మా అబ్బాయి లోకేశ్ ను చూసి నేర్చుకోండయ్యా!
x
చంద్రబాబు క్లాస్ తీసుకుంటున్నట్టుండే ఊహాత్మక చిత్రం

మా అబ్బాయి లోకేశ్ ను చూసి నేర్చుకోండయ్యా!

చంద్రబాబు మంత్రులకు ఏమని క్లాస్ తీసుకున్నారంటే..


ఏపీ మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ మొదలు కృత్రిమమేధ వరకు ప్రతి ఒక్కరూ అన్నీ నేర్చుకోవాల్సిందేనని తెగేసి చెప్పారు. ఏ మాత్రం తేడా వచ్చినా జనం లో చులకనై పోతారని హితవు పలికారు. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో ఎందుకు వెనకబడుతున్నారని నిలదీశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని, ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఆయన స్పష్టం చేశారు.

అసలేం జరిగిందంటే..

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు క్యాబినెట్‌ భేటీ తర్వాత చంద్రబాబు మంత్రులతో సరదాగా తాజా పరిణామాలపై చర్చించారు. గూగుల్‌ని రాష్ట్రానికి తెచ్చే క్రమంలో చోటుచేసుకున్న వివిధ పరిణామాలను గుర్తుచేసుకున్నారు. అమెరికా పర్యటనలో గూగుల్‌ ప్రతినిధులను మంత్రి లోకేశ్‌ కలిసి ఒప్పించిన తీరును వివరించారు. అదే సమయంలో లోకేశ్ కృషిని చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రశంసించారు.

"క్వాంటం కంప్యూటింగ్ నుంచి కృత్రిమ మేధ (AI) వరకు ప్రతి అంశంపై మంత్రులకు కనీస అవగాహన ఉండాలి" అని సీఎం హితవుపలికారు. మంత్రులు టెక్నాలజీపై అప్‌డేట్ అవ్వకపోతే ప్రజల్లో చులకన అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఐటీ రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవాలని సూచించారు.
'గొడ్డలి పార్టీ' విమర్శలను తిప్పికొట్టండి
వైసీపీ (ముఖ్యమంత్రి పరోక్షంగా 'గొడ్డలి పార్టీ' అని సంబోధించారు) చేస్తున్న అసత్య ప్రచారాలపై సీఎం సీరియస్ అయ్యారు. అమరావతి నిర్మాణ ఖర్చులపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని వాస్తవాలతో సహా ఎండగట్టాలని మంత్రులను మౌఖికంగా ఆదేశించారు.
సింగపూర్ పర్యటన
మంత్రుల సింగపూర్ పర్యటనపై వస్తున్న విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇవ్వాలని, అక్కడ అధ్యయనం చేసిన ఉత్తమ విధానాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. సింగపూర్ వెళ్లి వచ్చిన మంత్రులు తమ అధ్యయనంపై వ్యక్తిగత నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు.
పాలనలో వేగం - మంత్రులకు బాధ్యతలు
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పలువురు మంత్రులకు చంద్రబాబు కీలక సూచనలు చేశారు. పుట్టపర్తి వద్ద ఏరోస్పేస్ డిఫెన్స్ క్లస్టర్‌కు వేగంగా అనుమతులు రావడం మన ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. 'జలధార- జలహారతి' కార్యక్రమంలో మంత్రులందరూ భాగస్వాములు కావాలని మంత్రి నిమ్మల రామానాయుడుకు సూచించారు. సౌర విద్యుత్ లక్ష్యాల కోసం మంత్రి గొట్టిపాటి రవి ఇంకా కృషి చేయాలన్నారు.
ఎండల తీవ్రత...
పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొత్తానికి, పాలనలో సాంకేతికతను జోడించడమే కాకుండా, రాజకీయంగా ప్రత్యర్థుల విమర్శలను ఎక్కడికక్కడ అడ్డుకోవడంలో మంత్రులు మరింత చురుగ్గా ఉండాలని చంద్రబాబు ఈ భేటీ ద్వారా స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.
Read More
Next Story