జనసేన ఎంపీ లింగమనేని కుమారుడికి సంకెళ్లు తప్పవా?
x
లింగమనేని రమేష్, ఆయన కుమారుడు సంజూష్ (ఫైల్)

జనసేన ఎంపీ లింగమనేని కుమారుడికి సంకెళ్లు తప్పవా?

కారును వేగంగా నడిపి ఓ యువతి మృతికి కారణమైన లింగమనేని రమేశ్ కుమారుడు సంజూష్ పై కేసు


తండ్రి పార్లమెంటు సభ్యుడైతే కుమారుడు నిర్లక్ష్యంగా కారు నడిపి మరొకర్ని బలిగొనవచ్చా?
నాలుగు రోజుల కిందట ప్రమాదం చేస్తే ఇప్పటి దాకా పోలీసులు కేసు బయటపెట్టకపోవడానికి కారణం ఏమిటీ?
డబ్బా, అధికారమా, పలుకుబడా?
హైదరాబాద్‌లోని మాదాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలో యువతి మృతికి కారణమైన రోడ్డు ప్రమాదం కేసులో ప్రస్తుతం ప్రజలు వేస్తున్న ప్రశ్నలు ఇవి. జనసేన పార్టీ ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు లింగమనేని సంజూష్‌ ఈనెల 16న హైదరాబాద్ ఇన్ ఆర్బిట్ మాల్ వద్ద వేగంగా కారు నడిపి ఓ యువతి మృతికి కారణం అయ్యారనే దానిపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తీరా అసలు విషయం బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు.
అసలేం జరిగిందీ?
ఆగస్టు 16న మాదాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలో సంజూష్ నడుపుతున్న కారు భారతి (26) అనే యువతిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఈ ఘటన ఈనెల 20వ తేదీ వరకు బయటకు రాలేదు. విషయం బయటకు పొక్కిన తర్వాత ర్యాష్ డ్రైవింగ్ సహా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదం జరిగిన సమయంలో కారు వేగం, ట్రాఫిక్ పరిస్థితులు, సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు.
పరీక్షల్లో నెగెటివ్ – మరోసారి విచారణ
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంజూష్‌ను అదుపులోకి తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలతో పాటు డ్రగ్ టెస్టులు నిర్వహించగా నెగెటివ్ ఫలితాలు వచ్చినట్లు సమాచారం. కేసు దర్యాప్తులో భాగంగా మరిన్ని వివరాలు సేకరించేందుకు సంజూష్‌ను పోలీసులు మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. వాహనం పరిస్థితి, ప్రమాదం జరిగిన తీరుపై పూర్తి స్థాయి సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు.
'నేను పారిపోలేదు'.. సంజూష్ స్పందన
ఈ ఘటనపై సంజూష్ తొలిసారిగా స్పందిస్తూ వివరణ ఇచ్చారు. ప్రమాదం తన నిర్లక్ష్యం వల్ల జరగలేదని, ఇది దురదృష్టవశాత్తూ జరిగిన ఘటన అని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే తాను అక్కడి నుంచి పారిపోలేదని, తీవ్రంగా గాయపడిన భారతిని తన వాహనంలోనే వెంటనే ఆస్పత్రికి తరలించానని తెలిపారు. అనంతరం స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వివరాలు వెల్లడించానని చెప్పారు. వైద్య పరీక్షల్లోనూ తాను ఎలాంటి మత్తు పదార్థాల ప్రభావంలో లేనట్లు స్పష్టమైందని, దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తూ బాధిత కుటుంబానికి అండగా ఉంటానని ఆయన వెల్లడించారు.
రాజకీయ ఒత్తిళ్ల ఆరోపణలు
మరోవైపు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తృత కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక బడా కాంట్రాక్టర్ పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని, ఆ కారణంగానే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందన్న ప్రచారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే పోలీసులు మాత్రం నిబంధనల ప్రకారమే సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నామని స్పష్టం చేస్తున్నారు.
Read More
Next Story