భార్య కళ్లముందే భర్త మృతి
x

భార్య కళ్లముందే భర్త మృతి

జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం. ఆర్టీసీ బస్సు ఢీకొని సెక్యూరిటీ గార్డు మృతి


విధి నిర్వహణకు వెళ్తూ మార్గమధ్యంలో ఆర్టీసీ బస్సు రూపంలో వచ్చిన మృత్యువు ఒక నిరుపేద కుటుంబాన్ని రోడ్డున పడేసింది. పీఎంపాలెం సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కొమ్మాది శివశక్తినగర్‌కు చెందిన ఎస్‌.బలరామ్‌ (58) గాయత్రీ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. ఉదయం తన భార్య తులసమ్మతో కలిసి ద్విచక్ర వాహనంపై మధురవాడ నుంచి ఆనందపురం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

క్షణాల్లో జరిగిన ఘోరం
బలరామ్ దంపతులు పరదేశిపాలెం కూడలి వద్దకు చేరుకోగానే, విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న ఆర్టీసీ నాన్‌స్టాప్‌ బస్సు వీరి వాహనాన్ని అతివేగంతో బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి బలరామ్ కింద పడిపోగా, ఆయనపై నుంచి బస్సు వెళ్లడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక కూర్చున్న ఆయన భార్య తులసమ్మ గాయాలతో బయటపడినప్పటికీ, తన కళ్ల ముందే భర్త రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటం చూసి తట్టుకోలేకపోయింది.
కంటనీరు పెట్టించిన దృశ్యం
తీవ్ర గాయాలపాలైనప్పటికీ తులసమ్మ తన భర్త మృతదేహంపై పడి బోరున విలపించిన తీరు అక్కడున్న వారిని కంటనీరు పెట్టించింది. సమాచారం అందుకున్న పీఎంపాలెం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రురాలైన తులసమ్మను చికిత్స నిమిత్తం గాయత్రీ ఆసుపత్రికి తరలించారు. బలరామ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు పంపారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్న పోలీసులు, బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More
Next Story