సింగపూర్ ఉత్తమ విధానాలను ఓ జిల్లాలో అమలు
x

సింగపూర్ ఉత్తమ విధానాలను ఓ జిల్లాలో అమలు

నేను కాదు.. మనం అంటూ సరికొత్త పాలనా మంత్రాన్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు. సింగపూర్ నమూనా అమలుకు 90 రోజుల యాక్షన్ ప్లాన్.


రాష్ట్ర సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కీలకమైన మార్పును ప్రతిపాదించారు. నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ అని పేర్కొంటూ, సింగపూర్ దేశంలో ప్రజల విశ్వాసాన్ని దక్కించుకున్న అత్యుత్తమ పాలనా విధానాలను రాష్ట్రంలో ప్రవేశపెడతామని ప్రకటించారు. సింగపూర్‌లో మంత్రులకు ఇచ్చే శిక్షణ, అక్కడి పనితీరును స్ఫూర్తిగా తీసుకుని, రాష్ట్రంలోని ఒక జిల్లాను సింగపూర్ మోడల్‌గా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. దీనికోసం ప్రత్యేకంగా 90 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. ముఖ్యంగా అక్కడి నేను కాదు.. మనం (Team Work) అనే ఆలోచనా విధానాన్ని తాను కూడా పాటిస్తానని, పాలనలో ప్రతి ఒక్కరూ దీనిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.

జీఎస్డీపీ గ్రోత్ - జిల్లాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ
రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP) పెరుగుదలపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. దేశ వ్యవసాయ ఉత్పత్తుల్లో ఏపీ వాటా 10 శాతం ఉండటం గమనార్హమని, దీనిని మరింత పెంచాలని సూచించారు. గిరిజన ప్రాంతాలైన పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల మధ్య ఉన్న అభివృద్ధి వ్యత్యాసాన్ని ఆయన ప్రస్తావించారు. అల్లూరి జిల్లాలో కాఫీ పంటకు విలువ జోడింపు (Value Addition) చేయడం వల్ల అక్కడ ఆదాయం మెరుగ్గా ఉందని, ఇలాంటి వినూత్న ఆలోచనలు కలెక్టర్లు చేయాలని కోరారు. కొన్ని జిల్లాల్లో లభ్యమవుతున్న అరుదైన ఖనిజాలను వినియోగించుకుని పరిశ్రమలు ఏర్పాటు చేస్తే అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. రాష్ట్ర స్థాయిలో కలెక్టర్ల మధ్య పోటీ పెట్టినట్లే, జిల్లా స్థాయిలో నియోజకవర్గాల మధ్య అభివృద్ధి పోటీ ఉండేలా చూడాలని సూచించారు.
చిన్న జిల్లాలు.. పెద్ద అవకాశాలు
గతంలో జిల్లాలు పెద్దగా ఉన్నప్పుడు పర్యవేక్షణ కష్టమయ్యేదని, ఇప్పుడు ఒక్కో జిల్లాలో కేవలం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉండటం కలెక్టర్లకు పెద్ద అవకాశమని సీఎం గుర్తుచేశారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం సాంకేతికత అందుబాటులోకి వచ్చిందని, దీనిని సమర్థవంతంగా వాడుకుంటే మెరుగైన సంక్షేమం, అభివృద్ధి అందించవచ్చని చెప్పారు. ఫీల్డ్ లెవల్ ఆఫీసర్ల దగ్గర ఉండే అనుభవాన్ని, సమాచారాన్ని కలెక్టర్లు ఓన్ చేసుకోవాలని, అప్పుడే వినూత్నమైన ఆవిష్కరణలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.
పర్యాటకం, మౌలిక సదుపాయాలు
రాష్ట్రంలోని తీర ప్రాంతాల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక విజన్‌ను పంచుకున్నారు. సూర్యలంక, మంగినపూడి, విశాఖ, శ్రీకాకుళం, మైపాడు వంటి ప్రాంతాల్లో బీచ్ ఫ్రంట్లు (Beach Fronts) అభివృద్ధి చేయడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. కొత్త జాతీయ రహదారుల నిర్మాణం వల్ల వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ, లాజిస్టిక్స్ హబ్ లు, టౌన్ షిప్ ల ఏర్పాటుపై దృష్టి సారించాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
Read More
Next Story