వైఎస్ జగన్‌ ‘సర్‌’ పై సీరియస్ అలర్ట్
x

వైఎస్ జగన్‌ ‘సర్‌’ పై సీరియస్ అలర్ట్

బోగస్ ఓట్లు, తొలగింపులపై జాగ్రత్త...


ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సంఘం త్వరలో చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ నాయకులు, కార్యకర్తలకు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు.

బుధవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో జగన్ మాట్లాడుతూ ‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియను అప్రమత్తంగా ఎదుర్కోవాలి. ఇది సాధారణ ప్రక్రియ కాదు. దీని ద్వారా ఓట్లు తొలగించి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి అని స్పష్టం చేశారు.

ఇటీవల ఎన్నికల అనుభవాలను ఉదాహరణగా చెప్పిన జగన్, పశ్చిమ బెంగాల్‌లో 91 లక్షల ఓట్లు (మొత్తం ఓట్లలో 11.9 శాతం), తమిళనాడులో 74 లక్షల ఓట్లు (11.6 శాతం) తొలగించిన విషయాన్ని ప్రస్తావించారు. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ నియోజకవర్గంలోనే 44,990 ఓట్లు తొలగించగా, ఆమె 15,105 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పోటీ చేసిన నియోజకవర్గంలో 71,133 ఓట్లు తొలగించడంతో ఆయన 8వేల ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు.

‘‘బెంగాల్‌లో 91 లక్షల ఓట్లు తీసేస్తే మమతా పార్టీ 31 లక్షల తేడాతో ఓడింది. తమిళనాడులో 74 లక్షలు తొలగిస్తే స్టాలిన్ పార్టీ 17 లక్షల తేడాతో ఓడింది. ఓట్లు పెరిగి మనం ఓడినట్టు, ఓట్లు తొలగించి వాళ్లు ఓడినట్టు. రెండూ ప్రమాదకరమే” అని జగన్ హెచ్చరించారు.

అంతేకాకుండా టీడీపీ బోగస్ ఓట్లపై కూడా పార్టీ శ్రేణులు నిరంతరం దృష్టి సారించాలని సూచించారు. కుప్పం నియోజకవర్గంలోనే 22 వేల అనుమానాస్పద ఓట్లు ఉన్నాయని, ఒకే వ్యక్తి పేరు ఐదు, పది సార్లు వచ్చి, తండ్రి/భర్త పేరు కూడా అదే ఉండటం వంటి విషయాలు బయటపడ్డాయని చెప్పారు. “ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా ఒక హిస్టరీ అండ్ మిస్టరీ. ఇలాంటి తప్పుడు, బోగస్ ఓట్లను గుర్తించి, నిర్ద్వంద్వంగా పోరాడాలి” అని ఆయన కార్యకర్తలకు సూచించారు.

ఎన్నికల సంఘం SIR ప్రక్రియను మరింత పారదర్శకంగా, న్యాయబద్ధంగా నిర్వహించాలని, ఏ రకమైన దుష్ప్రయోగాలకు తావు లేకుండా చూడాలని వైఎస్సార్‌సీపీ నాయకత్వం డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండి, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించాలని జగన్ స్పష్టమైన సందేశం ఇచ్చారు.

Read More
Next Story