శిలకు జీవం పోసే విద్య చదివితే.. టీటీడీ నగదు పురస్కారం...
x
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప కళాశాలలో శిల్పం చెక్కుతున్న కళాకారుడు (ఫైల్)

శిలకు జీవం పోసే విద్య చదివితే.. టీటీడీ నగదు పురస్కారం...

తిరుపతి ఎస్వీ శిల్ప కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం


విద్య సంస్థలు ఉపాధి చూపే కేంద్రాలుగా మారాలి. ఈ మాటను తిరుపతిలోని ఎస్వీ శిల్ప కళాశాల సార్థకం చేస్తోంది. ఇక్కడ చేరే విద్యార్థులకు నగదు డిపాజిట్ చేయడం, కోర్సు పూర్తయిన తరువాత ఉపాధి మార్గం చూపుతున్నారు.

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప కళాశాల ( Sri Venkateswara College of Traditional Temple Architecture and Sculpture ) లో 2026–2027 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈ నెల నాల్గవ తేదీ నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

"టిటిడి ఆధ్వర్యంలో ఏకైక సంప్రదాయ శిల్ప శిక్షణ సంస్థలో ఆలయ నిర్మాణ శిల్పకళను సంరక్షించడం, భవిష్యత్ తరాలకు అందించడంలో టీటీడీ విశిష్ట సేవలందిస్తోంది" అని ప్రిన్సిపల్ వెంకటరెడ్డి చెప్పారు. 1960లో స్థాపించిన ఈ శిల్ప శిక్షణ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో ఏకైకంగా నిలిచింది. భారతీయ సాంప్రదాయ ఆలయ నిర్మాణం, వాస్తు, శిల్పకళలో నైపుణ్యంతో కూడిన శిల్పులను తీర్చిదిద్దుతోంది. భారతీయ సంస్కృతి, వారసత్వ పరిరక్షణలో విద్యార్థులను మార్గనిర్దేశం చేస్తోందని వెంకటరెడ్డి వివరించారు.

నగదు డిపాజిట్ .. ఉపాధి

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళాశాలలో నాలుగు సంవత్సరాల డిప్లొమా కోర్సు, రెండు సంవత్సరాల సర్టిఫికెట్ కోర్సులు బోధిస్తున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను కళాశాలలో నేరుగా లేదా టిటిడి వెబ్ సైట్ లో డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసిన దరఖాస్తులను జూన్ 20వ తేదీ సాయంత్రం లోపు అందజేయాలి.
"తిరుపతిలో ఎస్వీ శిల్ప కళాశాలలో విద్యార్థి చేరిన వెంటనే టిటిడి రూ. లక్ష జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేస్తుంది. కోర్సు పూర్తి చేసిన తరువాత నిబంధనల ప్రకారం వడ్డీతో సహా అందజేస్తుంది" అని ప్రిన్సిపల్ వెంకటరెడ్డి తెలిపారు.
ఈ సంస్థలో శిక్షణ పొందిన వారు టిటిడి ఆలయ నిర్మాణ, పునర్నిర్మాణ విభాగాల్లో స్థపతులు, టెక్నికల్ అసిస్టెంట్లు, కాంట్రాక్టర్లు
దేవాదాయ, పర్యాటక, పురావస్తు శాఖల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. అంతేకాక, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకుంటున్నారు.

కోర్సుల వివరాలు
డిప్లొమా ఇన్ ట్రెడిషనల్ స్కల్ప్చర్ (4 సంవత్సరాలు). రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ, ఏఐసిటిఈ అనుమతితో నిర్వహించే ఈ కోర్సులో ఆరు విభాగాలు ఉన్నాయి.
1.ఆలయ నిర్మాణం
2.శిలా శిల్పం
3. సుధా శిల్పం
4. లోహ శిల్పం
5. కొయ్య శిల్పం
6. సంప్రదాయ వర్ణచిత్ర లేఖనం

ఎంతమందికి అవకాశం..

ఎస్వీ శిల్ప కళాశాలలోని ప్రతి విభాగంలో ఏడాదికి 10 మంది అంటే 60 మందికి ప్రవేశం కల్పిస్తారు. విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం అందుబాటులో ఉంటుంది. చివరి సంవత్సరం విద్యార్థులకు దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ ఆలయాల సందర్శన కూడా కల్పిస్తారు.
కలంకారీ కళలో..

ఈ కాలేజీలో సంప్రదాయ కలంకారి కళలో రెండేళ్ల సర్టిఫికెట్ కోర్సు కూడా అందుబాటులో ఉంది. వస్త్రాలపై సంప్రదాయ చిత్రకళలో శిక్షణనిచ్చే ఈ కోర్సులో ప్రతి సంవత్సరం 10 మందికి ప్రవేశం కల్పిస్తారు. ఉచిత వసతి, భోజనంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు విస్తారంగా ఉన్నాయి. దేశ విదేశాల్లో కలంకారి కళకు మంచి డిమాండ్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ విధానాల ప్రకారం ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది.
Read More
Next Story