‘వందే మాతరం మన జాతీయ గీతం కాదు’
x

‘వందే మాతరం మన జాతీయ గీతం కాదు’

– టీఎం కృష్ణ స్పష్టీకరణ


Click the Play button to hear this message in audio format

వందే మాతరం పాటపై ప్రభుత్వ తాజా మార్గదర్శకాలు అభ్యంతరకరంగా ఉన్నాయని ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు టీఎం కృష్ణ అభిప్రాయపడ్డారు. భారత జాతీయ చిహ్నాలు, రాజ్యాంగ విలువలపై తాను రాసిన “We the People of India” పుస్తకంలో ఈ అంశాలను విస్తృతంగా ప్రస్తావించినట్లు తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, దేశభక్తి అంటే కేవలం నినాదాలు లేదా బలవంతపు ప్రదర్శనలు కాకుండా రాజ్యాంగ విలువలను గౌరవించడం కావాలని అన్నారు.

టీఎం కృష్ణ మాట్లాడుతూ.. 1950లో భారతదేశం గణతంత్రంగా మారినప్పుడు దేశం ఒక గొప్ప కలను ముందుంచుకుందని, కానీ నేటి పరిస్థితుల్లో ఆ విలువలు కొంతవరకు మరుగున పడుతున్నాయనే బాధ కలుగుతోందని చెప్పారు. తాను సంగీతకారుడిగా ప్రపంచాన్ని శబ్దాల ద్వారా అనుభవిస్తానని, “జనగణమన” పాటలోని ఇతర చరణాలను పాడేటప్పుడు దేశ వైవిధ్యాన్ని ప్రతిబింబించే పదాలు వినిపించినప్పుడల్లా భావోద్వేగానికి లోనవుతానని పేర్కొన్నారు.

రాజ్యాంగ ప్రాంబుల్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన కృష్ణ, అది కేవలం పాఠశాలల్లో గుర్తుపెట్టుకునే పాఠ్యంగా కాకుండా దేశానికి మార్గదర్శకంగా చూడాలని సూచించారు. ప్రాంబుల్‌లోని “సెక్యులర్”, “సోషలిస్ట్” వంటి పదాలు మొదట లేకపోయినా, ఆ భావన రాజ్యాంగంలో ప్రారంభం నుంచే అంతర్భాగంగా ఉందని వివరించారు. భారత రాజ్యాంగం మతనిరపేక్షతను స్పష్టంగా ప్రతిబింబిస్తుందని, ఒకే మతానికి దేశాన్ని పరిమితం చేయాలనే ఆలోచన సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రాంబుల్‌లోని “సోదరభావం” (Fraternity) అనే పదాన్నే అత్యంత ముఖ్యమైనదిగా కృష్ణ పేర్కొన్నారు. అది పౌరుల మధ్య పరస్పర గౌరవం, సహనం, ప్రేమను పెంపొందించాల్సిన బాధ్యతను గుర్తు చేస్తుందని చెప్పారు. అంబేద్కర్ ఈ భావనకు ప్రాధాన్యం ఇచ్చారని గుర్తుచేశారు. సోదరభావం లేకపోతే న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ వంటి విలువలు బలహీనపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

“సత్యమేవ జయతే” వంటి జాతీయ చిహ్నాలు కేవలం నినాదాలు కాకుండా సమాజానికి దిశానిర్దేశం చేసే విలువలని టీఎం కృష్ణ అభివర్ణించారు. దేశభక్తి అనేది ఆర్భాటంగా ప్రదర్శించాల్సిన విషయం కాదని, అది మనం 1950లో స్వీకరించిన రాజ్యాంగ విలువలను ఆచరించడంలోనే కనిపించాలని అన్నారు. చాలా మంది విద్యార్థులకు 1947 స్వాతంత్ర్యం తెలిసినా, 1950 జనవరి 26 గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యత తెలియకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. దేశ చిహ్నాలు, రాజ్యాంగ సూత్రాలను పాఠశాల స్థాయి నుంచే భావోద్వేగంగా బోధించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

Read More
Next Story