యువ ఏపీ లక్ష్యంగా కీలక నిర్ణయాలు
x

యువ ఏపీ లక్ష్యంగా కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ 2026పై సీఎం సమీక్ష


రాష్ట్రంలో వేగంగా తగ్గుతున్న జననాల రేటుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ వృద్ధాప్య రాష్ట్రంగా మారకుండా అరికట్టేందుకు, యువ జనాభాను పెంచే దిశగా అత్యంత ప్రతిష్టాత్మకమైన పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ 2026 పై అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. జపాన్, ఇటలీ వంటి దేశాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న జనాభా సంక్షోభం ఏపీకి రాకూడదనే ఉద్దేశంతో ఈ సరికొత్త విధానాన్ని రూపొందించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

పడిపోతున్న సంతానోత్పత్తి రేటు (TFR) వివరాలు
రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు (Total Fertility Rate - TFR) గణనీయంగా పడిపోయినట్లు అధికారులు ఈ సమీక్షలో వెల్లడించారు. ఆరోగ్యకరమైన సమాజానికి కనీసం 2.1 TFR ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం రాష్ట్ర సగటు కేవలం 1.5 వద్దే నిలిచిపోయింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే, కడప జిల్లా 1.99 రేటుతో అత్యధికంగా ఉండగా, విశాఖపట్నం జిల్లా 1.32 శాతంతో రాష్ట్రంలోనే అత్యల్పంగా నమోదైంది. ఈ గణాంకాలు రాష్ట్ర భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది.
మిషన్ 2.1 .. ముఖ్యమంత్రి దిశానిర్దేశం
ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ముఖ్యమంత్రి మిషన్ 2.1 అనే లక్ష్యాన్ని ప్రకటించారు. ప్రస్తుతమున్న 1.5 TFR స్థాయిని రీప్లేస్‌మెంట్ లెవల్ అయిన 2.1 కి పెంచడానికి తగిన కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వైద్యారోగ్య, ఆర్థిక, మహిళా శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. కేవలం జనాభా పెంపు మాత్రమే కాకుండా, నాణ్యమైన మానవ వనరుల అభివృద్ధిపై కూడా దృష్టి సారించాలని సీఎం సూచించారు.
పోషణ..శిక్ష.. సురక్ష ప్యాకేజీ .. ప్రోత్సాహకాలు
జనాభా పెంపును ప్రోత్సహించడానికి ప్రభుత్వం భారీ ఆఫర్లను ప్రతిపాదించింది. ఇందులో భాగంగా రెండో లేదా మూడో బిడ్డ జన్మించిన కుటుంబానికి ₹25,000 తక్షణ ఆర్థిక సాయం అందించనున్నారు. అలాగే, మూడో బిడ్డకు మొదటి ఐదేళ్ల పాటు నెలకు రూ. 1,000 చొప్పున పోషణ భృతి ఇవ్వనున్నారు. అదనంగా, రెండో, మూడో బిడ్డకు 18 ఏళ్ల వరకు ప్రభుత్వ సంస్థల్లో ఉచిత విద్యను అందించాలని నిర్ణయించారు. ఉద్యోగస్థులైన తల్లిదండ్రుల కోసం తల్లికి ఏడాది పాటు ప్రసూతి సెలవు, తండ్రికి రెండు నెలల పితృత్వ సెలవు ఇచ్చేలా నిబంధనలను సవరించనున్నారు.
IVF కేంద్రాలు, మహిళా ఉపాధి
సంతానలేమి సమస్యతో బాధపడే వారి కోసం పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) పద్ధతిలో రాయితీతో కూడిన IVF చికిత్సలు అందించేలా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు, మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ, రాష్ట్ర మహిళా కార్మిక శక్తిని ప్రస్తుతం ఉన్న 31% నుండి 59%కి పెంచాలని నిర్ణయించారు. దీనికోసం ప్రత్యేక శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ నూతన విధానాన్ని ఏప్రిల్ 2026 నుండి రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Read More
Next Story