
ఏఐ జనరేటెడ్ చిత్రం
పోన్ పే ఇక ఉచితం కాదు, 2,000 దాటితే UPIకి చార్జీ?
చిన్న లావాదేవీలకు నో ఛార్జ్.. పెద్ద చెల్లింపులపై MDRకు మార్గం సుగమం
డిజిటల్ చెల్లింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు UPI లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేకుండా కొనసాగుతున్న విధానంలో మార్పులకు ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. అయితే సామాన్య వినియోగదారులపై వెంటనే UPI ఛార్జీలు పడవు. ముందుగా వ్యాపారుల నుంచి వసూలు చేస్తారు.
2007 నాటి Payment and Settlement Systems Actలోని సెక్షన్ 10A కింద కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం రూ.2,000 వరకు జరిగే UPI లావాదేవీలు, అలాగే RuPay ఆధారిత డెబిట్ కార్డు చెల్లింపులపై బ్యాంకులు లేదా పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి ఛార్జీ విధించకూడదు.
అయితే ఈ నోటిఫికేషన్లో రూ.2,000 వరకు లావాదేవీలను మాత్రమే ఛార్జీల నుంచి మినహాయించారు. రూ.2,000కు మించిన UPI లావాదేవీలపై భవిష్యత్తులో Merchant Discount Rate (MDR) విధించేందుకు మార్గం సుగమం అయింది. రూ.2,000 దాటిన ప్రతి లావాదేవీపై తప్పనిసరిగా ఛార్జీ పడుతుందని ప్రభుత్వం ప్రకటించలేదు. ఛార్జీ విధించాలా? ఎంత విధించాలి? ఎవరిపై విధించాలి? అనే అంశాలపై ఇంకా తుది నిర్ణయం రావాల్సి ఉంది.
MDR అంటే ఏమిటి?
UPI ద్వారా ఒక వ్యాపారి చెల్లింపును స్వీకరించినప్పుడు, ఆ లావాదేవీని నిర్వహించే బ్యాంకులు, పేమెంట్ యాప్స్, ఇతర సేవల సంస్థలకు అయ్యే ఖర్చును భర్తీ చేసేందుకు వసూలు చేసే రుసుమే Merchant Discount Rate (MDR).
2020 జనవరి నుంచి సాధారణ UPI Person-to-Merchant లావాదేవీలపై MDR తొలగించారు. దీంతో UPI వినియోగదారులకు మాత్రమే కాకుండా వ్యాపారులకు కూడా ఈ చెల్లింపు విధానం అత్యంత చౌకగా మారింది.
అయితే UPI లావాదేవీలు భారీగా పెరిగిన నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ, మోసాల నివారణ, సాంకేతిక మౌలిక వసతులు, వ్యవస్థ నిర్వహణకు భారీగా ఖర్చవుతోందని ప్రభుత్వం చెబుతోంది. అందుకే UPI వ్యవస్థ దీర్ఘకాలికంగా నిలదొక్కుకునేలా ఎంపిక చేసిన అధిక విలువ గల వ్యాపార లావాదేవీలపై పరిమిత MDR విధించే అవకాశం గురించి కేంద్రం గతంలోనే స్పష్టం చేసింది.
సామాన్యుడిపై భారం పడుతుందా?
ప్రస్తుతానికి ఇద్దరు మనుషుల మధ్య (వ్యక్తి నుంచి వ్యక్తికి) జరిగే UPI బదిలీలు ఉచితంగానే కొనసాగుతాయి. సాధారణ వినియోగదారుడు రోజువారీగా చేసే చిన్న మొత్తాల చెల్లింపులపైనా ఛార్జీ ఉండదు. ప్రభుత్వం కూడా వినియోగదారుల నుంచి నేరుగా ట్రాన్సాక్షన్ ఫీజు వసూలు చేయబోమని స్పష్టం చేసింది. కానీ వ్యాపారుల నుంచి వసూలు చేస్తామని చెబుతోంది.
అయితే పెద్ద మొత్తాల్లో వ్యాపారులకు చేసే UPI చెల్లింపులపై భవిష్యత్తులో MDR విధించే అవకాశం ఉంది. ఆ రుసుమును వ్యాపారి భరిస్తాడా? లేక వస్తువులు, సేవల ధరల రూపంలో చివరకు వినియోగదారుడిపై ప్రభావం పడుతుందా? అనేది అమలు విధానం నిర్ణయించిన తర్వాతే స్పష్టమవుతుంది.
వ్యాపారి పై పన్ను వేయడమంటే పరోక్షంగా వినియోగదారునిపై వేయడమే కదా అని కస్టమర్లు ప్రశ్నిస్తున్నారు.
ఎందుకీ మార్పు?
UPI దేశంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే డిజిటల్ చెల్లింపు వ్యవస్థగా మారింది. 2026 జూలైలోనే UPI ద్వారా 2,366 కోట్ల లావాదేవీలు జరిగాయని, వాటి మొత్తం విలువ రూ.29.9 లక్షల కోట్లుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇంత భారీ స్థాయిలో పెరిగిన వ్యవస్థకు సైబర్ భద్రత, మోసాల నియంత్రణ, సాంకేతిక మౌలిక వసతుల నిర్వహణకు నిరంతర పెట్టుబడులు అవసరమవుతున్నాయని ప్రభుత్వం పేర్కొంది.
అందుకే UPIని పూర్తిగా ఛార్జీలకు గురిచేయకుండా.. చిన్న మొత్తాల చెల్లింపులను ఉచితంగా కొనసాగిస్తూ, అధిక విలువ కలిగిన ఎంపిక చేసిన వ్యాపార లావాదేవీల నుంచి ఆదాయం సమకూర్చే విధానం వైపు ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.
తుది నిర్ణయం ఎవరిది?
రూ.2,000కు మించిన UPI లావాదేవీలపై MDR విధించాలా? ఎంత శాతం విధించాలి? ఏ రకమైన వ్యాపార లావాదేవీలకు వర్తింపజేయాలి? అనే అంశాలపై NPCI నేతృత్వంలోని UPI and Services Steering Committee తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అంటే.. UPIకి ఇప్పుడే ఛార్జీలు ప్రారంభం కాలేదు. కానీ రూ.2,000కు మించిన లావాదేవీలపై భవిష్యత్తులో MDR విధించేందుకు చట్టపరమైన మార్గం మాత్రం స్పష్టమైంది.
Next Story

