
‘జీవించడం కష్టంగా ఉంది: ఢిల్లీ జడ్జి
ఆత్మహత్యకు ముందు తండ్రికి మెసేజ్..
దేశ రాజధానిలోని తన నివాసంలో ఢిల్లీ కోర్టు జడ్జి అమన్ కుమార్ శర్మ (Aman Kumar Sharma) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మరణానికి ముందు తన తండ్రికి పంపిన సందేశం వెలుగులోకి రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. మే 2న జరిగిన ఈ ఘటనకు ముందు, తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, జీవించడం కష్టంగా ఉందని అమన్ కుమార్ తన తండ్రి ప్రేమ్ శర్మ (Prem Sharma)కు చెప్పినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గత రెండు నెలలుగా తాను మానసికంగా వేధింపులకు గురవుతున్నానని కూడా అమన్ కుమార్ చెప్పాడని వారు పేర్కొన్నారు. ఈ సమాచారం అందుకున్న తండ్రి అల్వార్ నుంచి ఢిల్లీకి చేరుకున్నప్పటికీ, కోడలు అతడిని ఇంట్లోకి రానివ్వలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
కొంతకాలంగా విభేదాలు..
గత కొంతకాలంగా అమన్ కుమార్ శర్మ దంపతుల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆత్మహత్య జరిగిన రోజున కూడా ఇంట్లో గొడవ జరిగినట్లు వారు తెలిపారు. “ఆ రోజు అతని భార్య గట్టిగా అరుస్తుండగా, అమన్ ఏడుస్తున్నాడు. ఆ తర్వాత అకస్మాత్తుగా నిశ్శబ్దం అలుముకుందని,” శర్మ బంధువొకరు తెలిపారు. భార్యతో పాటు, భార్య సోదరి నిధి మాలిక్ కూడా అమన్ కుటుంబ వ్యవహారాలలో జోక్యం చేసుకుందని ఆయన బంధువులు ఆరోపిస్తున్నారు. భార్య కుటుంబంతో సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని కూడా వారు తెలిపారు.
ఇంతకు ఏ జరిగింది?
ఢిల్లీ గ్రీన్ పార్క్ మెయిన్ ప్రాంతంలోని తన నివాసంలో బాత్రూంలో ఉరి వేసుకుని అమన్ కుమార్ మృతిచెందారు. తలుపు లోపలి నుంచి తాళం వేసి ఉండటంతో, పోలీసులు కిటికీ పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనా స్థలంలో లభించిన లేఖలో తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని అమన్ కుమార్ పేర్కొన్నట్లు సమాచారం. అయినప్పటికీ మానసిక వేధింపుల వల్లే బలవన్మరణానికి పూనుకున్నారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
కొనసాగుతోన్న దర్యాప్తు..
ఈ ఘటనను పోలీసులు ప్రాథమికంగా ఆత్మహత్యగా పరిగణించినప్పటికీ, అన్ని కోణాల్లో విచారిస్తున్నామని చెప్పారు. తండ్రి ఇచ్చిన వాంగ్మూలం, కుటుంబ సభ్యుల ఆరోపణల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.
30 ఏళ్ల అమన్ కుమార్ శర్మ, పూణేలోని Symbiosis Law Schoolలో న్యాయశాస్త్రం అభ్యసించారు. అక్టోబర్ 2025 నుంచి ఢిల్లీలోని కర్కర్‌డూమా కోర్టుల పరిధిలో ఈశాన్య జిల్లా న్యాయ సేవల అథారిటీలో పూర్తి కాల కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

