
న్యూడ్ వీడియో కాల్ చేయకపోయావో, నీ బతుకు బస్టాండే!
పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన ఓ మహిళను న్యూడ్ వీడియో కాల్ చేయాలని బెదిరించిన హైదరాబాద్ వ్యక్తికి విశాఖ పోలీసులు అరదండాలు వేశారు.
ముక్కూ, మొఖం తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకుని మోసపోతున్న మహిళల కేసులు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. యువతులు, విద్యావంతులైన మహిళలు, గృహిణులు సోషల్ మీడియాలో పరిచయమైన వారితో అదుపు తప్పి సన్నిహితంగా మారుతున్నారు. ఈ క్రమంలో తమ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకుంటూ మోసగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. కొందరు వేల రూపాయలు, మరికొందరు లక్షలు కోల్పోతుంటే.. ఇంకొందరు తమ గోప్యతనే ప్రమాదంలో పడేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నాయి. తాజాగా విశాఖపట్నానికి చెందిన ఓ మహిళను న్యూడ్ వీడియో కాల్ చేయాలని బెదిరించిన హైదరాబాద్ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
ఆన్‌లైన్‌లో పబ్జీ ద్వారా పరిచయం..
విశాఖ నగరానికి చెందిన ఓ మహిళకు ఆన్‌లైన్ పబ్జీ గేమ్ ద్వారా హైదరాబాద్‌కు చెందిన నరేన్ వేణుగోపాల్ పసుపులేటి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా వీరిద్దరి మధ్య చాటింగ్ కొనసాగింది. వ్యక్తిగత విషయాలు కూడా పరస్పరం పంచుకున్నారు. దీంతో ఆ మహిళకు వేణుగోపాల్‌పై నమ్మకం పెరిగింది. ఆ తర్వాత ఇద్దరూ సోషల్ మీడియా అకౌంట్లు మార్చుకుని వ్యక్తిగతంగా చాటింగ్ చేసుకున్నారు. ఈ క్రమంలో వేణుగోపాల్ మరింత దగ్గరవుతూ మహిళను న్యూడ్ వీడియో కాల్ చేయాలని ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. అయితే ఆమె అందుకు నిరాకరించింది. అయినప్పటికీ వేణుగోపాల్ తన ఒత్తిడిని కొనసాగించాడు. ఆమె అంగీకరించకపోతే ఆమె వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని, బంధువులకు పంపిస్తానని బెదిరించాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన మహిళ విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీకి ఫిర్యాదు చేసింది.
నిందితుడికి అరదండాలు..
విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆదేశాలతో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు హైదరాబాద్‌కు చెందిన నరేన్ వేణుగోపాల్ పసుపులేటిగా గుర్తించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ జరిపారు. మహిళను న్యూడ్ వీడియో కాల్ చేయాలని ఒత్తిడి చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో పోలీసులు హైదరాబాద్‌లో ఉన్న నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
అపరిచితులతో స్నేహం ప్రమాదం..
అపరిచితులతో స్నేహం చేయొద్దని విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ హెచ్చరించారు. ముఖ్యంగా మహిళలు సోషల్ మీడియాలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. “అపరిచిత వ్యక్తుల నుంచి సోషల్ మీడియాలో ముఖ్యంగా టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి వేదికల ద్వారా వచ్చే ఫ్రెండ్ రిక్వెస్టులను అంగీకరించొద్దు. ఓటీపీలు, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు. సోషల్ మీడియా అకౌంట్లను ప్రైవేట్‌గా ఉంచుకోవాలి. తెలియని లింకులపై క్లిక్ చేయకూడదు” అని సూచించారు.
సైబర్ క్రైమ్ ఫిర్యాదుల కోసం National Cyber Crime Portal ను సంప్రదించవచ్చని తెలిపారు. అలాగే టోల్ ఫ్రీ నంబర్ 1930 లేదా విశాఖ పోలీస్ కమిషనర్ మొబైల్ నంబర్ 7995095799కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.
Next Story

