కలెక్టర్ ను డిప్యూటీ స్పీకర్ రఘురామ అవమానించడం సమంజసమా?
x

కలెక్టర్ ను డిప్యూటీ స్పీకర్ రఘురామ అవమానించడం సమంజసమా?

డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామ కృష్ణ రాజు వ్యాఖ్యలు ఖండించిన ఏపీ జేఏసీ అమరావతి.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న కనుమూరు రఘురామ కృష్ణ రాజు బాపట్ల జిల్లా కలెక్టర్‌ను బహిరంగంగా కించపరిచే విధంగా, ఏకవచనంలో సంబోధించి, కులాల ప్రస్తావన తీసుకొచ్చి వ్యంగ్యంగా మాట్లాడటాన్ని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటి తీవ్రంగా ఖండించింది. షెడ్యూల్ క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు విషయంపై రఘురామకృష్ణ రాజు ఈ వ్యాఖ్యలు చేశారు.

27.04.2026 మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ చేసిన వ్యాఖ్యలు అధికారుల పరువును దెబ్బతీసేలా ఉన్నాయని, ఇలాంటి ప్రవర్తన రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తికి తగినది కాదని ఏపీ జేఏసీ నాయకులు తీవ్రంగా విమర్శించారు.

ఏపీ జేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదర రావు, అసోసియేట్ చైర్మన్ టీవీ ఫణి పేర్రాజు, కోశాధికారి తిమ్మసర్తి నాగేశ్వర రావు లు ఒక సంయుక్త ప్రకటన ద్వారా ఖండించారు.

ఏపీ అమరావతి జేఏసీ ప్రకటన

“భాద్యత గల డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్న కనుమూరు రఘురామ కృష్ణ రాజు బాపట్ల జిల్లా కలక్టర్ గారిని కించపరిచేలా, అవమానించేలా, వ్యంగంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నాము.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో గౌరవ డిప్యూటీ స్పీకర్‌గా ఒక భాద్యత గల, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న కనుమూరు రఘురామ కృష్ణ రాజు 27.04.2026 న మీడియా తో మాట్లాడుతూ.... షెడ్యూల్ క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు విషయమై బాధ్యత గల ఒక కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ బాపట్ల గారిని కించపరిచేలా ఏకవచనంతో సంబోధిస్తూ, కులాల ప్రస్తావన తెస్తూ వ్యంగ్యంగా మాట్లాడడం భావ్యం కాదని, నిజంగా బాపట్ల జిల్లా కలెక్టర్ గారు తప్పు చేసారని గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు భావించి ఉంటే ఆయనపై నేరుగా ప్రభుత్వానికి పిర్యాదు చేసి, చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చన్నారు.

జిల్లా కలెక్టర్ అంటే జిల్లాలో ప్రజలకు ప్రభుత్వ ప్రతినిధిగా ఒక నమ్మకం ఉంటుంది.... అలాంటి జిల్లా కలెక్టర్ గారిని ప్రజల్లో చులకన చేసేలా కనుమూరు రఘురామ కృష్ణ రాజు గారు మాట్లాడడం చాలా భాదాకరమని, అధికారులను ఇలా బహిరంగంగా అవమానించేలా, కించపరిచేలా ఉన్న వారి వ్యాఖ్యలను ఏపి జేఏసి అమరావతి రాష్ట్ర కమిటి తరుపున ఖండిస్తున్నామని ఏపి జేఏసి అమరావతి నాయకులు మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

రాజకీయ వర్గాల్లో చర్చ

డిప్యూటీ స్పీకర్‌గా శాసనసభ సమావేశాలను నిర్వహించే అధికారం ఉన్నప్పటికీ, బాపట్ల జిల్లా కలెక్టర్‌ డాక్టర్ వి. వినోద్ కుమార్ ను పిలిపించుకుని మాట్లాడే అధికారం ఉన్నప్పటికీ, బహిరంగ మీడియా ముందు ఏకవచన సంబోధన, కులాల ప్రస్తావనతో వ్యంగ్యం చేయడం సమంజసమేనా? అన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

ప్రభుత్వ యంత్రాంగంలో కలెక్టర్ జిల్లా స్థాయిలో ప్రజలకు ప్రభుత్వ ప్రతినిధి. అలాంటి అధికారిని బహిరంగంగా అవమానించడం వల్ల పాలనా యంత్రాంగంపైనే ప్రజల్లో తప్పుడు సందేహాలు ఏర్పడే అవకాశం ఉందని ఏపీ జేఏసీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ కలెక్టర్ తప్పు చేసి ఉంటే సరైన ప్రక్రియలో చర్యలు తీసుకోవాలి కానీ, పదవి గర్వంతో బహిరంగ అవమానం సరైన పద్ధతి కాదని వారి వాదన.

ఈ సంఘటనపై రాజకీయ పార్టీలు, అధికారులు ఏమని స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read More
Next Story