డీలిమిటేషన్ బిల్లును బీజేపీ మళ్లీ తీసుకురాబోతుందా?
x

డీలిమిటేషన్ బిల్లును బీజేపీ మళ్లీ తీసుకురాబోతుందా?

ఉద్యమాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ఈ ఎత్తు అంటున్న విశ్లేషకులు


దేశంలో ఇప్పుడు నిరంతరం నిరసనలు జరుగుతున్న సందర్భంలోనే మరోసారి డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ బిల్లును మరోసారి ముందుకు తీసుకెళ్లడానికి కేంద్రం ప్రత్యేక సమావేశాలు నిర్వహించవచ్చు.

ఈ బిల్లుపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ధృవీకరణ రానప్పటికీ దసరా తరువాత మూడు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించవచ్చని పలు వర్గాలు చెబుతున్నాయి. ఆగష్టు 13న నిరవధిక వాయిదా పడకుండా ఉన్న వర్షాకాల సమావేశాలు అలాగే ఉన్నాయి.

దీనితో రాష్ట్రపతి నుంచి అనుమతి లేకుండానే ఉభయ సభల అదనపు సమావేశాలను నిర్వహించే అవకాశం ఉంది. వర్షాకాల సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసిన 64 రోజుల తరువాత కూడా పార్లమెంట్ ను వాయిదా వేయకపోవడం ఒక అపూర్వ స్థితిని సృష్టించిందని పేర్కొన్నారు. రాజ్యాంగ 131 వ సవరణ బిల్లు, డీలిమిటేషన్ బిల్లును ఆమోదించడానికి కేంద్రం గతంలో చేసిన ప్రయత్నం ఏప్రిల్ 17న నిర్ణయాత్మకంగా ఓడిపోయిందని ఆయన గుర్తు చేసుకున్నారు.

అఖిలపక్షం సమావేశాలు..

కేంద్రం నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనలపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు డిమాండ్ చేస్తున్నారు. ఆయన జూల 16, ఆగష్టు 27న మోదీకి లేఖలు రాశారు.
ఏప్రిల్ 11న మొదటిసారిగా తన అభ్యర్థనను పునరుద్ఘాటించానని, ఇది తన నాలుగవ అభ్యర్థన అని ఖర్గే పేర్కొన్నారు. ‘‘పార్లమెంట్ పరిశీలన కోసం మీ ప్రతిపాదనలను ఖరారు చేసే ముందు వాటిపై కూలంకషంగా చర్చించడానికి దయచేసి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి... గతంలో మీరు ప్రయత్నించినట్లుగా, సుదీర్ఘ ప్రభావం చూపే ఒక రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్ లో బలవంతంగా ఆమోదింపజేయడానికి మరోసారి ప్రయత్నించవద్దు. దానివల్ల దానికి తగిన గతే ఎదురైంది’’ అని లేఖలో పేర్కొన్నారు.
అయితే ఖర్గే సూచనలు అమలు కావని, నియోజక వర్గాల పునర్విభజన, సీట్ల పెంపుకు సూత్రం ఏమిటీ? ఏ జనాభా గణనను ప్రాతిపదికగా తీసుకోవాలి వంటి ఇతర అంశాలపై పార్లమెంట్ లోనే చర్చ జరుగుతుందని ఒక సీనియర్ క్యాబినేట్ మంత్రి ‘ది ఫెడరల్’ కు చెప్పారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ చర్చకు ఉందని, ఇప్పుడు కూడా అలాగే ఉన్నామని చెప్పారు.
‘‘నియోజక వర్గాల పునర్విభజనకు తాము మద్దతు ఇవ్వమని, లోక్ సభ సీట్లను పెంచడాన్ని కూడా కోరుకోవడం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. బిల్లులకు మద్దతు ఇవ్వబోమని చెప్పడానికి హాజరయ్యే పక్షంలో అఖిల పక్షం సమావేశాన్ని ఎందుకు కోరుతోంది?’’

చర్చలు కొనసాగుతాయి...

వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడినప్పటి నుంచి ప్రభుత్వం ఇతర పక్షాలతో ఏవైనా కొత్త చర్చలు ప్రారంభించిందా అని, రాజ్యాంగ సవరణను ఆమోదించడానికి మూడింటి రెండు వంతుల మెజారిటీని సాధిస్తుందనే నమ్మకం ఉందా అని అడగ్గా..‘‘చర్చలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ప్రతిపక్షంలో హేతుబద్దంగా ఆలోచించే ఇతర పార్టీలు ఉన్నాయి. వారి నాయకులు గతంలో కూడా చర్చలు జరిపారు. బిల్లులను ప్రవేశపెట్టినప్పుడూ మీరు సంఖ్యాబలాన్ని చూస్తారు’’ అని మంత్రి అన్నారు.
ఒకవేళ కేంద్రం తన సొంత బిల్లులతో ముందుకు వెళితే, ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ(సర్) సమయంలో ఓటర్ల హక్కును రద్దు చేయడానికి వ్యతిరేకంగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేశ్ కుమార్ రాజీనామాపై డిమాండ్ కొనసాగుతున్న ఆందోళనను దారిమళ్లించడానికి బీజేపీకి ఒక అవకాశం లభిస్తుంది.

మూడింట రెండువంతుల మెజారిటీ..

ఇప్పటికే అమల్లో ఉన్న మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలులోకి తీసుకురావడానికి నాందిగా లోక్ సభ సభ్యుల సంఖ్యను 850కి పెంచే బిల్లును అలాగే దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను బలవంతంగా ఆమోదింపజేయడానికి కేంద్రం గతంలో చేసిన ప్రయత్నం ఏప్రిల్ లో విఫలమైంది. రాజ్యాంగాన్ని సవరించడానికి అవసరమైన మూడింట రెండువంతుల మెజారిటీని ప్రభుత్వం కూడగట్టలేకపోవడంతో ఈ ప్రయత్నం విఫలం అయింది.
జూలైలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కోసం తిరిగి సమావేశమైనప్పుడు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న బిల్లులను కొన్ని మార్పులతో లోక్ సభలో ప్రవేశపెడతారని తెలిసింది. అంతకుముందు రెండు నెలల్లో లోక్ సభ, రాజ్యసభ రెండింటిలోనూ బీజేపీ దాని ఎన్డీఏ కూటమి తమ శాసనసభ్యుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదలను చూసింది.
మే నెలలో లోక్ సభలో ఐక్య ప్రతిపక్షం చేతిలో రాజ్యాంగ బిల్లు ఓడిపోయిన కొన్ని వారాల తరువాత ఆప్ కు చెందిన పదిమంది రాజ్యసభ ఎంపీలలో ఏడుగురు బీజేపీలోకి ఫిరాయించారు. అలాగే టీఎంసీకి చెందిన 20 మంది కూడా వేరే పార్టీలోకి వెళ్లారు. వీరు కూడా ఎన్డీఏకు మద్దతు తెలిపారు. యూబీటీకి చెందిన ఆరుగురు ఎంపీలు కూడా శివసేనలోకి ఫిరాయించారు.
జూలై 20న వర్షాకాల సమావేశాల మొదటి రోజు పార్లమెంట్ సమావేశమైనప్పుడూ, భారీ ఫిరాయింపుల కారణంగా లోక్ సభలో ఎన్డీఏ బలం 320 కి పెరిగింది. 131వ సవరణ బిల్లుకు అవసరమైన 362 ఓట్లకు గాను, అధికార కూటమి 298 ఓట్లను మాత్రమే సాధించింది.
ఎన్డీఏకు మూడింట రెండువంతుల మెజారిటీ దక్కాలంటే ఇంకా 40 మంది ఎంపీల మద్దతు అవసరం. ప్రస్తుతం ఇండి కూటమితో విభేదించి బయటకు వచ్చిన డీఎంకే కు చెందిన 22 మంది ఎంపీలు కూడా ఈ బిల్లుకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని సీనియర్ బీజేపీ నాయకులు నమ్మకంతో ఉన్నారు.

కాక్రోచ్ నిరసనలు...

జూలై 20న బొద్దింక జనతా పార్టీ నేతృత్వంలో జరిగిన యువజన ఆందోళన, నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు జరిపిన క్రూరమైన అణచివేత ఒక రాజకీయ తుఫాన్ ను రేకెత్తించాయి. అది వర్షాకాల సమావేశాలను పట్టాలు తప్పించి, దానితో పాటు పార్లమెంట్ లో రెండు బిల్లులను బలవంతంగా ఆమోదింపజేయాలన్న కేంద్రం ప్రణాళికను కూడా దెబ్బతీసింది.
జూలై, ఆగష్టు నాటి పరిస్థితులంతే అస్థిరంగా ఉన్న తరుణంలో ఈ నెల చివరలో బిల్లులను పార్లమెంట్ కు తీసుకురావడానికి కేంద్రం మళ్లీ ప్రయత్నిస్తోంది. పరీక్ష పత్రాల లీకేజీ సమస్యపై ఆందోళన చేస్తున్న యువతపై పోలీసులు దాడి చేశారని ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రస్తుతం సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన చేస్తున్నారు.
ఎస్ఐఆర్ పై కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొంటున్నారని ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ప్రచురించింది. ఎస్ఎస్ సందు, వివేక్ జోషి వాటిని వ్యతిరేకించినట్లు కూడా తెలిపింది. ఈ కథనంతో దేశ రాజధానిలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఎస్ఐఆర్ ద్వారా ఓటు కోల్పోయిన 13 కోట్ల మందిని తిరిగి ఎన్నికల జాబితాలో చేర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనలపై ప్రభుత్వం వెనకడుగు వేసినట్లు స్పష్టమైంది.

సర్ ఆందోళనతో...

ఈ నేపథ్యంలో పార్లమెంట్ లో ఆ రెండు బిల్లులను బలవంతంగా ఆమోదింపజేసుకోవడానికి కేంద్రం మళ్లీ ప్రయత్నిస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. పార్లమెంట్ ఉభయ సభలలో ఎన్డీఏ సంయుక్త సీట్ల సంఖ్యపరంగా ఆ పార్టీకి అనుకూలంగా గానీ, ప్రతికూలంగా కానీ సంఖ్యాపరంగా పెద్దగా మార్పులేమీ జరగలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
‘‘వర్షాకాల సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై డీఎంకే, మరికొన్ని ప్రతిపక్షాల పార్టీలతో చర్చలు బాగా సాగాయి. పరిస్థితిలో పెద్దగా మార్పురాలేదు.ఉప ఎన్నికలలో బీజేపీ గెలిచింది. సరైన చర్చ లేకుండా ఇంత ముఖ్యమైన చట్టాన్ని ముందుకు తీసుకెళ్లడం మాకు ఇష్టం లేదు’’ అని ఒక సీనియర్ బీజేపీ ఎంపీ అన్నారు.
గతంలో కొన్ని ప్రతిపక్ష పార్టీలతో తెరవెనక చర్చలలో పాల్గొన్న మరో కేంద్రమంత్రి, ఈ బిల్లుల కోసం చేస్తున్న కొత్త ప్రయత్నం, కొనసాగుతున్న ఎస్ఐఆర్ వ్యతిరేక నిరసనల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఐక్యంగా ఉన్న ప్రతిపక్షంలో చీలిక సృష్టించడానికి ఉద్దేశించినదన్న సూచనలను ఊహించిన విధంగానే తోసిపుచ్చారు.

ఫార్మూలాను సమర్థించింది..

‘‘మేము చేసే ప్రతి పనిలో కాంగ్రెస్ కుట్రను చూస్తుంది. మా ఆందోళన పూర్తిగా రాజ్యాంగబద్దమైనది’’ అని కేంద్రమంత్రి అన్నారు. ‘‘నియోజక వర్గాల పునర్విభజనపై ఉన్న నిలుపుదల ఈ ఏడాదితో ముగుస్తుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో కొత్త జనాభా లెక్కలు సిద్దమవుతాయి. మనం ఇప్పుడు పునర్విభజన సూత్రాన్ని మార్చకపోతే ఈ ఏడాది కొత్త జనాభా లెక్కల గణాంకాలు వచ్చిన వెంటనే రాజ్యాంగం ప్రకారం పునర్విభజన సూత్రం అమల్లోకి వస్తుంది. అంటే 2027 జనాభా లెక్కల ఆధారంగానే కొత్త నియోజకవర్గాలను విభజించాల్సి ఉంటుంది’’ అని ఆయన అన్నారు.
‘‘డీఎంకే వంటి ఇతర పార్టీలు ఈ విభజనను వ్యతిరేకిస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనకు జనభా మాత్రమే ప్రాతిపదికగా తీసుకోకకూడదని వారి వాదన. అందుకే ప్రతి రాష్ట్రానికి ఏకరీతిగా 50 శాతం సీట్లు పెంచాలని అమిత్ షా ప్రతిపాదించారు. ఇది న్యాయమైన పరిష్కారం.
అయితే కాంగ్రెస్, దాని మిత్రులు కేంద్రం నియోజకవర్గాల పునర్విభజన కోసం ఒత్తిడి చేస్తోందని గట్టిగా నమ్ముతున్నాయి. ఎందుకంటే దీనివల్ల దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం ఏర్పడుతుంది. దీనిని బీజేపీ, కుమార్ నేతృత్వంలోని ఎన్నికల సంఘం ద్వారా కాషాయ పార్టీకి ఎన్నికల పరంగా ప్రయోజనకరంగా ఉండేలా ప్రస్తుత నియోజకవర్గాలను తిరిగి గీయడానికి ఒక ఆయుధంగా వాడుకోవచ్చు.


Read More
Next Story