‘‘మన కుమార్తెలు అలాంటి భాష ఉపయోగించడం బాధ కలిగించింది’’
x
నరేంద్ర మోదీ

‘‘మన కుమార్తెలు అలాంటి భాష ఉపయోగించడం బాధ కలిగించింది’’

మరో సెల్పీ వీడియోలో ప్రధాని మోదీ


జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసనల్లో తనతో పాటు తన దివంగత తల్లిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అలాంటి ఘటనలపై కోపంతో కాకుండా, యువతను క్షమించి సరైన మార్గంలో నడిపించాలని సమాజానికి ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం అర్థరాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో సెల్ఫీ వీడియోను విడుదల చేశారు.

సమాజంలో ఉన్న ఆవేదన తనకు పూర్తిగా అర్థమవుతోందని మోదీ అన్నారు. అయితే యువతను దూరం చేయడం లేదా శిక్షించడం కంటే, వారికి దారి చూపించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జంతర్ మంతర్ నిరసనలో కొందరు నాగరిక సమాజానికి తగని భాషను ఉపయోగించి తనను, తన దివంగత తల్లిని దూషించారని చెప్పారు.

దూషణలు ఏ సమస్యకూ పరిష్కారం కాదని పేర్కొన్న ప్రధాని, తప్పుదారి పట్టిన వారిని శిక్షించడం కంటే వారిని సరిదిద్దడమే సమాజం బాధ్యత అని అన్నారు. "వారు తప్పులు చేసి ఉండొచ్చు. కానీ చివరికి వారు మన పిల్లలే. మన నాలుకను కొరికిందని పళ్లను వదిలేయం. అలాగే యువతను కూడా వదిలేయకూడదు" అనే ఉపమానంతో తన అభిప్రాయాన్ని వివరించారు.

తప్పులు చేసిన యువత ముందుకు వచ్చి వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలని, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మోదీ సూచించారు. వారిని కోర్టులకు లాగడం లేదా సమాజం ముందు అవమానించడం వల్ల పరిస్థితి మారదని, ప్రేమతో మార్గనిర్దేశం చేయడమే సరైన మార్గమని చెప్పారు.

దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, యువత కూడా ఆ ప్రయాణంలో భాగం కావాలని ప్రధాని ఆకాంక్షించారు. వారి ఉజ్వల భవిష్యత్తు కోసం తాను పనిచేస్తున్నానని, దేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు అందరూ కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ విమర్శలు

ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. దేశం ప్రధానిని క్షమాపణ చెప్పాలని కోరుతుంటే, ఆయన మాత్రం దేశాన్నే క్షమిస్తున్నట్లు మాట్లాడారని విమర్శించింది.

ప్రధాని వీడియోను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేరా సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో స్పందించారు. "దేశం ఆయనను క్షమాపణ చెప్పమని అడుగుతోంది. కానీ ఆయన మాత్రం దేశాన్నే క్షమించారు" అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

సీజేపీ నిరసన నేపథ్యం

న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసనలు చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, తమ ఇతర డిమాండ్లను ప్రభుత్వం అమలు చేయాలని వారు కోరారు. అనంతరం ప్రభుత్వం నిరసనకారుల ప్రధాన డిమాండ్లను అంగీకరించడంతో, జూన్ 20న ప్రారంభమైన ఈ ఆందోళన 36 రోజుల తర్వాత జూలై 25న ముగిసింది.


Read More
Next Story