స్వర్ణకారుడిపై దాడి..కిలో బంగారం దోపిడీ
x

స్వర్ణకారుడిపై దాడి..కిలో బంగారం దోపిడీ

కారంపూడిలో సినీ ఫక్కీలో బంగారం బ్యాగుతో దుండగులు పరార్.


పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి పట్టణంలో సోమవారం పట్టపగలే భారీ దోపిడీ కలకలం రేపింది. వినుకొండకు చెందిన ఓ స్వర్ణకారుడు ఆర్డర్లపై బంగారు నగలు తయారు చేసి, వివిధ ప్రాంతాల్లోని దుకాణాలకు పంపిణీ చేస్తుంటాడు. ఈ క్రమంలో సోమవారం నాడు తాను తయారు చేసిన ఆభరణాలను కారంపూడిలోని దుకాణదారులకు అప్పగించేందుకు వెళ్తుండగా, మాటు వేసిన దుండగులు అతడిపై మెరుపుదాడి చేశారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనలో దుండగులు బాధితుడిని అడ్డుకుని, తీవ్రంగా దాడి చేసి అతడి వద్ద ఉన్న బ్యాగును లాక్కొని పరారయ్యారు.

కేజీ బంగారం మాయం
దుండగులు ఎత్తుకెళ్లిన బ్యాగులో సుమారు ఒక కిలో (1 KG) బంగారు ఆభరణాలు ఉన్నట్లు బాధితుడు కారంపూడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీని విలువ మార్కెట్లో భారీగానే ఉంటుందని అంచనా. ఈ హఠాత్పరిణామంతో షాక్‌కు గురైన బాధితుడు వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించి గోడు వెళ్లబోసుకున్నాడు. వ్యాపారి కదలికలపై ముందే అవగాహన ఉన్న వ్యక్తులే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
సిసిటివి ఫుటేజీ ఆధారంగా పోలీసుల వేట
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి, పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను (CCTV Footage) సేకరించారు. దుండగులు ఏ దిశగా పరారయ్యారు, వారు వాడిన వాహనం ఏంటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పట్టపగలే రద్దీగా ఉండే ప్రాంతంలో కేజీ బంగారం దోపిడీకి గురికావడంతో స్థానిక వ్యాపారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read More
Next Story