టులు దాడి చేశారని, దీనితో సెక్యూరిటీ దళాలుకూడా కాల్పులు జరపడంతో ఈ మరణాలు సంభవించాయని చాయ్ బాసా పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు.

అడవిలో ఆగని తూటాల వర్షం

శుక్రవారం తెల్లవారుజాము నుంచే భద్రతా దళాలు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో తారసపడిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో బలగాలు దీటుగా స్పందించాయి. గంటల తరబడి సాగుతున్న ఈ కాల్పుల్లో మావోయిస్టులు ప్రాణాలు కాపాడుకోవడానికి అడవి లోపలికి పారిపోతుండగా, బలగాలు వారిని వెంబడిస్తూ వేటాడుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఎంతమంది గాయపడ్డారు. ఎంతమంది తప్పించుకున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

చెల్లాచెదురుగా మృతదేహాలు

అటవీ ప్రాంతంలో బలగాలు ముందుకు సాగుతున్న కొద్దీ బుల్లెట్ గాయాలతో పడి ఉన్న మావోయిస్టుల మృతదేహాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు గుర్తించిన వివరాల ప్రకారం ఈ సంఖ్య 15 కి చేరుకుంది. ఈ భారీ ఎన్‌కౌంటర్ మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. పతిరామ్ మాంఝీ వంటి అగ్రనేత మరణం ధృవీకరణైతే, ఆ ప్రాంతంలో మావోయిస్టుల పట్టు పూర్తిగా సడలినట్టేనని పోలీసులు భావిస్తున్నారు.

కొనసాగుతున్న గాలింపులు

ప్రస్తుతానికి అడవిలో ఇంకా కాల్పుల శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. అదనపు బలగాలను ఘటనా స్థలానికి తరలించిన ప్రభుత్వం, అడవిని పూర్తిగా తమ అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం అడవిలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఉన్నతాధికారులు వేచి చూస్తున్నారు. మరో వైపు ఈ భారీ ఎన్‌కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

Read More
Next Story