
“కోడికత్తులు, గులకరాళ్లు.. నా ముందు పని చేస్తాయా తమ్ముళ్లూ!”
వైఎస్ జగన్ ను ఉతికి ఆరేసిన చంద్రబాబు, గొడ్డలి పార్టీ- నెవర్ అగైన్! అంటూ రెచ్చిపోయిన ముఖ్యమంత్రి
“గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్!” అని బాంబు పేల్చినట్టు చెప్పేశారు చంద్రబాబు. ఆయన కళ్లలో కోపం, కంఠంలో నిశ్చయం, మొహంలో వెటకారం కనిపించాయి. చిత్తూరు జిల్లా యాదమర్రిలో ప్రసంగ స్టైల్ మార్చి జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు చంద్రబాబు ఇవాళ.
“రప్పారప్పా రంకెలు.. జంతు రక్తంతో కటౌట్లకు అభిషేకాలు చేసిన రోజులు గుర్తున్నాయా? దళిత యువకుడు సుబ్రమణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వారికి సన్మానాలు చేశారు. కుటుంబాల మీద గొడ్డలి వేశారు. తల్లి-చెల్లెళ్ల ఆస్తులను కాజేశారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి రోజుకొక నాటకం ఆడారు. అసత్యాలతో రాజకీయ లబ్ధి కోసం ప్రజలను మోసం చేశారు” అని చంద్రబాబు రెచ్చిపోయారు. ఆయన కొంతసేపు ఆగి, ప్రజల వైపు చూసి మెల్లగా “ఇప్పుడు పరిస్థితి మారింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీలుస్తున్నారు. ఇక్కడ ఎవరూ భయపడి బతకాల్సిన అవసరం లేదు. నేను పెత్తందారు కాదు... ప్రజల సేవకుడిని” అంటూ ఆయన చెప్పడం, జనంతో చప్పట్లు చరిపించడం ఏకకాలంలో జరిగాయి.
ఆ తర్వాత చంద్రబాబు స్వరం మార్చి... “మనం ఇక హింస, రక్తం, భయం గురించి మాట్లాడాల్సిన పని లేదు. మనం మాట్లాడాల్సింది అభివృద్ధి, ఆరోగ్యం, భవిష్యత్తు గురించే. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక AI డాక్టర్ ఉంటాడు. ఆగస్టు 15 నాటికి సంజీవని పథకం పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. ఇంటి నుంచే 74 రకాల వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు. డబ్బు, హోదా, కార్లు ఎన్ని ఉన్నా... అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యం. మేము ప్రజల ప్రాణాలు, ఆస్తులు రక్షించే ప్రభుత్వం. మేము అభివృద్ధి చేసే ప్రభుత్వం” అని చెప్పుకొచ్చారు. ప్రజలు కూడా ఆలోచించాలని, గొడ్డలి పార్టీ నేతల్ని ఆదరించవద్దని హితవు పలికారు.
రక్తపాత రాజకీయాలు చేసిన వారికి చంద్రబాబు స్పష్టమైన సందేశం ఇచ్చారు- “ఇక మీ రోజులు ముగిశాయి. ఇక్కడ ఇప్పుడు అభివృద్ధి, శాంతి, టెక్నాలజీ, AI డాక్టర్లు, సంజీవని పథకాలు మాత్రమే మాట్లాడతాయి” అన్నప్పుడు జనం చప్పట్లు కొట్టారు.
“గొడ్డలి పార్టీ — నెవర్ అగైన్!” అంటూ నినదించారు.
Next Story

