గగనానికేగిన సింగీతం పుష్పక విమానం!
x
సింగీతం శ్రీనివాసరావు (ఏఐ క్రియేషన్)

గగనానికేగిన 'సింగీతం' పుష్పక విమానం!

వయసును జయించి.. వెండితెరను శాసించి.. సింగీతం శాశ్వత నిద్ర.


భారతీయ సినిమాకు ప్రయోగాత్మకతను పరిచయం చేసిన దర్శక మాంత్రికుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి సింగీతం శ్రీనివాసరావు ఇక లేరు. 95 ఏళ్ల వయసులో వయోభారంతో తలెత్తిన అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. దాదాపు ఏడు దశాబ్దాల పాటు సినీ ప్రయాణం సాగించిన సింగీతం.. దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, రచయితగా, నటుడిగా తనదైన ముద్ర వేశారు.

తెలుగు సినీ చరిత్రలో దర్శక దిగ్గజం కె.వి.రెడ్డి వద్ద ‘మాయాబజార్’ చిత్రానికి సహాయకుడిగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం.. ఆరు దశాబ్దాలకు పైగా సాగి ఎన్నో అద్భుత ప్రయోగాలకు వేదికైంది. 94 ఏళ్ల వయసులోనూ సినిమాపై ఆసక్తిని కొనసాగిస్తూ తన చివరి చిత్రాన్ని తెరకెక్కించిన సింగీతం.. చివరి వరకు తనలోని యువకుడిని సజీవంగా ఉంచుకున్నారు.

వయసును జయించిన యువకుడు

తొమ్మిది పదుల వయసులోనూ టీషర్ట్‌లో చలాకీగా కనిపించే సింగీతం.. వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని నమ్మేవారు. కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపనను ఎప్పుడూ వదులుకోలేదు. తనకంటే చిన్నతరం దర్శకుల నుంచి కూడా నేర్చుకుంటున్నానని చెప్పడం ఆయన నిరాడంబరతకు నిదర్శనం.

“ప్రతి నటుడిలో ఉన్న ప్రత్యేకతను గుర్తించి, దాన్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నించడమే నా విజయ రహస్యం” అని చెప్పిన సింగీతం.. నటుల నుంచి అత్యుత్తమ నటనను రాబట్టడంలో తనదైన శైలిని ఏర్పరుచుకున్నారు. అల్లు అర్జున్, గుణశేఖర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘వరుడు’లో నటుడిగానూ కనిపించి ప్రేక్షకులను అలరించారు.

ప్రయోగాలకు పర్యాయపదం

1972లో కృష్ణంరాజు, కాంచన జంటగా నటించిన ‘నీతి నిజాయితీ’తో దర్శకుడిగా అరంగేట్రం చేసిన సింగీతం.. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 60కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ముఖ్యంగా కమల్ హాసన్‌తో కలిసి ఆయన చేసిన ప్రయోగాలు భారతీయ సినిమా చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచాయి.

మాటలు లేకుండా కేవలం హావభావాలు, నేపథ్య సంగీతంతో తెరకెక్కించిన ‘పుష్పక విమానం’ సినిమా సింగీతం సృజనాత్మకతకు అద్దం పట్టింది. 1987లో విడుదలైన ఈ చిత్రం రెండు జాతీయ పురస్కారాలను అందుకుంది.

కమల్ హాసన్ అంధుడిగా నటించిన ‘అమావాస్య చంద్రుడు’, నాలుగు విభిన్న పాత్రల్లో అలరించిన ‘మైకేల్ మదన కామరాజు’, మరుగుజ్జు పాత్రలో కమల్ హాసన్ నటనతో సంచలనం సృష్టించిన ‘విచిత్ర సోదరులు’.. ఇలా ప్రతి చిత్రంలోనూ ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని అందించడమే సింగీతం లక్ష్యంగా కనిపిస్తుంది.

బాలకృష్ణతో చేసిన ‘భైరవద్వీపం’ జానపద చిత్రంగా ప్రేక్షకులను ఆకట్టుకోగా.. టైమ్ మెషీన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘ఆదిత్య 369’ తెలుగు సినిమాకు సైన్స్ ఫిక్షన్‌ను పరిచయం చేసిన వినూత్న ప్రయత్నంగా నిలిచింది.

నిజజీవిత నర్తకి సుధాచంద్రన్ కథ ఆధారంగా తెరకెక్కిన ‘మయూరి’, రాజేంద్రప్రసాద్‌ను మహిళా పాత్రలో చూపించిన ‘మేడమ్’, ఉద్యోగినుల సమస్యలను వినోదాత్మకంగా ఆవిష్కరించిన ‘ఆడవాళ్లకు మాత్రమే’ వంటి చిత్రాలు కూడా సింగీతం ప్రయోగాత్మక దృష్టికి నిదర్శనాలే.

సినిమాతో పాటు సంగీతానికీ సేవ

సింగీతం కేవలం దర్శకుడు మాత్రమే కాదు.. సంగీతాన్ని కూడా లోతుగా ఆస్వాదించిన కళాకారుడు.

1931 సెప్టెంబర్ 21న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించిన ఆయన విద్యాభ్యాసం ఉదయగిరి, గూడూరు, మద్రాసులో సాగింది. తండ్రి రామచంద్రరావు హెడ్‌మాస్టర్ కాగా.. తల్లి శకుంతలాబాయి వాయులీన విద్వాంసురాలు.


తల్లి నుంచి వచ్చిన సంగీత వారసత్వం, ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు వద్ద పొందిన శిష్యరికం ఆయనలోని సంగీత ప్రతిభను మరింత పదును పెట్టాయి. రెండు కన్నడ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన ఆయన.. తెలుగు సినిమాల్లోనూ తన సంగీత ముద్ర వేశారు.

‘మ్రోగింది వీణా పదేపదే..’, ‘ఒక వేణువు వినిపించెను..’, ‘పాడనా తెలుగు పాట..’, ‘మానసవీణ మధుగీతం..’ వంటి పాటలు ఇప్పటికీ సంగీతాభిమానుల జ్ఞాపకాల్లో నిలిచిపోయాయి.

శ్రీకల్యాణీయం.. జీవిత సహచరితో అందమైన ప్రయాణం

సింగీతం వ్యక్తిగత జీవితం కూడా ప్రత్యేకమైనదే. 1960లో లక్ష్మీ కల్యాణిని వివాహం చేసుకున్నారు. కథా చర్చలు, స్క్రిప్ట్ పనుల్లో ఆమె నుంచి ఎంతో సహకారం పొందిన సింగీతం.. భార్యతో తన అనుబంధాన్ని ‘శ్రీకల్యాణీయం’ పేరుతో ఆత్మకథగా మలిచారు.

కుమార్తె ఆ పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించగా.. మనవడు దాన్ని విడుదల చేశారు. 2022లో లక్ష్మీ కల్యాణి కన్నుమూసిన తర్వాత సింగీతం తన కుమార్తెలు, మనవళ్లతో కలిసి చెన్నై సాలి గ్రామంలో నివసించారు.

సినిమా ఉన్నంతకాలం సింగీతం ఉంటారు

రెండు జాతీయ పురస్కారాలు, ఐదు నంది అవార్డులు, పలు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు అందుకున్న సింగీతం శ్రీనివాసరావు భౌతికంగా మన మధ్య లేకపోయినా.. భారతీయ సినిమా చరిత్రలో ఆయన వేసిన ముద్ర చెరిగిపోదు.

సినిమా అంటే కేవలం వినోదం కాదని.. అది ప్రయోగాలకు, ఊహలకు, కొత్త ఆలోచనలకు వేదిక అని తన చిత్రాలతో నిరూపించిన దర్శకుడు ఆయన.

సింగీతం వెళ్లిపోయారు.. కానీ ఆయన ఎక్కించిన ‘పుష్పక విమానం’ మాత్రం ఇంకా ఎగురుతూనే ఉంది. తరతరాల ప్రేక్షకులను తనతో పాటు విభిన్నమైన సినిమాల లోకంలోకి తీసుకెళ్తూనే ఉంటుంది.

Read More
Next Story