
బరితెగించిన భార్య..భర్త స్నేహితుడితోనే అక్రమ సంబంధం
యూట్యూబ్ చూసి కన్నతల్లితో కలిసి అత్తను హత్య చేసిన కోడలు.
వివాహేతర బంధం మనుషుల మధ్య విచక్షణను ఎలా చంపేస్తుందో చెప్పడానికి నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో జరిగిన ఈ ఘోరమే నిదర్శనం. నమ్మి ప్రాణ స్నేహితుడిని ఇంటికి తెస్తే, ఆ భర్త స్నేహితుడితోనే పద్మశ్రీ అనే మహిళ అక్రమ సంబంధం పెట్టుకుని బరితెగించింది. పచ్చని సంసారంలో చిచ్చు రేపుతున్న ఈ వ్యవహారాన్ని అత్త మాధవి నిలదీయడమే ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా, కులపెద్దల ముందు పంచాయితీ పెట్టినా మారని కోడలు.. తన మోజుకు అడ్డుగా ఉన్న అత్తను శాశ్వతంగా తొలగించుకోవాలని పథకం వేసింది. కన్నతల్లిని కూడా ఈ పాపంలో భాగస్వామిని చేసి, చివరకు నిద్రిస్తున్న అత్తను దిండుతో అదిమి ఊపిరి తీసిన ఈ కిరాతక ఉదంతం ఇప్పుడు స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది.
హత్యకు దారితీసిన అక్రమ బంధం
నెల్లూరు జిల్లా సున్నపుబట్టి గ్రామానికి చెందిన మైపాటి మాధవి అనే మహిళకు తన కోడలు పద్మశ్రీ ప్రవర్తనపై అనుమానం కలిగింది. విచారించగా తన కొడుకు స్నేహితుడితోనే కోడలు అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు తేలింది. ఈ తప్పుడు పనులు మానుకోవాలని అత్త మాధవి పలుమార్లు కోడలిని మందలించింది. అయినా పద్మశ్రీలో మార్పు రాకపోవడంతో వ్యవహారం కులపెద్దల వరకు వెళ్లింది. అక్కడ కూడా పెద్దలు ఆమె ప్రవర్తనను తప్పుబట్టారు. దీంతో అత్తపై పగ పెంచుకున్న పద్మశ్రీ, తన అక్రమ బంధానికి అడ్డుగా ఉన్న ఆమెను శాశ్వతంగా తొలగించుకోవాలని పథకం వేసింది.
యూట్యూబ్‌లో చూసి స్కెచ్ వెసి..
మే 8వ తేదీ రాత్రి, ఇంట్లో నిద్రిస్తున్న అత్త మాధవిని పద్మశ్రీ తన తల్లి పుచ్చలపల్లి మాధవి సహాయంతో అతి దారుణంగా హత్య చేసింది. తప్పించుకోవడానికి ఎటువంటి క్లూ దొరకకూడదని యూట్యూబ్‌లో సీరియల్స్ చూసి నేరం చేయడం నేర్చుకుంది. ముఖంపై దిండు పెట్టి, గొంతు నులిమి శ్వాస ఆడకుండా చేసి ప్రాణాలు తీసింది. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో అసలు నిజం నిప్పులా బయటపడింది. నేరానికి సహకరించిన తల్లిని, హత్య చేసిన కోడలిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల హెచ్చరికలు
ఈ సందర్భంగా డీఎస్పీ రమణకుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం యూట్యూబ్‌లో వస్తున్న క్రైమ్ సీరియల్స్ చూసి కొందరు పక్కదోవ పడుతున్నారని, నేరం చేసి తప్పించుకోవచ్చన్న భ్రమలో ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతికత ఎంత పెరిగినా నేరం చేసిన వారు చట్టానికి దొరకక తప్పదని ఆయన హెచ్చరించారు. చెడు వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఈ కేసును త్వరగా ఛేదించిన రూరల్ సీఐ శివశంకర్, ఎస్సై జంపాని కుమార్, సిబ్బందిని ఆయన అభినందించారు.
Next Story

