కర్నూలుకు హైకోర్టు బెంచ్? సీజే సానుకూల స్పందన!
x
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లీసా గిల్ తో సమావేశమైన రాయలసీమ న్యాయవాదులు

కర్నూలుకు హైకోర్టు బెంచ్? సీజే సానుకూల స్పందన!

'సీమ' లాయర్లతో చర్చలు సక్సెస్ అయ్యాయా?


కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయాలన్న రాయలసీమ న్యాయవాదుల డిమాండ్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ సానుకూలంగా స్పందించినట్లు కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. బెంచ్ ఏర్పాటు కోసం గత కొంతకాలంగా రాయలసీమలోని న్యాయవాదులు కోర్టుల బహిష్కరణతో ఆందోళన చేస్తున్న నేపథ్యంలో సీజే స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది.
కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. చంద్రుడు, ప్రధాన కార్యదర్శి టి. మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదుల ప్రతినిధి బృందం సోమవారం హైకోర్టు పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ రెడ్డి, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్‌ను కలిసి హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించింది. సీనియర్ న్యాయవాదులు ఎ. రామసుబ్బారెడ్డి, సి. నాగేంద్రనాథ్, వై. జయరాజు, చాంద్ బాషా, కపిలేశ్వరయ్య, జోగయ్య శర్మ, ఓంకార్, కోశాధికారి సుమనా రాణితో పాటు పలువురు న్యాయవాదులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
న్యాయవాదులతో సీజే సుమారు 15 నిమిషాల పాటు చర్చించినట్లు బార్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం, దీనికి సంబంధించిన న్యాయపరమైన అంశాలు, బెంచ్ కోసం రాయలసీమలో గతంలో జరిగిన ఉద్యమాల నేపథ్యాన్ని న్యాయవాదులు సీజే దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. దీనిపై జస్టిస్ లీసా గిల్ సానుకూలంగా స్పందించి, వీలైనంత త్వరగా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, కర్నూలులో హైకోర్టు బెంచ్ కోసం సుమారు 40 రోజులుగా న్యాయవాదులు ఆందోళన చేస్తున్నప్పటికీ ఈ విషయం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి ఆలస్యంగా వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. విచారణలో ఉన్న ఓ ఖైదీ చేసిన ఫిర్యాదు నేపథ్యంలో ఈ ఆందోళన విషయం సీజే దృష్టికి వచ్చినట్లు న్యాయవర్గాల్లో చర్చ జరుగుతోంది. అనంతరం ఆందోళన చేస్తున్న న్యాయవాదులతో చర్చించాలని ఆమె సూచించినట్లు తెలుస్తోంది.
సీజే విజ్ఞప్తి నేపథ్యంలో కర్నూలు న్యాయవాదుల ప్రతినిధులు ఆమెను కలిసి తమ డిమాండ్‌ను వివరించారు. అయితే సీజే సానుకూల స్పందన హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై తుది నిర్ణయంగా కాకుండా, ఈ అంశంపై పరిశీలనకు సంబంధించిన హామీగా చూడాల్సి ఉంటుంది. బెంచ్ ఏర్పాటు విషయంలో తదుపరి అధికారిక నిర్ణయం వెలువడాల్సి ఉంది.
Read More
Next Story