
విజయ్ కి లైన్ క్లియర్, ప్రమాణ స్వీకారం తేదీపై తర్జన భర్జన!
మ్యాజిక్ ఫిగర్ దాటిన టీవీకే, మద్దతు పలికిన కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే
గంటకో లెక్కన మారుతూ వస్తున్న తమిళనాడు రాజకీయం కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. విజయ్ కు ప్రభుత్వం ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. విజయ్ కు వామ పక్షాలు, వీసీకే పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో విజయ్ కి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ వచ్చింది. సాయంత్రం 4.30 కు మూడోసారి గవర్నర్ కలిసిన విజయ్ సాయంత్రం 6 గంటలకు మరోసారి గవర్నర్ అపాయింట్ మెంట్ కోరినట్టు సమాచారం.
తమిళనాడు రాజకీయాల్లో 50 ఏళ్ల చరిత్ర తిరగరాయబోతున్నారు కొత్త ‘దళపతి’ విజయ్. మూడు రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడే సమయం ఆసన్నమైంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని TVK (తమిళగ వెట్రి కళగం), ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ 118ని అందుకున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ దోబూచులాడిన వామపక్షాలు, వీసీకే పార్టీలు విజయ్‌కు మద్దతు ప్రకటించడంతో.. తమిళనాడు రాజకీయ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది.
తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు
ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సింది 118.
విజయ్ ఒంటరిగా సాధించిన సీట్లు 108
మిగిలిన 10 సీట్ల కోసం తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
మొదట కాంగ్రెస్ షరతులతో కూడిన మద్దతు ఇస్తామన్నా, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ సంతృప్తి చెందలేదు.
తాజా సమాచారం ప్రకారం.. లెఫ్ట్ పార్టీలు (CPI, CPM), వీసీకే (VCK) విజయ్ కు మద్దతు పలికాయి.
దీంతో విజయ్ కు పూర్తి మెజారిటీ లభించింది.
అంటే, అర్ధ శతాబ్దం తర్వాత ఓ కొత్త పార్టీ తమిళనాడులో అధికార పీఠాన్ని అధిరోహించబోతోంది.
ఈ మూడు రోజుల్లో తెరవెనుక భయంకరమైన రాజకీయ చదరంగం నడిచింది.
50 ఏళ్లుగా బద్ధశత్రువులుగా ఉన్న DMK, AIADMK, విజయ్‌ను అధికారానికి దూరం చేయడానికి చేతులు కలపబోతున్నాయనే వార్తలు గుప్పుమన్నాయి.
విజయ్ ప్రభంజనాన్ని అడ్డుకోవడానికి తెర వెనుక చాలా ప్రయత్నాలే జరిగాయి.
అయితే అవేవీ వర్కవుట్ కాలేదు.
ఈ ప్లాన్ సక్సెస్ కావాలంటే వామపక్షాలు, వీసీకే మద్దతు తప్పనిసరి. కానీ, ఆ పార్టీలు విజయ్ వైపు మొగ్గు చూపడంతో ద్రవిడ దిగ్గజాల ప్లాన్ తలకిందులైంది.
బీజేపీ ‘తటస్థ’ వైఖరి.. వ్యూహమా? వైరాగ్యమా?
మరోవైపు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇక్కడ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఒక లేఖ విడుదల చేస్తూ - "ప్రజలు మాకు అధికారం ఇవ్వలేదు, అందుకే మేము ఏ ప్రభుత్వం ఏర్పాటులోనూ భాగస్వామ్యం వహించం. ఎవరికీ ఓటు వేయం" అని స్పష్టం చేశారు. ఇది ఒక రకంగా విజయ్‌కు పరోక్షంగా మేలు చేసే నిర్ణయమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక ఇప్పుడు అందరి కళ్లూ రాజ్‌భవన్ పైనే ఉన్నాయి. సాయంత్రం 6 గంటలకు విజయ్ మూడోసారి గవర్నర్‌ను కలవబోతున్నారు. ఈసారి తన వద్ద ఉన్న మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేఖలను ఆయనకు సమర్పించనున్నారు. మళ్లీ గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరారు. బహుశా ఇదే సమయంలో ప్రభుత్వం ఏర్పాటుకు రావాలని విజయ్‌ను గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉంది.
సినిమా క్లైమాక్స్‌ను తలపించేలా సాగుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో చివరకు ప్రజలు కోరుకున్నట్లే ‘మార్పు’ సంభవిస్తోంది. ద్రవిడ రాజకీయాల గుత్తాధిపత్యాన్ని చెరిపేస్తూ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇక లాంఛనమేనా? వేచి చూడాలి!
Next Story

