ఇది వరకే తనకున్న పాత పరిచయంతో వివాహితను బ్లాక్ మెయిల్ చేయడానికి పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు ఓ వ్యక్తి. సదరు మహిళ ఎంత మొరాయించుకున్నా అతని వేధింపులు ఏమాత్రం తగ్గలేదు. నాతో మాట్లాడు.. వీడియో కాల్స్ చెయ్యి.. లేకపోతే మన పాత ఫోటోలను నీ బంధువులకు, స్నేహితులకు పంపిస్తా.. బంగారం, డబ్బులు ఇవ్వకపోతే నీ ఇంటి వద్దకు వచ్చి అందరి ముందు పరువు తీస్తా అంటూ దుబాయ్ నుంచి ఆ వ్యక్తి సాగిస్తున్న సైబర్ వేధింపులు విజయవాడలో సంచలనంగా మారాయి. ఆధునిక టెక్నాలజీని ఆసరాగా చేసుకుని, పాత పరిచయాన్ని అడ్డుపెట్టుకుని ఒక వివాహిత జీవితాన్ని నరకప్రాయం చేస్తున్న నిందితుడు షేక్ సుభానీపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సరిహద్దులు దాటి సాగుతున్న ఈ డిజిటల్ అరాచకం, బాధితురాలి వ్యక్తిగత గౌరవానికే కాకుండా ఆమె కుటుంబ శాంతికి కూడా సవాలుగా మారింది. నిందితుడు ఏకంగా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి మరీ చేస్తున్న ఈ బ్లాక్‌మెయిల్ పర్వం నగరంలో తీవ్ర చర్చనీయాంశమైంది.
మాయమాటలతో మొదలై.. బ్లాక్‌మెయిల్ వరకు
నగర శివారు ప్రాంతానికి చెందిన ఓ యువతికి, షేక్ సుభానీ అనే యువకుడితో గతంలో పరిచయం ఉండేది. ఆ సమయంలో వీరిద్దరూ కలిసి ఉన్న కొన్ని సన్నిహిత ఫోటోలు, వీడియోలను సుభానీ తన వద్ద దాచుకున్నాడు. అయితే, ఆ యువతికి వివాహం జరిగిన తర్వాత సుభానీ అసలు స్వరూపం బయటపడింది. ఆమె వైవాహిక జీవితాన్ని చిన్నాభిన్నం చేయాలనే దురుద్దేశంతో వేధింపులు ప్రారంభించాడు. ప్రతిరోజూ రాత్రి వేళ ఫోన్ చేసి, తనతో వీడియో కాల్ మాట్లాడాలని బలవంతం చేసేవాడు. ఆమె నిరాకరించడంతో పగ పెంచుకున్నాడు. ఆ యువతి నగ్న చిత్రాలను నేరుగా ఆమె భర్త మొబైల్‌కు పంపి పైశాచిక ఆనందం పొందాడు. అయితే, ఆమె భర్త విజ్ఞతతో వ్యవహరించి, ఆ ఫోటోలను తొలగించి అతని నంబర్‌ను బ్లాక్ చేశారు.
వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి..
భర్త నంబర్ బ్లాక్ చేసినా సుభానీ వెనక్కి తగ్గలేదు. వేర్వేరు అంతర్జాతీయ నంబర్ల నుంచి ఫోన్లు చేస్తూ బెదిరింపులకు దిగాడు. అంతటితో ఆగక, బాధితురాలి ఫోన్ కాంటాక్ట్స్‌లో ఉన్న బంధువులు, స్నేహితులతో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. ఆ గ్రూప్‌లో ఆమె అంతరంగిక చిత్రాలను పెడతానని, అవి ఆపాలంటే భారీగా డబ్బు, బంగారం ముట్టజెప్పాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు.
దుబాయ్ నుంచి స్కెచ్.. పోలీసుల రంగప్రవేశం వేధింపులకు పాల్పడుతున్న నంబర్లను ఆరా తీయగా, సుభానీ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నట్లు బాధితురాలు గుర్తించింది. నిందితుడి భార్య, తల్లి ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఉంటున్నారని, వారి అండదండలతోనే సుభానీ ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడిపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.