
కేజ్రీవాల్ కేసులో కీలక మలుపు..
విచారణ నుంచి వైదొలిగిన జస్టిస్ తేజస్ కరియా
ఢిల్లీ హైకోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేతలపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ నుంచి జస్టిస్ తేజస్ కరియా బుధవారం (ఏప్రిల్ 22) వైదొలిగారు. దీంతో ఈ పిటిషన్‌ను మరో ధర్మాసనం ముందుకు తీసుకెళ్లాలని కోర్టు ఆదేశించింది.
మొదట ఈ కేసు ప్రధాన న్యాయమూర్తి డి.కె. ఉపాధ్యాయ, జస్టిస్ కరియాలతో కూడిన ధర్మాసనం విచారించాల్సి ఉంది. అయితే జస్టిస్ కరియా ఈ కేసు నుంచి తప్పుకోవడంతో మరో బెంచ్ ముందు ఈ కేసును గురువారం (ఏప్రిల్ 23) విచారణకు పెట్టాలని ఆదేశించారు.
అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా పలువురు ఆప్ నేతలపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని న్యాయవాది వైభవ్ సింగ్ కోరారు. కోర్టు విచారణకు సంబంధించిన వీడియో క్లిప్‌లను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలైంది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసును విచారణ చేస్తున్న జడ్జి స్వరన్ కాంత శర్మను మార్చాలని కేజ్రీవాల్ కోరిన విషయం తెలిసిందే. ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాలున్న జడ్జి తమకు న్యాయం చేయదని వాదించారు. కానీ కేజ్రీవాల్ అభ్యర్థనను స్వరన్ కాంత శర్మ తిరస్కరించారు. తాను పక్షపాతంగా వ్యవహరిస్తున్నానని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఆమె స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, కోర్టు కార్యకలాపాల వీడియోల లీక్ అంశంపై ఇప్పటికే హైకోర్టు పరిపాలన విభాగం పోలీసులను సంప్రదించినట్లు సమాచారం. ఈ పరిణామాల మధ్య, ఆప్ నేతలపై దాఖలైన ఈ పిటిషన్ విచారణకు కొత్త మలుపు తిరిగింది.

