
తల్లిని వేధిస్తున్నాడనీ.. తండ్రి ప్రాణాలు తీసిన కొడుకు
కడప జిల్లా ప్రొద్దుటూరు వద్ద కొడుకు చేతిలో పీరాన్ ప్రాణాలు పోయాయి...
మద్యం మత్తులో తల్లిని హింసించడం 16 సంవత్సరాల కొడుకు సహించలేకపోయాడు. సహనం కోల్పోయి, కత్తితో తండ్రిని హత్య చేశాడు. మద్యం మత్తు ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఈ సంఘటన కడప జిల్లా చాపాడు మండలంలో బుధవారం జరిగింది.
కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజవర్గం చాపాడు మండలంలోని ఓబులరెడ్డిపేట ఓ చిన్న గ్రామం. పీరాన్ బాషా రోజూ మద్యం తాగి ఇంటికి వస్తున్నాడు. మద్యం మత్తులో తన భార్యను వేధించడం, కొట్టడం అనేది నిత్యకృత్యంగా మారింది. రోజుల తరబడి సాగుతున్న ఈ వ్యవహారంతో పీరాన్ కొడుకు (16 సంవత్సరాలు) తీవ్ర వేదనకు గురయ్యాడు. తండ్రి పద్ధతిలో ఏమాత్రం మార్పురాకపోగా, చుట్టుపక్కల నివాసితులు గమనిస్తుండడం 16 ఏళ్ల బాలుడు అవమానంగా భావించినట్లు కనిపిస్తోంది.
చెప్పినా వినలేదని..
యథావిధిగానే పీరాన్ బాషా మంగళవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. తల్లిని వేధించడం, దూషించడం 16 ఏళ్ల కొడుకు భరించలేకపోయాడు. ఎంతవారిస్తున్నా, తండ్రి వినలేదు. దీంతో విచక్షణ కోల్పోయిన ఆ బాలుడు ఆవేశంతో ఇంట్లోని కత్తి తీసుకుని దాడికి పాల్పడ్డాడని తెలిసింది. దీంతో పీరాన్ బాషా ప్రాణాలు కోల్పోయాడు. ఈ సమాచారం అందుకున్న చాపాడు పోలీసులు ఓబుల్ రెడ్డిపేటకు చేరుకున్నారు. తండ్రిపై కత్తితో దాడి చేసి, హత్య చేసిన 16 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. పీరాన్ బాషా మృతదేహాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. చాపాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

