
ఇసుకలో లూటీ.. జూదంలో వాటాలు: వైఎస్ జగన్
తమ ప్రభుత్వంలో ఇసుక ద్వారా ఖజానాకు ఏటా రూ. 750 కోట్ల ఆదాయం వచ్చేది. కానీ నేడు ఇసుక ధరలు రెట్టింపయ్యాయి. ఇదంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది? అని జగన్ ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ముసుగులో సాగిస్తున్న అరాచకాలు, అవినీతి బాగోతాలను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎండగట్టారు. గురువారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన పదునైన సమాధానాలిచ్చారు. కళ్లముందే అవినీతి కనిపిస్తున్నా.. కూటమి నేతలు తాము నిజాయితీపరులమనే భ్రమలో బతుకుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
ఇసుక ఖజానా ఖాళీ.. మాఫియా జేబులు ఫుల్
ఇసుక పాలసీపై జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో ఇసుక ద్వారా ఖజానాకు ఏటా రూ. 750 కోట్ల ఆదాయం వచ్చేది. కానీ నేడు ఇసుక ధరలు రెట్టింపయ్యాయి. ప్రజలకు భారం పెరిగింది. కానీ ప్రభుత్వ ఖజానాకు మాత్రం పైసా ఆదాయం రావడం లేదు. ఇదంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది? అని ప్రశ్నించారు. సిలికా, క్వార్ట్జ్ వంటి మైనింగ్ మాఫియాలు ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా దోపిడీ సాగిస్తున్నాయని ఆరోపించారు.
బెల్ట్ షాపుల రాజ్యమే.. అమరావతి అతిపెద్ద స్కామ్
రాష్ట్రంలో లిక్కర్ మాఫియాపై స్పందిస్తూ.. గ్రామాల్లో వాడవాడలా బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌లు వెలిశాయి. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం అమ్ముతూ ప్రజలను దోచుకుంటున్నారు అని విమర్శించారు. ఇక అమరావతి నిర్మాణంపై స్పందిస్తూ.. అమరావతిలో భూములు ఇవ్వడం ఒక స్కామ్ అయితే, నిర్మాణాల పేరుతో వేల కోట్లు ఖర్చు చేయడం అంతకంటే పెద్ద స్కామ్. ఇదంతా ప్రజల కళ్లముందే జరుగుతున్న లూటీ అని ధ్వజమెత్తారు.
సంక్రాంతి జూదంలో బాబు వాటా
సంక్రాంతి పండుగను కూటమి నేతలు జూదమేళాగా మార్చేశారని జగన్ ఆరోపించారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలే దగ్గరుండి జూదాలను నడిపించారు. సుమారు రూ. 2 వేల కోట్ల రొటేషన్ జరిగింది. ఇందులో చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు, పోలీసులకు కూడా వాటాలు అందాయి. ప్రభుత్వం దగ్గరుండి జూదాన్ని ప్రోత్సహించడం అవినీతి కాదా? ఇది ప్రజలను పక్కదారి పట్టించి దోచుకోవడం కాదా? అని నిలదీశారు.
ప్రతిపక్ష హోదా.. మీడియాకు జగన్ సూచన
ప్రతిపక్ష హోదాపై వస్తున్న ప్రశ్నలకు బదులిస్తూ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ తప్ప మరో ప్రతిపక్ష పార్టీ లేదనే నిజాన్ని మీడియా గుర్తించాలి. అసెంబ్లీలో మైక్ ఇచ్చే పరిస్థితి లేనందునే, ప్రజల గొంతుకగా నిలబడటానికి మేము ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం పోరాడాల్సి వస్తోంది అని స్పష్టం చేశారు.

