వైసీపీ ఎమ్మెల్సీ అనంత కి లీకు, సర్పవరం సీఐపై వేటు!
x

వైసీపీ ఎమ్మెల్సీ అనంత కి 'లీకు', సర్పవరం సీఐపై వేటు!

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సహకరిస్తున్నారని సర్పవరం ఇన్ఛార్జ్ సీఐ రవికుమార్‌పై వేటు పడింది.


పోలీస్ శాఖలో క్రమశిక్షణ ఉల్లంఘించినా, నిందితులకు కొమ్ముకాసినా ఉపేక్షించేది లేదని ఉన్నతాధికారులు మరోసారి స్పష్టం చేశారు. సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో సర్పవరం ఇన్ఛార్జ్ సీఐ రవికుమార్‌పై వేటు పడింది.

అసలేం జరిగింది?

దళిత యువకుడు, మాజీ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు ఏ-1 నిందితుడు. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని సీఐ రవికుమార్ నిందితుడికి చేరవేస్తున్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది.
పోలీసుల వ్యూహాలు, దర్యాప్తులో బయటపడుతున్న సాక్ష్యాలు, తదుపరి చర్యల గురించి ఎమ్మెల్సీకి ముందస్తు సమాచారం అందుతోందని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.
ఈ ఆరోపణలపై ప్రాథమిక విచారణ జరిపిన అనంతరం, ఏలూరు రేంజ్ ఐజీ కఠిన నిర్ణయం తీసుకున్నారు. సీఐ రవికుమార్‌ను తక్షణమే విధుల నుంచి తప్పించి, వీఆర్‌ కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో తన వద్ద డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి, దానిని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. బాధితుడి మృతదేహాన్ని ఎమ్మెల్సీ స్వయంగా తన కారులో తీసుకురావడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఈ కేసులో పోలీసుల తీరుపై మొదటి నుంచి దళిత సంఘాలు, ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
తాజా చర్యతో పోలీసు శాఖలో చర్చ మొదలైంది. నిందితులు ఎంతటి వారైనా, వారికి శాఖలోని వ్యక్తులు సహకరిస్తే సహించేది లేదని ఉన్నతాధికారులు గట్టి సందేశాన్ని పంపారు.
Read More
Next Story