
బావను చంపాడు... కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు... ఎందుకు?
నెల్లూరు జిల్లాలో మండల వ్యవసాయాధికారి హత్య కేసు.. హంతకుడు కుటుంబ సమేతంగా రైలు కింద పడి ఆత్మహత్య.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండల వ్యవసాయాధికారి ఎం. శ్రీహరి హత్య కేసు సంచలనం సృష్టించింది. భార్య లావణ్య ఫిర్యాదు మేరకు హత్యగా నమోదైన కేసులో పోలీసు అధికారులు లంచం తీసుకుని శవాన్ని దహనం చేయించడం, తర్వాత జరిగిన పరిణామాలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు కుడుముల హరికృష్ణ (తోట్లపల్లి గూడూరు) తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి మంగళవారం సింగరాయకొండ రైల్వే స్టేషన్ వద్ద రైలుకింద పడి కుటుంబ సమేతం ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.
హత్య ఎలా జరిగింది?
జూన్ 15న బుచ్చిరెడ్డిపాలెం సమీపంలోని పెంచలకోన ప్రాంతానికి బావమరిది, మరికొందరితో కలిసి శ్రీహరి వెళ్లాడు. కారులో తిరిగి ఇంటికి తిరిగి వస్తుండగా, బావమరిది కుడుముల హరికృష్ణ మరికొందరితో కలిసి ఆయనకు కుక్కలను చంపే ఇంజక్షన్ లు ఇచ్చి చంపేశారని ఆరోపణ. కుక్కలను చంపే మందుతో ఇంజక్షన్లు ఇచ్చి, కొట్టి హత్య చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మొదట గుండెపోటుతో మరణించినట్లు కుటుంబాన్ని నమ్మించి శవాన్ని దహనం చేయించే ప్రయత్నం జరిగింది.
అయితే శ్రీహరి భార్య లావణ్య ఇది సహజ మరణం కాదని, హత్య అని బుచ్చిరెడ్డిపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా సీఐ మాతంగి శ్రీనివాసరావు హంతకుల నుంచి రూ.20 లక్షల వరకు లంచం తీసుకుని కేసు నమోదు చేయకుండా శవాన్ని దహనం చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
పోలీసు వైఫల్యం.. అధికార యంత్రాంగం కదలిక
లావణ్య తన భర్త మరణం న్యాయం కోసం నెల్లూరు జిల్లా ఎస్పీ వేజెండ్ల అజితకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్పీ స్పందించి విచారణ చేపట్టారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కూడా ఈ కేసులో గుంటూరు డీఐజీ పై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.
దీని ప్రభావంతో అధికార యంత్రాంగం కదిలింది. ముందుగా సీఐ మాతంగి శ్రీనివాసరావుపై చర్యలు తీసుకుని వీఆర్‌కు పంపించారు. తర్వాత స్టేషన్‌లో ఉన్న 23 మంది పోలీసు సిబ్బందిని మూకుమ్మడిగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హంతకుడి ఆత్మహత్య.. పోలీసు బెదిరింపుల ఆరోపణలు
ఈ కేసులో ప్రధాన నిందితుడు కుడుముల హరికృష్ణ మంగళవారం ఉదయం తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి సింగరాయకొండ రైల్వే స్టేషన్ వద్ద వేగంగా వస్తున్న రైలు కింద పడి కుటుంబ సమేతం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్య వెనుక పోలీసుల ఒత్తిడి, బెదిరింపులు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు, రాజకీయ వర్గాల్లో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ప్రస్తుతం ఈ కేసు సంబంధించి ఉన్నత స్థాయి విచారణ జరుగుతోంది. హత్య, లంచం, ఆత్మహత్యలకు సంబంధించి పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

