బ్రహ్మోస్ కొనుగోలు చేయనున్న ఇండోనేషియా?
x

బ్రహ్మోస్ కొనుగోలు చేయనున్న ఇండోనేషియా?

ఈవీఎంలను వాడబోతున్న జకార్తా


ప్రధాని నరేంద్రమోదీ ఇండోనేషియాలో పర్యటించి కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రక్షణ, సముద్ర మౌలిక సదుపాయాలు, ఎన్నికల టెక్నాలజీ వంటి రంగాలలో పరస్పరం సహకరించుకోవాలని అంగీకారానికి వచ్చారు. భారత్- రష్యా తయారీ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి అయిన బ్రహ్మోస్ ను కొనుగోలు చేయడానికి ఇండోనేషియా అంగీకరించింది.

రెండు దేశాలు కలిసి ‘సంబంగ్’ పోర్టు అభివృద్ధి చేయనున్నారు. ఇండోనేషియాలో 2029 లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈవీఎం టెక్నాలజీని బదిలీ చేయడానికి ఇరు దేశాలు సమ్మతించాయి. జకార్తాలో ఇరు దేశాధినేతల మధ్య జరిగిన చర్చల తరువాత అధికారిక ప్రకటనలు వెలువడ్డాయి.

ఈ పర్యటన సందర్భంగా మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం 'బింటాంగ్ ఆదిపూర్ణ'ను కూడా ప్రదానం చేశారు. ఆగ్నేయాసియా - విస్తృత ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ తన వ్యూహాత్మక ఉనికిని బలోపేతం చేసుకునే ప్రయత్నాలలో ఈ ఒప్పందాలు మరో కీలక ముందడుగుగా పరిగణించబడుతున్నాయి.

బ్రహ్మోస్ ఒప్పందం..

సుమారు 630 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందంలో భాగంగా, భారత్ స్వదేశీ బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులతో పాటు అస్త్ర గగనతల క్షిపణులను కూడా కొనుగోలు చేయాలన్న ఇండోనేషియా నిర్ణయమే ఈ ఒప్పందంలో అతిపెద్ద ప్రకటన. ఈ విధంగా వియత్నాం, ఫిలిప్పీన్స్ తర్వాత బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసిన మూడవ దేశంగా ఇండోనేషియా నిలిచింది.
భారత్, రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కార్యాచరణలో ఉన్న సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులలో ఒకటి. దీనిని భూమి, సముద్రం, గాలి నుంచి ప్రయోగించవచ్చు. గత సంవత్సరం పాకిస్థాన్‌తో జరిగిన ఆపరేషన్ సిందూర్, తరువాత నాలుగు రోజుల సంఘర్షణలో భారత్ దీనిని యుద్ధంలో ఉపయోగించిన తర్వాత, ఈ క్షిపణిపై అంతర్జాతీయంగా ఆసక్తి పెరిగింది. ఆధునిక యుద్ధంలో క్షిపణి వ్యవస్థల ప్రాముఖ్యత పెరుగుతోందని ఈ కొనుగోలు ప్రతిబింబిస్తోందని విదేశీ వ్యవహారాల నిపుణుడు కేఎస్ దక్షిణ మూర్తి అన్నారు.
"బ్రహ్మోస్ క్షిపణులు ప్రాథమికంగా భారత్-రష్యా సహకారంతో రూపొందాయి. ఆపరేషన్లలో చాలా ప్రభావవంతంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఇరాన్ యుద్ధంలో, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కూడా క్షిపణులు అత్యంత కీలకమయ్యాయి. కాబట్టి ఇండోనేషియా క్షిపణులను కొనాలనుకోవడంలో ఆశ్చర్యం లేదు.
భారత్, ఇండోనేషియా చాలా బలమైన వాణిజ్య భాగస్వామ్యాన్ని నెరుపుతున్నాయి. ఇది వారి సంబంధానికి సహజమైన పొడిగింపు అవుతుంది" అని ఆయన అన్నారు. వ్యూహాత్మక ఓడరేవు రక్షణ ఒప్పందంతో పాటు, సుమత్రా ఉత్తర కొనలో ఉన్న సబాంగ్ పోర్టును సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి భారత్, ఇండోనేషియా అంగీకరించాయి.
ఈ పోర్ట్, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సముద్ర వాణిజ్య మార్గాలలో ఒకటైన మలక్కా జలసంధికి ఎదురుగా ఉంది. చైనా ముడి చమురు దిగుమతులలో గణనీయమైన వాటా ఈ మార్గం గుండానే వెళుతుంది. ఈ ప్రాజెక్ట్ రెండు దేశాల మధ్య సముద్ర సహకారాన్ని మరింతగా పెంచుతుందని, అదే సమయంలో ఇండో-పసిఫిక్‌లో భారతదేశ వ్యూహాత్మక స్థానాన్ని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.

ఈవీఎం భాగస్వామ్యం..

ఈ పర్యటనలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, భవిష్యత్ ఎన్నికల కోసం భారతదేశ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం) సాంకేతికతను స్వీకరించాలని ఇండోనేషియా తీసుకున్న నిర్ణయం. దాదాపు 2.8 కోట్ల జనాభాతో, ప్రపంచంలో మూడవ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండోనేషియా, ప్రస్తుతం కాగితపు బ్యాలెట్ల ద్వారా ఎన్నికలను నిర్వహిస్తోంది. 2029 సార్వత్రిక ఎన్నికల సన్నాహాల్లో భాగంగా భారత ఈవీఎం సాంకేతికతను ఉపయోగించాలని ఆ దేశం యోచిస్తోంది.
దేశ ఎన్నికల నిర్వహణ వ్యవస్థకు అంతర్జాతీయ గుర్తింపు అంతకంతకూ పెరుగుతోంది. భారత ఎన్నికల సంఘం 28 దేశాల ఎన్నికల అధికారులతో సహకార ఒప్పందాలపై సంతకాలు చేసింది. భారతదేశంలో తయారైన ఈవీఎంలను ఇప్పటికే భూటాన్, నేపాల్, నమీబియాలలో ఉపయోగిస్తున్నారు.
అలాగే, ఆఫ్రికా, ఆసియా ఖండాలలోని పలు దేశాలకు ఎన్నికల కోసం భారతదేశం చెరగని సిరాను కూడా సరఫరా చేస్తోంది. భారతదేశ ఎన్నికల సాంకేతికతపై పెరుగుతున్న అంతర్జాతీయ విశ్వాసానికి ఇండోనేషియా ఒప్పందం మరో సంకేతమని అధికారులు అభివర్ణించారు.

దేశంలో చర్చ..

దేశంలో ఈవీఎంలపై రాజకీయ చర్చలు మళ్లీ మొదలైన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. గత వారం, కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో సహా 23 ప్రతిపక్ష పార్టీలు, ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణపై ఆందోళన వ్యక్తం చేస్తూ, కాగితపు బ్యాలెట్లకు తిరిగి వెళ్లడంపై విస్తృత చర్చ జరపాలని తమ డిమాండ్‌ను మరోసారి లేవనెత్తాయి. ఈ విషయంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కు లేఖ కూడా రాశాయి.
ఎన్నికలపై ప్రజల విశ్వాసం ఎల్లప్పుడూ ప్రధానంగా ఉండాలని, ఈవీఎంలపై కొత్తగా చర్చ జరగాలని ఆ పార్టీలు వాదించాయి. అయితే ఈవీఎంల ట్యాంపరింగ్ పై గానీ, దొంగ ఓట్లకు సంబంధించి గానీ అభ్యంతరాలు లేవనెత్తిన పార్టీలు కనీసం ఒక్క ఉదాహారణ కూడా చూపలేకపోయాయి.
ఈ విమర్శలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ, ఎన్నికల ఓటముల తర్వాత ప్రతిపక్ష పార్టీలు ఈవీఎంలను మామూలుగానే ప్రశ్నిస్తాయని, కేరళతో సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయని పేర్కొన్నారు.
భారత రాజకీయ చర్చకు, ఇండోనేషియా లక్ష్యానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని దక్షిణ మూర్తి వివరించారు. "ఇండోనేషియా ఈవీఎంలను బ్యాలెట్ పేపర్‌కు ప్రత్యామ్నాయంగా మాత్రమే చూస్తోంది. ఆ కోణంలో చూస్తే ఇది భారతదేశానికి మంచిదే, ఎందుకంటే ఈవీఎంలకు కొంత ప్రామాణికత లభిస్తుంది. భారతదేశ ఈవీఎంలను మెచ్చుకున్న ఏకైక దేశం ఇండోనేషియా కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలు కూడా వాటిపై ఆసక్తి చూపాయి," అని ఆయన అన్నారు.

ఇండో-పసిఫిక్ దిశగా ముందడుగు..

అధునాతన క్షిపణి వ్యవస్థల నుంచి వ్యూహాత్మక ఓడరేవులు, ఎన్నికల సాంకేతికత వరకు, జకార్తాలో కుదిరిన ఒప్పందాలు ఆగ్నేయాసియాతో భారత్ కు విస్తరిస్తున్న సంబంధాలను స్పష్టం చేస్తున్నాయి. ఇండోనేషియా పర్యటన అనంతరం, మోదీ తన విస్తృత ఇండో-పసిఫిక్ సంబంధాలలో భాగంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పర్యటించనున్నారు.


Read More
Next Story