ట్రంప్ పై కాల్పుల వెనక కుట్ర ఉందా? ఇంతకీ ఈ క్రూక్స్ ఎవరు?
x

ట్రంప్ పై కాల్పుల వెనక కుట్ర ఉందా? ఇంతకీ ఈ క్రూక్స్ ఎవరు?

అమెరికా గూఢచారి సంస్థ- సీఐఏ-తో అతనికి ఎటువంటి సంబంధం లేదని కూడా తేల్చింది. కానీ నిపుణులు మాత్రం ఈ హత్య వెనుక ఏదో కుట్ర ఉందనే అంటున్నారు..


అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిపిన థామస్ క్రూక్స్ కి ఆ దేశ గూఢచారి సంస్థ సీఐఏతో ఏ సంబంధం లేదని తేల్చిన ఎఫ్.బి.ఐ... ఆయన ఇంట్లో 14 తుపాకులున్నట్టు మాత్రం తేల్చింది. పెన్సిల్వేనియా స్టేట్ బెతల్ పార్క్ పట్టణంలో క్రూక్స్ కుటుంబం ఉంటోంది. థామస్ క్రూక్స్ తండ్రి మాథ్యూ క్రూక్స్ కి తుపాకులు సేకరించే అలవాటుంది. ట్రంప్ పై కాల్పులకు తన కుమారుడు థామస్ ఉపయోగించిన ఏఆర్ స్టైల్ తుపాకీని తన 20 ఏళ్ల కొడుక్కి చట్టబద్ధంగానే అమ్మాడన్నారు ఎఫ్.బి.ఐ. డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే. "థామస్ ఉపయోగించిన వెపన్ ఏఆర్-స్టైల్ రైఫిల్ చట్టబద్ధంగా కొన్నదే. అతని తండ్రి నిబంధన ప్రకారమే తుపాకీని కొనుగోలు చేశారు. చట్టబద్ధంగానే తన కొడుక్కి అమ్మాడని నమ్ముతున్నాం" అని ఎఫ్.బి.ఐ. తేల్చిచెప్పింది.

పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ర్యాలీలో ట్రంప్ పై థామస్ కాల్పులు జరిపాడు. ట్రంప్ చెవికి గాయమైంది. అప్రమత్తమైన సీక్రెట్ సర్వీసు ఏజెంట్లు అతణ్ణి కాల్చివేశారు. ట్రంప్ ను థామస్ ఎందుకు హత్య చేయాలనుకున్నాడనే దానిపై ఎఫ్.బి.ఐ. ఆరా తీస్తోంది. ఎక్కడా ఎటువంటి కారణాలు కనిపించడం లేదు. ఒంటరిగానే ఆ పనిచేశాడని ఎఫ్.బీ.ఐ. చెప్పింది. అమెరికా గూఢచారి సంస్థ- సీఐఏ-తో అతనికి ఎటువంటి సంబంధం లేదని కూడా తేల్చింది. కానీ నిపుణులు మాత్రం ఈ హత్య వెనుక ఏదో కుట్ర ఉందనే అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎఫ్.బీ.ఐ. అధికారులు బెతల్ పార్క్ వెళ్లి ఆ ఇంటిని గాలించారు. చుట్టుపక్కల వారి నుంచి సమాచారాన్ని సేకరించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
నర్సింగ్ హోంలో సర్వర్ ఈ థామస్ క్రూక్...
వారం పది రోజులుగా వార్తల్లో వ్యక్తిగా ఉన్న- ఆ కుర్రాడు పిట్స్ బర్గ్ లోని ఓ నర్సింగ్ హోమ్ లో సర్వర్ గా ఉన్నాడు. కస్టమర్లకి భోజనం సర్వ్ చేయడంతో పాటు అంట్లు తోముతుంటాడు. గంటకు 16 డాలర్ల చొప్పున సంపాదన. పొలైట్ గా ఉంటాడు గాని ఏకాకితనం. ఒంటరిగా ఎవరితో మాటా ముచ్చట లేకుండా తనకు చెప్పిన పని చేస్కుంటూ పోతాడు. అవసరమైతే తప్ప మాట్లాడడు.
కాల్పులు జరపడానికి ఒక రోజు ముందు తన పైవాళ్ల దగ్గరికెళ్లి శనివారం సెలవు కావాలని, ఆదివారం తిరిగి వచ్చేస్తానని కోరాడు. ఆ మర్నాడు సీక్రెట్ సర్వీసెస్ పోలీసుల కాల్పుల్లో చనిపోతాడు. అతనెవరు, ఐడియాలజీ ఏమిటీ, ఉద్దేశాలేమిటనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. దర్యాప్తు అధికారులు అతనెవరో కనిపెట్టేందుకు కుస్తీపడుతున్నారు. ఊళ్లోని ఇంటింటికెళ్లి ఆరా తీస్తున్నారు. చుట్టుపక్కల వాళ్లను వాకబు చేస్తున్నారు. క్లాస్మేట్స్ ని, టీచర్స్ ని గుచ్చిగుచ్చి అడుగుతున్నారు. అయినప్పటికీ అతనేందుకు కాల్చాడో అర్థం కావడం లేదు. అతని మనసులో ఏముందో తెలియడం లేదు.

క్రూక్స్ చాలా వికారంగా, ఇబ్బందికరంగా ఉండేవారట. కాకపోతే తెలివైన వాడట. కంప్యూటర్ పరిజ్ఞానం ఎక్కువని తెలిసింది. రోజుల తరబడి వీడియో గేమ్స్ ఆడేవాడిని చెప్తున్నారు. నిలువుగా సాగినట్టుండే గడ్డం, కళ్లకు పెద్ద అద్దాలు, నున్నగా దువ్వినట్టుండే జుట్టుతో ఉండే ఈ శ్వేత జాతీయుడు ఏ ఆర్- 15 స్టైల్ రైఫిల్ ని ఉపయోగించి ట్రంప్ పై కాల్పు జరిపాడు.
బేతల్ పార్క్ అతని స్వస్థలం. ఇక్కడ ఎక్కువ ఉంది తెల్లవాళ్లే. సుమారు 32 వేలమంది జనాభా. ఎక్కవ మంది మధ్యతరగతి. క్రూక్స్ ఈ బెత్తల్ పార్క్ లోనే 2003లో పుట్టాడు. పాతకాలపు ఇంట్లో పుట్టి పెరిగిన క్రూక్స్ ది రాజకీయ చైతన్య కుటుంబమే. ప్రాథమిక విద్యాభ్యాసమంతా స్థానికంగానే సాగింది. బెతల్ పార్క్ హై స్కూల్ నుంచి 2022లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత అసోసియేట్ డిగ్రీ కూడా అక్కడి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి పొందాడు. 18 ఏళ్లు దాటిన తర్వాత చిత్రంగా రిపబ్లిక్ పార్టీ సభ్యునిగా రిజిస్టర్ చేసుకున్నాడు. 2021 జనవరిలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రమాణ స్వీకారం రోజున ఒక ప్రగతి శీల కార్యక్రమానికి 15 డాలర్ల విరాళం పంపినట్టు రికార్డులు చూపుతున్నాయి. ఆయన తల్లి డెమొక్రాటిక్. తండ్రీ, వాళ్ళ అక్క మాత్రం లిబరిటేరియన్లు. వ్యక్తిగత స్వేచ్ఛావాదాన్ని కోరే ఉదారవాదులు.
టెన్షన్లు ఎందుకు పెరిగాయంటే...

ట్రంప్ హయాంలో బెతల్ పార్కులో స్థానికుల మధ్య టెన్షన్లు పెరిగాయి. బైడెన్, ట్రంప్ పోటీ పడినప్పుడు స్థానికంగా డెమొక్రటిక్ పార్టీకి 65 ఓట్లు ఎక్కువ వచ్చాయి. దీంతో దేశంలోని అన్ని చోట్ల మాదిరే బెతల్ పార్క్ లో కూడా గొడవలు జరిగాయి. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు రాబోతున్న సమయంలో కొన్ని ఇళ్లపై ట్రంప్ జెండాలు ఎగురుతున్నాయి. చాలా కాలం కిందట రిపబ్లిక్ పార్టీ అనుచరులుగా ఉన్న వాళ్లు మళ్లీ ఏకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. టౌన్ లో అక్కడక్కడ ర్యాలీలు జరుగుతున్నాయి. ట్రంప్ నినాదం- మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్- అని రాసున్న బోర్డులు వెలుస్తున్నాయి. ఎవరూ బయటపడకపోయినా కనిపించని ఉద్రిక్త పరిస్థితులైతే నెలకొంటున్నాయి. అమెరికన్ సాంప్రదాయ పండుగ- హాలోవియన్- నాడు స్థానికుడొకరు తన ఇంటి ముందు పెట్టిన దిష్టి బొమ్మే ఇందుకు నిదర్శనం. తుపాకీ పట్టుకున్న ఓ అస్థిపంజరం బైడెన్ టీ షర్టు వేసుకున్న మరో అస్థిపంజరంపై తుపాకీతో గురిపెట్టినట్టుండే ఓ బొమ్మను పెట్టాడు. అయితే క్రూక్స్ తల్లిదండ్రులు ఇటువంటి బొమ్మలేమీ పెట్టలేదు గాని ఎన్నికల సమయం వచ్చేనాటికి ఇలాంటివి మరిన్ని వచ్చే అవకాశం లేకపోలేదు.
కుటుంబ నేపథ్యం ఇలా...
నిజానికి క్రూక్స్ తల్లిదండ్రులు ఎప్పుడో గాని కన్పించరు. ఇద్దరూ ఉద్యోగులే. ప్రొఫెషనల్ కౌన్సిలర్లు. కరోనా తర్వాత వాళ్లు ఇంటి నుంచే పని చేస్తున్నారు. క్రూక్స్ తండ్రి కమ్యూనిటీ కేర్ బిహేవియర్ హెల్త్ లో పనిచేస్తున్నారు. పీటర్స్ మెడికల్ సెంటర్ కీ ఇన్సూరెన్స్ సేవలను అందిస్తుంటారు. క్రూక్స్ తల్లికి కళ్లు సరిగా కనపడవు. దివ్యాంగులు వాడే కర్ర సాయంతో నడుస్తుంటారు. ఎఫ్ బి ఐ అధికారుల చెప్పిన దాని ప్రకారం ఆ ఇల్లు పాతపడి ఉంది. ఊడ్చే దిక్కూ లేకున్నట్టుంది. చుట్టుపక్కల వాళ్లు చెప్పిన దాని ప్రకారం 'క్రూక్స్ చిన్నప్పటి నుంచీ ఒంటరిగానే ఉండేవాడు. ఇతర పిల్లలతో చెట్టపట్టాలేసుకుని తిరిగేవాడేమీ కాదు. మహాఅయితే వాళ్ళ ఇంటి పెరట్లోనే ఆడుకునే వాడు లేదా తన పని చూసుకునేందుకు బయటకు వెళ్లేవాడు'. పోలో బ్రాండ్ చొక్కాలు వేసుకునేవాడు. లెక్కలు బాగానే చేసేవాడు. ఇక, క్రూక్స్ తల్లిదండ్రులు కూడా ఎప్పుడైనా బయటికి వచ్చేవారు. ఎవరైనా హలో అంటే హలో అంటే హలో అనే వాళ్లు. ఆ కుటుంబంతో తానెప్పుడూ మాట్లాడలేదని ఆ ఇంటి పక్కనే ఉంటున్న 38 ఏళ్ల కెళ్ళి లిటిల్ చెప్పడమే ఇందుకు రుజువు.
తుపాకులంటే మోజుందని తెలియదు...
"క్రూక్స్ ఎవరితోనైనా మాట్లాడుతుండగా ఎప్పుడూ చూడలేదు. ఎందుకో ఎప్పుడూ టెన్షన్ గా ఉండేవాడు. అతనికి తుపాకులంటే మోజుందన్న సంగతి అసలు తెలియదని" ఇంటి పక్కనే ఉంటున్న ఇంకొకరు చెప్పారు. నిజానికి ఆయన తండ్రికి డజనుకు పైగా తుపాకులు ఉన్నాయి. వాటిల్లో సెమీ ఆటోమేటిక్ రీఫిల్ కూడా ఉంది. అయినప్పటికీ వాటి పట్ల ఆసక్తి ఉన్నట్టు కనిపించలేదు. బెత్తెలు పార్క్ హై స్కూల్లో 2018 నుంచి 2020 వరకు రైఫిల్ టీం సభ్యులుగా ఉన్న ఆంటోని చెప్పిన దాని ప్రకారం క్రూక్స్ ఒకసారి ఈ టీంలో సభ్యుడు కావాలనుకున్నాడు గాని కాలేకపోయాడు. క్రూక్స్ మంచి షూటరేమీ కాదు, అటువంటి వ్యక్తి ట్రంప్ పై కాల్పులు జరిపాడంటే విచిత్రంగానే ఉంది అన్నాడు ఆంటోనీ. తమకు తెలియకుండా ప్రైవేట్ గా ఎక్కడైనా శిక్షణ పొందాడేమో తెలియదని ముగించాడు.
ఆ టీ షర్ట్ మర్మమేమిటో...
ఎఫ్.బి.ఐ. వివరాల ప్రకారం ట్రంప్ పై కాల్పులు జరిపిన రోజు థామస్ క్రూక్ టీ షర్టు వేసుకున్నాడు. అది డెమోలేషన్ బ్రాండ్. గన్ మెన్లకు సంబంధించిన ఓ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వాడే టీ షర్ట్ అది. సహజంగా అటువంటి టీ షర్ట్ ను ఈ గన్ టీం వాళ్ళు మాత్రమే వేసుకుంటారు. ఈ 20 ఏళ్ల కుర్రోడు కాల్పులు జరిపాడని టీవీలో చూసేంత వరకు తెలియలేదని క్రూక్స్ కు కౌన్సిలర్ గా ఉన్న జిమ్ ల్యాప్ చెప్పాడు. "ఎప్పుడైనా నా పక్కన కూర్చొని భోజనం చేసేవాడు. ఆ టైంలోనూ మౌనంగా ఉండేవాడు. భోజనం అయిపోయిన తర్వాత ఫోన్ చూసుకునేవాడు. స్కూల్లోనూ అతనిపై ఎటువంటి క్రమశిక్షణ చర్య తీసుకున్న దాఖలాలు లేవు. స్కూల్ రికార్డూ క్లీన్ గానే ఉంది. డిసిప్లినరీ ప్రాబ్లమ్స్ లేవు. అయితే ఓసారి ఎనిమిదో తరగతిలో బబుల్ గమ్ నములుతూ కన్పించినప్పుడు డిటైన్ చేశారు. అందరికంటే ఎక్కువ సార్లు క్లాస్ కి హాజరైన రికార్డూ ఉంది. టీచర్లు అడిగే విషయాలను బాగానే చెప్పేవాడు. నేర్చుకోవాలనే ఆసక్తి ఉండేది. వాళ్ళ అక్క గురించి ఒకసారి మాట్లాడటానికి తల్లిదండ్రులు పిలిపించినప్పుడు మాత్రమే క్రూక్స్ కి ఓ అక్క ఉందన్న సంగతి తెలిసింది. అంతే. కానీ ఆ కుటుంబం ఎందుకు బిక్కు బిక్కు ఉంటూ ఉంటుందో, ఎక్కడో దెబ్బతిన్నారో తెలియడం లేదు" అన్నారు ల్యాప్.
ఎక్కడ చూసినా ఒంటరిగానే...
స్కూల్లోనే కాదు మరేదైనా స్టడీ టూర్ కి తీసుకువెళ్లినపుడు కూడా క్రూక్స్ ఒంటరిగానే ఉండేవాడు. తోటి విద్యార్థులతో ఒక ఒక గ్రూపుగా ఉండేందుకు పెద్దగా ఇష్టపడే వాడు కాదు. ఎవరైనా జోక్స్ వేస్తే పెద్దగా నవ్వే వాడట. గట్టిగా చదవాలనుకున్నప్పుడల్లా సీరియస్ గానే ప్రయత్నించేవారని, అయితే పెద్దగా ఫలితమేమీ ఉండేది కాదు. అత్తెసరు మార్కులతోనే సరిపెట్టుకునే వాడు. క్రూక్స్ ఇంట్రెస్ట్ లు కూడా చాలా వైవిధ్యంగానే ఉండేవట. కంప్యూటర్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, హిస్టరీ, ఎకనామిక్స్ చదవాలనుకున్నాడట. తోటి విద్యార్థులతో కలిసి కంప్యూటర్ గేమ్స్ ఆడినా అంటీముట్టనట్టే ఉండేవాడు. రాజకీయాలపై పెద్దగా ఆసక్తి గాని గొప్ప అభిప్రాయం ఉన్నట్టు గాని ఎన్నడూ కనిపించలేదు.
యావరేజ్ విద్యార్థే...
క్రూక్స్ పెద్ద తెలివైన వాడేమీ కాదు. యావరేజ్ గ్రేడ్ పాయింట్లతోనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. క్లాసులో మొత్తం 300 మంది విద్యార్థులు ఉంటే అందులో తనొకడు. గ్రాడ్యుయేషన్ పూర్తయినప్పుడు తోటి విద్యార్థులందరూ బాగా సందడి చేసినా ఇతను మాత్రం తన పట్టా తీసుకుని మెదలకుండా దిగిపోయాడే తప్ప కనీస స్పందన కూడా లేకపోయిందట. ఉన్నత చదువు కోసం యూనివర్సిటీలో పేరు నమోదు చేసుకున్నాడే తప్ప తరగతులకు వెళ్లినట్టు కనపడలేదు.
ట్రంప్ పై కాల్పులు జరపడానికి వారం రోజుల ముందు నుంచీ కంప్యూటర్ లో జాన్ ఎఫ్ కెన్నడీ హత్య చేసిన తీరును చాలాసార్లు చూశాడు. ట్రంప్, బైడెన్ ఫోటోలను డౌన్లోడ్ చేశారు. వీటన్నింట్లో కెన్నడీ హత్యను మాత్రమే వేరే భవనం నుంచి కాల్చివేశారు. ఎఫ్.బి.ఐ కథనం ప్రకారం ఈ 20 ఏళ్ల కుర్రాడైన థామస్ క్రూక్స్ కి ఏ రాజకీయ పార్టీతోనూ, సిద్ధాంతంతోనూ సంబంధం లేదు. కేవలం సెన్సేషన్ కోసమే కాల్పులు జరిపాడా లేక మరేదైనా కుట్ర ఉందా అనేది తేల్చాల్సి ఉంది.


Read More
Next Story