
రూబియోను, జైశంకర్ కలుస్తాడు: సెర్గియో గోర్
ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్, విదేశాంగ మంత్రిని ఉద్యోగిగా చూస్తున్నారని ఆగ్రహం
సీమా గుహ
అమెరికా రాయబారి సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలు భారత్‌లో రాజకీయ దుమారం రేపుతున్నాయి. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ముంబై పర్యటనకు వస్తున్న నేపథ్యంలో, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో ఆయన సమావేశం కానున్నారు. అయితే, జైశంకర్‌ను ముంబైకి రావాలని అమెరికా ఆశిస్తోందంటూ గోర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మోదీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. దీనిపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది.
ఈ నెలలో భారత్‌కు రానున్న రూబియో, జామ్‌నగర్‌లోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన చమురు శుద్ధి కర్మాగారాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా జైశంకర్‌తో సమావేశం ఉంటుందని గోర్ వెల్లడించారు.
అక్టోబర్ 15న ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జైశంకర్ తమతో సమావేశమవుతారని ఆశిస్తున్నట్లు గోర్ పేర్కొనడం వివాదానికి కారణమైంది. ముఖ్యంగా, ఆయన ఉపయోగించిన ‘ఎక్స్‌పెక్ట్’ అనే పదం.. భారత విదేశాంగ మంత్రిని అమెరికా తన వద్దకు పిలిపిస్తున్నట్లుగా అర్థం చేసుకునే పరిస్థితిని సృష్టించింది.
దీనిపై కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది. జైశంకర్‌ను అమెరికా కోరినందువల్లే ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లాల్సి వస్తోందని, వాషింగ్టన్ ముందు మోదీ ప్రభుత్వం లొంగిపోయిందని ప్రతిపక్షం ఆరోపించింది.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి తన ఉద్యోగిని పిలిపించుకున్నట్లుగా జైశంకర్‌ను ముంబైకి రప్పిస్తున్నారని విమర్శిస్తూ, విదేశాంగ శాఖలో ఏం జరుగుతోందో ప్రధాని మోదీ వివరించాలని డిమాండ్ చేశారు.
అయితే, ఈ వివాదంపై భారత విదేశాంగ శాఖ స్పష్టత ఇచ్చింది. అక్టోబర్ 20న ముంబైలో రూబియోతో జైశంకర్ సమావేశమవుతారని అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. విదేశీ ప్రముఖులతో ఢిల్లీ వెలుపల సమావేశాలు నిర్వహించడం అసాధారణమేమీ కాదని వివరించారు.
గతంలో అహ్మదాబాద్‌లో జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌తో, వారణాసిలో మారిషస్ ప్రధానితో, వడోదరలో స్పెయిన్ ప్రధానితో ప్రధాని మోదీ సమావేశమైన విషయాలను గుర్తుచేశారు. గోవాలో షాంఘై సహకార సంస్థ విదేశాంగ మంత్రుల సమావేశం నిర్వహించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు.
రూబియో, జైశంకర్ మధ్య జరిగే చర్చల్లో ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, కీలక ఖనిజాలు వంటి అంశాలు ప్రాధాన్యం పొందనున్నాయి. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపైనా ఇరువురు చర్చించనున్నారు.
ముఖ్యంగా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై అమెరికా అనుసరిస్తున్న వైఖరి ఈ సమావేశానికి ప్రాధాన్యం పెంచుతోంది. రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలు విధించే ప్రతిపాదనలు కూడా ఇరు దేశాల మధ్య చర్చలకు కీలకంగా మారే అవకాశం ఉంది.
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత భారత్–అమెరికా సంబంధాల్లో వాణిజ్య సుంకాలు, రష్యా చమురు కొనుగోళ్ల వంటి అంశాలపై విభేదాలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో, రెండు దేశాల మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రూబియో పర్యటన ఇరు దేశాల సంబంధాల పరంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోవైపు, సెర్గియో గోర్ తన ముక్కుసూటి వ్యాఖ్యలకు పేరుపొందారు. ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఆయన, దౌత్యపరమైన సంప్రదాయాల కంటే నేరుగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తారని భావిస్తున్నారు. ప్రస్తుతం భారత్–అమెరికా మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఆయన ఆసక్తి చూపుతున్నారు.
గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ ట్రంప్ ఇదే తరహాలో వ్యవహరించారు. భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ అధికారికంగా ప్రకటించకముందే, ఆ నిర్ణయానికి సంబంధించిన ప్రకటనలు చేసి దాని ఘనతను తనకు ఆపాదించుకునేందుకు ప్రయత్నించారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. దీనిపై మోదీ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. ట్రంప్ లేదా అమెరికా పేరును ప్రస్తావించకుండానే, కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా చేసిన వాదనలను భారత్ తిరస్కరించింది.
ట్రంప్ నుంచి వస్తున్న వివిధ వ్యాఖ్యలు, విమర్శలపై భారత్ చాలాసార్లు సంయమనంతో వ్యవహరిస్తోంది. అమెరికా నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, భారత ఎగుమతులకు అమెరికా మార్కెట్ కీలకంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో, రూబియో పర్యటనలో జరిగే చర్చలు ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను ఎలా ప్రభావితం చేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

