
కోవాబన్ వలీని పరామర్శించిన నాగబాబు, త్వరలో వస్తానని ప్రకటించిన లోకేష్
'కోవాబన్ వలీ' ఇప్పుడు ఆంధ్రా హీరో!
సమ్మక్క సారక్క జాతరలో ఘోరంగా అవమానపడ్డ కోవాబన్ వలీ ఇప్పుడు ఏపీ హీరోగా మారారు. ఆయన ఇంటికి రాజకీయ నాయకులు క్యూ కట్టారు..
“కోవా బన్ వలీ”.. ఇప్పుడీ పేరు ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశంగా మారింది. మేడారం జాతరలో కోవా బన్‌లు అమ్ముతున్న కర్నూలుకు చెందిన చిరు వ్యాపారి వలీపై ఒక యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు అనుచితంగా ప్రవర్తించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విస్తృత చర్చకు దారి తీసింది. యావత్ సోషల్ మీడియా వలీకి మద్దతుగా నిలిచింది. వలీపై పెద్దఎత్తున సానుభూతి వ్యక్తం కావడంతో ఇప్పుడాయనపై ఏపీ రాజకీయ నాయకులు దృష్టి సారించారు. వీరితో పాటు పలువురు సామాజికరంగ ప్రముఖులు కూడా వలీ ఇంటి బాట పట్టారు.
ఏమి జరిగింది?
మేడారం జాతరలో కోవా బన్‌లు విక్రయిస్తున్న సమయంలో ఒక యూట్యూబర్ వలీ వద్దకు వెళ్లి బన్ నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తాడు. కల్తీ చేశావా అంటూ అనుమానాలు వ్యక్తం చేశాడు. ఆధార్ కార్డు చూపించాలంటూ, పేరు చెప్పాలంటూ ఒత్తిడి తెచ్చాడు. ఈ క్రమంలో ఆ చిరు వ్యాపారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడినట్లు వీడియోలో కనిపించింది.
తాను అమ్మే బన్ నాణ్యమైనదేనని నిరూపించుకోవడానికి వలీ నిస్సహాయ స్థితిలో అదే బన్‌ను తిని చూపించాల్సి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనేక మంది దీన్ని అవమానకరంగా, మతపరమైన కోణంలో దుర్వినియోగం చేసిన చర్యగా అభివర్ణించారు.
అండగా రాజకీయ పార్టీలు..
కుటుంబాన్ని పోషించేందుకు కోవా బన్ అమ్ముకుంటున్న సాధారణ పౌరుడు వలీని కొందరు పనిగట్టుకొని భయబ్రాంతులకు గురిచేయడం సురికాదని ఎమ్మెల్సీ, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. కొందరి అత్యుత్సాహం వల్ల ఓ కుటుంబం ఇవాళ పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. చిరు వ్యాపారులకు చేతనైతే చేయూతనివ్వాలి తప్ప ఆరోపణలతో వారి కడుపు కొట్టడం సరికాదు. న్యాయబద్దంగా, నాణ్యమైన చిరుతిండి పదార్థాలు విక్రయించే చిరు వ్యాపారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.
మంత్రి నారా లోకేశ్ ‘X’ వేదికగా స్పందిస్తూ వలీకి మద్దతు ప్రకటించారు.
Dear Brother Vali, I am deeply sorry that you had to endure this. Such divisive and communal behavior has no place in our Telugu society, which has always stood for harmony, mutual respect, and brotherhood. I will meet you soon and look forward to tasting your famous Khoya bun!… https://t.co/AvckML9odY
— Lokesh Nara (@naralokesh) February 15, 2026
“డియర్ వలీ… మీరు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావడం బాధ కలిగించింది. సామరస్యం, పరస్పర గౌరవం, సోదరభావం కోసం నిలబడే తెలుగు సమాజంలో ఇటువంటి విభజనకు చోటు లేదు. నేను త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. మీరు తయారు చేసే కోవా బన్ రుచి చూస్తాను. మేం మీకు అండగా ఉంటాం” అని పేర్కొన్నారు.
YSRCP మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర మైనారిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ హఫీజ్ ఖాన్ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. షైక్షా వలి, జావీద్ వంటి చిన్న వ్యాపారులపై జరిగిన ఈ ఘటన దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.
“కష్టపడి జీవనం సాగిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకోవడానికి ఎవరికీ హక్కు లేదు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం పూర్తిగా తప్పు. సంబంధిత అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలి” అని అన్నారు.
“పేదరికానికి మతం ఉండదు. ఒక పేద మనిషికి తెలుసు ఒక్కటే — కష్టపడి పని చేసి కుటుంబాన్ని పోషించడం” అని ఆయన వ్యాఖ్యానించారు.
సామాజిక చర్చ
ఈ ఘటన మూడు ప్రధాన ప్రశ్నలను ముందుకు తెచ్చింది. సోషల్ మీడియా పేరుతో వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీయవచ్చా? మతపరమైన కోణంలో చిన్న వ్యాపారులను లక్ష్యంగా చేసుకోవడం పెరుగుతుందా?
యూట్యూబ్ కంటెంట్ పేరుతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే ధోరణిపై నియంత్రణ అవసరమా?
సోషల్ మీడియాలో అనేక మంది వలీకి మద్దతుగా నిలిచారు. “ద్వేషం కంటే మానవత్వం గొప్పది” అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అయ్యాయి.
వలీకి విభిన్న రాజకీయ పార్టీల నుంచి మద్దతు వ్యక్తమవుతోంది. అతనిని వ్యక్తిగతంగా కలుసుకోవాలని నాయకులు ప్రకటిస్తున్నారు. ఈ ఘటన చిన్న వ్యాపారుల గౌరవం, సామాజిక ఐక్యత, డిజిటల్ బాధ్యత వంటి అంశాలపై విస్తృత చర్చకు కారణమైంది.
“కోవా బన్ వలీ” ఇప్పుడు ఒక వ్యక్తి మాత్రమే కాదు — ఆత్మగౌరవానికి ప్రతీకగా మారుతున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Next Story

