హంటావైరస్‌పై భయపడాల్సిన అవసరం లేదు: ఐసీఎంఆర్ స్పష్టీకరణ
x

హంటావైరస్‌పై భయపడాల్సిన అవసరం లేదు: ఐసీఎంఆర్ స్పష్టీకరణ

క్రూయిజ్ షిప్‌లో ఇద్దరు భారతీయులకు హంటావైరస్ సోకినప్పటికీ, భారత్‌లో సామూహిక వ్యాప్తికి ఆధారాలు లేవని స్పష్టం చేసిన ఐసీఎంఆర్


Click the Play button to hear this message in audio format

క్రూయిజ్ షిప్‌లో ఇద్దరు భారతీయులకు హంటావైరస్ సోకినట్లు వచ్చిన వార్తలతో ఆందోళనలు పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) కీలక ప్రకటన చేసింది. ఈ కేసులు విడివిడిగా నమోదైనవేనని, ప్రస్తుతం భారతదేశ ప్రజారోగ్యానికి ఎలాంటి తక్షణ ముప్పు లేదని ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) డైరెక్టర్ డాక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు హంటావైరస్ సామూహికంగా వ్యాపిస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. కోవిడ్-19 లాగానే ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించదని స్పష్టం చేశారు.

వైరస్ వ్యాప్తి ఎలా మొదలైంది?

అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న విలాసవంతమైన క్రూయిజ్ షిప్ ‘ఎంవి హోండియస్’లో ప్రాణాంతక ‘హంటావైరస్’ వ్యాప్తి కలకలం రేపుతోంది. క్రూయిజ్ షిప్ ఏప్రిల్ 1న అర్జెంటీనాలోని ఉషువాయా నుంచి ప్రయాణం ప్రారంభించింది. 23 దేశాలకు చెందిన 149 మంది ప్రయాణికులు, సిబ్బంది ఈ నౌకలో ఉన్నారు. ఉషువాయా సమీపంలో పక్షుల వీక్షణ యాత్ర (Birdwatching Tour) సమయంలో ఎలుకల విసర్జనలతో కలుషితమైన గాలిని పీల్చడం వల్ల వైరస్ వ్యాప్తి చెంది ఉండవచ్చని అర్జెంటీనా పరిశోధకులు భావిస్తున్నారు.

వరుస మరణాలతో భయం..

ఏప్రిల్ 11న మొదటి మరణం నమోదైంది. డచ్ జాతీయుడైన ఓ ప్రయాణికుడు నౌకలోనే మరణించాడు. కొన్ని రోజుల తర్వాత అతని భార్య కూడా మృతి చెందింది. ఏప్రిల్ 27న మరో ప్రయాణికుడు తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌కు తరలించారు. అతనికి ఆండెస్ స్ట్రెయిన్ హంటావైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. మే 2న మరో జర్మన్ ప్రయాణికుడు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య మూడు దాటింది.

ఎలుకల ద్వారా వ్యాప్తి..

హంటావైరస్ ప్రధానంగా ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. ఎలుకల లాలాజలం, మూత్రం, మలం ద్వారా వైరస్ బయటకు వస్తుంది. మూసివేసిన ప్రదేశాల్లో లేదా గాలి సరిగా రాని ప్రాంతాల్లో ఈ వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గిడ్డంగులు, పశువులశాలలు, నిల్వ కేంద్రాలు, ఓడలు వంటి ప్రదేశాల్లో ఎలుకల విసర్జనల నుంచి వెలువడే వైరస్ కణాలను పీల్చడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని వివరించారు.

క్రూయిజ్ షిప్ ఘటనతో వెలుగులోకి..

క్రూయిజ్ షిప్‌లో వైరల్ సోకినట్లు అనుమానిస్తున్న ఇద్దరు భారతీయులకు కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహించి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇది తీవ్రమైన ఘటన అయినప్పటికీ, ప్రజారోగ్య ప్రమాదాన్ని తక్కువగానే అంచనా వేస్తున్నామని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయెసస్ తెలిపారు.

మనుషుల ద్వారా వ్యాప్తి అరుదు..

హంటావైరస్ సాధారణంగా మనుషుల ద్వారా వ్యాపించదు. దక్షిణ అమెరికాలో కనిపించే కొన్ని ప్రత్యేక రకాలలో మాత్రమే పరిమిత స్థాయిలో వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాప్తి విస్తరించిందని డాక్టర్ నవీన్ కుమార్ చెప్పారు. ఆసియా, యూరప్ ప్రాంతాల్లో కనిపించే హంటావైరస్ రకాలలో మానవ వ్యాప్తి చాలా అరుదుగా ఉంటుందని ఆయన వివరించారు.

వ్యాధి లక్షణాలు..

వైరస్ సోకిన ఒకటి నుంచి ఐదు వారాల తర్వాత లక్షణాలు బయటపడవచ్చు. వైరస్ బారిన పడ్డ వ్యక్తిలో ఆకస్మిక జ్వరం, తీవ్రమైన ఒళ్లు నొప్పులు, తలనొప్పి, అలసట, చలి,వికారం, వాంతులు, కడుపు నొప్పి, పొడి దగ్గు లక్షణాలు తొలుత కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి ముదిరిన దశలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తపోటు తగ్గడం, మూత్రపిండాల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

భారత్ సిద్ధంగానే ఉందన్న ఐసీఎంఆర్..

హంటావైరస్‌ను గుర్తించేందుకు భారతదేశానికి తగిన సదుపాయాలు ఉన్నాయని ఐసీఎంఆర్ తెలిపింది. NIVతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 165 వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ ల్యాబ్‌లలో ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది.

పర్యావరణ మార్పులతో ప్రమాదం పెరిగే అవకాశం..

వాతావరణ మార్పులు, వరదలు, ప్రణాళిక లేని పట్టణీకరణ, చెత్త నిర్వహణ లోపాలు ఎలుకల సంఖ్య పెరగడానికి కారణమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాలు, వరదల సమయంలో ఎలుకలు మానవ నివాస ప్రాంతాల్లోకి రావడం వల్ల ఇలాంటి వైరస్‌ల ప్రమాదం పెరిగే అవకాశం ఉందన్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ఎలుకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలి.

గిడ్డంగులు, నిల్వ కేంద్రాల్లో పరిశుభ్రత పాటించాలి.

మూసివేసిన ప్రదేశాల్లో గాలి ప్రసరణ ఉండేలా చూడాలి.

ఎలుకల విసర్జనలను తాకకుండా జాగ్రత్త పడాలి.

ప్రస్తుతం భయపడాల్సిన అవసరం లేదని, కానీ అప్రమత్తతతో ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Read More
Next Story