
KURNOOL | అనాగరిక శిక్ష... కాళ్లకు సంకెళ్లు వేసేంతగా ఏమి తప్పు చేశాడు?
బనగానపల్లెలో అమానవీయ ఘటన.
బడిలో గడపాల్సిన 11 ఏళ్ల పిల్లాడికి కాలికి సంకెళ్లు వేశారు. దానికి తాళం కూడా వేశారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా బనగానపల్లెలో సంచలనం రేకెత్తించింది. ఈ దృశ్యాన్నిచూసిన ఓ బీజేపీ నేత ఆ వీడియో పోస్టు చేశారు. అంతే సోషల్ మీడియాలో "కాళ్లకు సంకెళ్లతో నడుస్తున్న పిల్లాడి" వీడియో వాట్సప్ గ్రూపుల్లో వైరల్ అయింది. చివరికి పోలీసులు స్పందించారు.
ఆ పసివాడు చేసిన నేరం ఏంటి? ఆడుకోవాల్సిన వయసులో అల్లరి చేయడం తప్పా? ఆ చిన్నారిని మందలించాల్సింది పోయి, నేరస్తుడి మాదిరి శిక్ష వేశారు. కాలికి గొలుసు కట్టి, దానికి భారీ చెక్క మొద్దును బిగించి తాళం వేశారు. ఆ బరువు మోయలేక, ఆ నొప్పి భరించలేక ఆ బాలుడు పడ్డ వేదన వర్ణనాతీతం. ఆ బరువును రోడ్డుపై ఈడ్చుకుంటూ వస్తుంటే వచ్చే ఆ శబ్దం.. వినే ప్రతి ఒక్కరి గుండె పిండేసింది.
ఈ ఘటనకు దారితీసిన పరిస్థితిపై బనగానపల్లెలో అర్బన్ సీఐ ప్రవీణ్ కుమార్ ఏమన్నారంటే,
"పిల్లాడిని అదుపులో పెట్టడానికి చేసిన పనితో సోషల్ మీడియా వల్ల నిందితురాలిగా మారారు" అని సీఐ ప్రవీణ్ కుమార్ కలత చెందారు. సమస్య పరిష్కరించడానికి తమ వంతు బాధ్యతగా కృషి చేస్తామని ఆయన చెప్పారు.
బనగానపల్లెలో ఏమి జరిగింది?
ఉమ్మడి కర్నూలు జిల్లా బనగానపల్లె పట్టనం ఈద్గానగర్ కు చెందిన ముస్లిం దంపతులు కుటుంబ కలహాత నేపధ్యంలో విడిపోయారు. 11 సంవత్సరాల కొడుకు మాత్రం తల్లి సంరక్షణలో ఉన్నాడు. చెడు సావాసాలతో దారి తప్పుతున్న కొడుకును దారిలో పెట్టడానికి ఆ తల్లి తాపత్రయపడింది. అయినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో ఆ తల్లి తల్లడిల్లింది. గత్యంతరం లేని స్థితిలో 11 ఏళ్ల కొడుకును సరైన మార్గంలో ఉంచాలని భావించింది. కొన్ని రోజుల కిందటే బనగానపల్లెలోని మదరసాలో చేర్పించింది. తన కొడుకు జీవితం చక్కదిద్దాలని మదరసా నిర్వాహకుడు ఇస్తాయిల్ కు ఆ తల్లి వేడుకుంది.
ఆ తరువాత ఏమి జరిగింది?
బనగానపల్లెలోని మదరసాలో ఉన్న 11 ఏళ్ల బాలుడు మూడు రోజుల కిందట బయటికి వెళ్లాడు. "పాత అలవాటు మార్చుకోలేక చిన్నపాటి చోరీకి పాల్పడ్డాడు" అని తల్లికి ఫిర్యాదు అందింది. దీంతో ఆ పిల్లాడిని కంట్రోల్ చేయడం తన వల్ల కావడం లేదని మరసా ఇన్ చార్జి ఇస్తాయిల్ అసహాయత వ్యక్తం చేసినట్టు తమ దర్యాప్తులో తేలిందని సీఐ ప్రవీణ్ కుమార్ చెప్పారు.
"కొడుకు తీరుతో ఆ తల్లి విసిగిపోయింది. కట్టడి చేయాలని భావించిన ఆ తల్లి, కొడుకు కాళ్లకు ఇనుప గొలుసు, దానికి తాళం వేసింది" అని సీఐ చెప్పారు. ఆ స్థితిలోనే ఆ పిల్లాడు రోడ్డుపైకి రావడం చేసిప ప్రజలు అవాక్కయ్యారు. రోడ్డుపై నడిచి వెళుతున్న బాలుడి స్థితిని చూసి, చలించిపోయారు. ఇదే పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. బనగానపల్లెలో కాళ్లకు సంకెళ్లతో నడుస్తున్న బాలుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మదరసా నిర్వాహకులపై తీరుపై విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ విషయం తెలియగానే పోలీసులు స్పందించారు.
బనగానపల్లె సీఐ ప్రవీణ్ కుమార్ ఏమన్నారంటే..
"11 సంవత్సరాల పిల్లాడికి సంకెళ్లు వేశారనే విషయం మా దృష్టికి రాగానే విచారణ చేశాం" అని సీఐ ప్రవీణ్ కుమార్ ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధికి చెప్పారు. వెంటనే ఆ బాలుడి తల్లిని పిలిపించడంతో పాటు మదరసాలో కూడా విచారణ చేయడంతో అసలు విషయం తెలిసిందని ఆయన చెప్పారు.
"చెడు తిరుగుళ్లకు అలవాటు పడిన కొడుకును దారిలో పెట్టడానికి ఆ తల్లి అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం కనిపించలేదు. దీంతో సంకెళ్లు వేయాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది" అని ఆ బాలుడి తల్లి తన వేదనను వివరించిందని సీఐ ప్రవీణ్ కుమార్ వివరించారు. ఇలా వ్యవహరించడం చట్టప్రకారం నేరం కావడం వల్ల ఆమెపై కేసు నమోదు చేశామని సీఐ చెప్పారు. పట్టణంలోని బీజేపీ నేత ఒకరు వైరల్ చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని, ఆ నాయకుడిని కూడా పిలిచించి, హెచ్చరించామని ఆయన తెలిపారు.
"ఏమైనా చేయండి, నా కొడుకును బాగు పరచండి అని ఆ బాలుడి తల్లి కన్నీరుపెట్టుకుంది. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య సున్నితంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన వివరించారు.
Next Story

