హీట్‌వేవ్ అలర్ట్: భారత్‌లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత
x

హీట్‌వేవ్ అలర్ట్: భారత్‌లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత

ఐఎమ్‌డీ అత్యవసర హెచ్చరికలు


Click the Play button to hear this message in audio format

దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఐఎమ్‌డీ (India Meteorological Department) ప్రకారం.. ఈసారి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదుకానున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీలకు మించి ఎండలు దంచికొట్టనున్నాయి. ఇక కేరళలో అధిక యూవీ కిరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఉత్తర భారతంలో మండుతున్న ఎండలు..

దేశ రాజధాని ఢిల్లీలో ఈ సీజన్‌లోనే అత్యధికంగా 42.8°ఉష్ణోగ్రత నమోదైంది. ఇది గత కొన్ని సంవత్సరాల రికార్డులకు దగ్గరగా ఉంది. ఆదివారం నాటికి ఈ ఉష్ణోగ్రత 44°C వరకు చేరే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదే సమయంలో ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది.

బండా, ప్రయాగ్‌రాజ్, బార్మర్, రోహ్‌తక్ వంటి ప్రాంతాల్లో 45°Cకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో రోజువారీ జీవనం పూర్తిగా ప్రభావితమైంది. రోడ్లపై జనం తక్కువగా కనిపిస్తున్నారు. కార్మికులు, నిర్మాణ రంగంలో పనిచేసేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఎందుకు పెరుగుతున్నాయి?

వడగాలులు ఏర్పడటానికి ప్రధాన కారణం భూమిపై అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ గాలి చలనం, మేఘాల లేమి. భవిష్యత్తులో వడగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఒడిశా, మధ్య భారతంలో అధిక వేడి తీవ్రత..

ఒడిశాలో కనీసం 17 ప్రాంతాల్లో 40°C పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఝార్సుగూడ, టిట్లాగఢ్ అత్యంత వేడి గల ప్రాంతాలు. మధ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. రైతులు, కూలీలు, చిరువ్యాపారులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు.

పెరిగిన విద్యుత్ డిమాండ్..

తీవ్ర వేడి కారణంగా ఎయిర్ కండిషనర్లు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం పెరిగింది. దీనివల్ల దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ 252 గిగావాట్లకు చేరింది. ఇది రానురాను కొన్ని ప్రాంతాల్లో పవర్ కట్స్‌కు దారితీస్తోంది. పరిశ్రమల పనితీరును ప్రభావితం చేస్తోంది.

కొండ ప్రాంతాల్లో ఉపశమనం..

హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో కొంత ఉపశమనం లభించింది. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. జార్ఖండ్‌లో కూడా రానున్న రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.

దక్షిణ భారతంలో వేడి ప్రభావం

దక్షిణ రాష్ట్రాలు కూడా ఈ వేడి ప్రభావం నుంచి జనం తప్పించుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా Keralaలో ఉష్ణోగ్రతలు 40°C వరకు నమోదవుతున్నాయి.

కేరళలో అధిక యూవీ కిరణాలు..

కేరళలో కొన్ని ప్రాంతాల్లో UV ఇండెక్స్ 8 దాటింది. ఇది ప్రమాదకర స్థాయి. అధిక యూవీ వల్ల చర్మ, కంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. చర్మ క్యాన్సర్‌కూ దారితీయొచ్చు. ప్రజలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 మధ్య బయటకు రాకుండా ఉండాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి..

ఏపీలో కూడా ఉష్ణోగ్రతలు 42°C దాటాయి. గ్రామీణ ప్రాంతాల్లో నీటి కొరత తీవ్రంగా ఉంది. వడగాలులు పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.డీహైడ్రేషన్, తల తిరగడం వంటివి సంభవిస్తాయి. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలని వైద్యులు చెబుతున్నారు. వీలైతే ORS, ఎలక్ట్రోలైట్ కలుపుకుని తాగాలని సూచించారు. సాధ్యమయినంత వరకు బహిరంగ కార్యక్రమాలు తగ్గించుకోవాలని సూచించారు.

దేశవ్యాప్తంగా వడగాలుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండటం అత్యంత అవసరం. ఐఎమ్‌డీ సూచనలను పాటించడం, ముందస్తు జాగ్రత్తలే మనకు రక్షణ.

Read More
Next Story