
స్థానిక ఎన్నికల వాయిదా ప్రసక్తే లేదు: నారా లోకేశ్
ముందు మున్సిపల్.. తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ.. చివరగా పంచాయతీ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను అక్టోబరులోగా పూర్తి చేస్తామని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఎన్నికలు వాయిదా పడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తొలుత పురపాలక ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, చివరగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న అంశాలను త్వరగా పరిష్కరించి అన్ని స్థానాల్లో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
కేబినెట్ భేటీకి ముందు మంత్రులతో సమావేశమైన లోకేశ్.. స్థానిక ఎన్నికలతో పాటు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అన్ని స్థానాల్లో గెలిపించేలా పార్టీ శ్రేణులు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఫైనాన్స్ కమిషన్ నిధుల కోసమే..
స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమైతే ఫైనాన్స్ కమిషన్ నిధులు నిలిచిపోయి రాష్ట్రానికి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని లోకేశ్ ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన న్యాయపరమైన సమస్యలను పరిష్కరించి, నిర్ణీత సమయంలో ఎన్నికలు నిర్వహించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.
అర్హులకు దశల వారీగా కొత్త పింఛన్లు
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ దశల వారీగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని లోకేశ్ తెలిపారు. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించి.. అర్హులైన వారికి కొత్త పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రులను ఆదేశించారు.
విద్యాశాఖపై అప్రమత్తంగా ఉండాలి
విద్యాశాఖను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు సూచించారు. మాట వినని అధికారులు, శాఖకు లేదా మంత్రికి చెడ్డపేరు వచ్చేలా వ్యవహరించే అధికారుల విషయంలో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇటీవల తలెత్తిన కొన్ని సమస్యలు ఒకరిద్దరు అధికారుల పనితీరు కారణంగానే ఉత్పన్నమయ్యాయని అభిప్రాయపడ్డారు.
వైద్యరంగంపై సోషల్ మీడియా ట్రోలింగ్
వైద్య రంగంలో చిన్న పొరపాటు జరిగినా సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ జరుగుతోందని లోకేశ్ అన్నారు. ఇలాంటి అంశాలపై మంత్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
చంద్రబాబుపై కేసులకు మూడేళ్లు
సెప్టెంబరు 9న అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి, అన్యాయంగా నిర్బంధించి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాలని లోకేశ్ సూచించారు. నాటి పరిణామాల నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తీరును ప్రజలకు గుర్తుచేసేలా కార్యక్రమం ఉండాలని చెప్పారు.
ఎల్‌నినోపై ముందస్తు ప్రణాళిక
ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని లోకేశ్ సూచించారు. నీటి వినియోగంలో పొదుపు చర్యలు చేపట్టి, రానున్న సమస్యను సమర్థంగా ఎదుర్కొందామని మంత్రులకు చెప్పారు.
Next Story

